- మూడు బ్యారేజీలపై రీసెర్చ్ ఇంజినీర్ల క్లారిటీ
- నీళ్లు స్టోరేజ్ చేయడం వల్లే మేడిగడ్డ డ్యామేజీ
- వరద వచ్చినప్పుడు గేట్లు ఎత్తడంలో నిర్లక్ష్యం
- టెయిల్ వాటర్ లెవల్ ను పాటించలేదు
- బ్యారేజీల డ్యామేజీకి మోడల్ స్టడీస్ కు సంబంధం లేదని వెల్లడి
- ఓపెన్ కోర్టులో ప్రశ్నించిన కాళేశ్వరం కమిషన్
హైదరాబాద్: మోడల్ స్టడీస్ పూర్తి కాకముందే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని రీసెర్చ్ ఇంజినీర్లు కమిషన్ ఎదుట ఒప్పుకొన్నారు.నిర్మాణానికి ముందు, మధ్యలో, తర్వాత కూడా మో డల్ స్టడీస్ చేశామని తెలిపారు. అయితే మోడల్ స్టడీస్ పూర్తి కాకముందే పనులు మొదలయ్యాయని వివరించారు.
మోడల్ స్టడీస్ తర్వాత బఫెల్ బ్లాక్ లో మార్పులు సవరణలు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని అన్నారు. మేడిగడ్డతో పాటు ఇతర బ్యారేజీలు డ్యామేజీ కావడానికి నీళ్లు స్టోరేజీ చేయడమే ప్రధాన కారణమని కమిషన్ కు తెలిపారు. వరద ఎక్కువగా వచ్చినప్పుడు గేట్లను ఎత్తకుండా ఫీల్డ్ అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు చెప్పారు.
నీళ్లు నిలువ చేయాలని ఎవరు ఆదేశించారని కమిషన్ ఇంజినీర్లను ప్రశ్నించింది. అలాగే అన్నారం బ్యారేజీ నిర్మాణ స్థలాన్ని మార్చిన అంశం రీసెర్చ్ ఇంజినీర్ల దృష్టిలో ఉందా..? అని ప్రశ్నించింది. 2017 నుంచి 2023 వరకు రీసెర్చ్ టీం ఆధ్వర్యంలో మోడల్ స్టడీస్ జరిపినట్టు వివరించారు. ఓ వైపు నిర్మాణం.. మరో వైపు రీసెర్చ్ అన్నట్టుగా సాగిందని వివరించారు.
ఫ్లడ్ రిలేటివ్ వెలోసిటీని గేట్లు ఎత్తకుండా చేశారని అధికారులు కమిషన్ కు వివరించారు. సెకనుకు 3 నుంచి 6 మీటర్ల వేగాన్ని గేట్లు తక్కువ ఎత్తు ఎత్తి టెస్ట్ చేశారని తెలిపారు. ఆ తర్వాత 15 మీటర్లకు పెంచారని చెప్పారు. దాని వల్లే బ్యారేజీ ముందు టెయిల్ వాటర్ లేక కొట్టుకుపోయిందని తెలిపారు.
టెయిల్ వాటర్ లెవల్ మెయింటేన్ చేయాల్సిన బాధ్యత ఫీల్ట్ ఇంజినీర్లదేనని అన్నారు. మేడారం. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై 12 రిపోర్టులను టీజీఈఆర్‌ఎల్ జేడీ కమిషన్ కు అందజేసింది.
విచారణకు ఏడుగురు సీఈలు, అధికారులు
జలసౌధలో ఇవాళ కాళేశ్వరం కమిషన్ నిర్వహించిన ఓపెన్ కోర్టుకు ఏడుగురు చీఫ్ ఇంజినీర్లు హాజరయ్యారు. వాళ్లు గతంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా కమిషన్ ప్రశ్నించింది. ఇంజీనర్ల తోపాటు అడ్మినిస్ట్రేషన్ అధికారులనూ కమిషన్ ప్రశ్నించింది. ఒక్కొక్కరినీ విడివిడిగా ప్రశ్నించింది. మోడల్ స్టడీస్ పైనే కమిషన్ ప్రధానంగా దృష్టి సారించింది.