మేడారం జాతర చరిత్రపై రీసెర్చ్​ జరగట్లె!

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఆదివాసీ గ్రామం మేడారంలో సమ్మక్క, సారలమ్మ జాతర అత్యంత వైభవంగా ముగిసింది. ఫిబ్రవరి 16 వ తేదీ నుండి 19 తేదీ వరకు జరిగిన ఈ జాతరకు ఈ సారి దాదాపు కోటి ముప్పై లక్షల మందికి పైగానే హాజరయ్యారని జిల్లా పాలనా యంత్రాంగం అధికారికంగా ప్రకటించింది. కేంద్ర మంత్రుల నుంచి గవర్నర్, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వంటి వారంతా ఈ జాతరకు లైన్ కట్టినా జాతర చరిత్రను మాత్రం అనుకున్నంత స్థాయిలో ప్రజలకు తెలపడంలో ఫెయిల్‌‌‌‌ అవుతున్నారు. 

దేశంలోనే ఆమాట కొస్తే ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతర చరిత్రపై యూనివర్సిటీలు, రీసర్చ్ కేంద్రాలు, గిరిజన పరిశోధనా సంస్థలు పెద్దగా కృషి చేయడంలేదనే విమర్శలు బలంగా ఉన్నాయి. విగ్రహం, ఆకారంగానీ లేని సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకునేందుకు ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. దీనికి తగ్గట్టు కనీస మౌలిక సదుపాయాలను ప్రభుత్వ శాఖలు కల్పిస్తూనే ఉన్నాయి. ఈ కోణంలో చూస్తే జాతర నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నప్పటికీ, ఈ జాతరకున్న చారిత్రిక నేపథ్యంపై సరైన పరిశోధనలు, అధ్యయనాలు చేయడంలో యూనివర్సిటీలు, ట్రైబల్ రీసెర్చ్ కేంద్రాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 
చరిత్ర చెబుతున్న 
రామచంద్రయ్యను పట్టించుకోలే..
 మేడారం జాతరను సమ్మక్క, సారలమ్మలు ఆనాటి పాలకులైన కాకతీయ రాజులపై పన్ను వసూళ్లకు వ్యతిరేకంగా పోరాటం జరిపారని, ఈ క్రమంలో జరిగిన యుద్ధంలో మొత్తం మేడరాజు కుటుంబం నెలకొరిగారన్న కథ మాత్రమే ప్రచారంలో ఉంది. ఇదే కథనాన్ని తెలుపుతూ, దశాబ్దం క్రితం తెలుగు యూనివర్సిటీ జానపద విజ్ఞాన పీఠం ఒక అధ్యయన గ్రంధాన్ని వెలువరించింది. దీనిలో తాము కొత్తగా  రీసెర్చ్​ చేసిన అంశాలు కాకుండా, అప్పటికే పలువురు చరిత్రకారులు చేసిన రీసెర్చ్‌‌‌‌ గ్రంధాల నుంచి సేకరించినచిన విషయాలనే ప్రస్తావించారు. అంతకు ముందే, దివిటీ అంజనీదేవి, రాజ్ మహమ్మద్, దెందుకూరి సోమేశ్వర్ రావు, సమాచార శాఖ ప్రచురించిన మేడారం ప్రత్యేక సంచిక, పలు దిన పత్రికల్లో ప్రచురితమైన వ్యాసాల నుంచి మాత్రమే విషయం సేకరణ ను తీసుకొని ఈ ప్రత్యేక సంచికను వెలువరించారు. ఉన్నంతలో కనీస సమాచారం ఈ జానపద, గిరిజన విజ్ఞాన పీఠం వెలువరించిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ప్రత్యేక సంచికలో ఉన్నాయి. అయితే, వేయిస్తంభాల శాసనంలో మేడారం ఆదివాసుల పోరాటం పై ప్రస్తావన ఉందని ఈ మధ్య పలు వ్యాసాలూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పద్మశ్రీ పురస్కార గ్రహీత స్కిన్ రామచంద్రయ్య వద్ద మేడారం సమ్మక్క , సారలమ్మ చరిత్ర, జాతరకు సంబంధించిన విస్తారమైన మౌఖిక సమాచారం ఉందని, దీనిని తెలుసుకొని  గ్రంధస్తం చేయడానికి ఏ ప్రభుత్వ విభాగం గానీ, యూనివర్సిటీ పరిశోధకులుగానీ కృషిచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఫారినర్‌‌‌‌‌‌‌‌ అయిన హెమాన్ డార్ఫ్ కూడా ఈ మేడారం జాతర నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. కాగా,  ఇంత పెద్ద మహా జాతరలో  మేడారం సమ్మక్క, సారలమ్మల చరిత్రను తెలియచేసే కళాకారుడైన పద్మశ్రీ రామచంద్రయ్యను సన్మానించాలనే యోచన చేయకపోవడాన్ని కూడా తప్పుపడుతున్నారు.  ప్రతీసారి  మేడారం జాతరకు కనీసం 80  కోట్ల రూపాయలను సౌకర్యాల కల్పనకై  రాష్ట్ర ప్రభుత్వం  విడుదల చేస్తోంది. దీనిలో కనీసం ఒక ఇరవై లక్షల రూపాయల మూలధనాన్ని కాకతీయ యూనివర్సిటీ లేదా వరంగల్ లోని గిరిజన పరిశోధనా పీఠం వద్ద డిపాజిట్ చేస్తే వాటిపై వచ్చే వద్దే మొత్తంపై ప్రతీ రెండేళ్లకోసారి జాతర చరిత్రపై ప్రత్యేక సదస్సులు నిర్వహించేందుకు  వీలవుతుంది. ఇదేదో గిరిజన జాతరగానే చూడకుండా తమ ఆత్మ గౌరవం కోసం తమను నమ్ముకున్న వారికి పోరాటం చేసిన వీర వనితలైన సమ్మక్క, సారలమ్మల కథ, పోరాట చరిత్ర, దీనికి దారితీసిన పరిస్థితులు తదితర అంశాలపై మరింత విస్తృత స్థాయిలో స్టడీ, రీసెర్చ్​ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రీసెర్చ్‌‌‌‌పై అశ్రద్ధ..
మేడారం జాతర జరిగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న కాకతీయ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీకి చెందిన గిరిజన పరిశోధన విజ్ఞాన పీఠం, పక్కనే ఉన్న శాతవాహన, తెలంగాణా యూనివర్సిటీలు కూడా మేడారం జాతరపై పెద్దగా రీసెర్చ్‌‌‌‌ చేయడం లేదనే చెప్పవచ్చు. సహజంగానే ఆదివాసీ, మూలవాసి చారిత్రిక అంశాలన్నీ అప్పటి వాడుక భాషలోనే ఉంటాయి. కేవలం ఓరల్‌‌‌‌ సాహిత్యాన్ని వెతికి  పట్టుకొని పరిశోధిస్తే ఎంతోవిలువైన చారిత్రక అంశాలు, అప్పటి సామాజిక, ఆర్థిక, జీవన విధానాలు బహిర్గతమవుతాయి. ఈ విషయంలో దళిత కళారూపాలపై విస్తృత స్థాయిలో పరిశోధకులు స్టడీ చేయడం, వాటిని  చదివి సరికొత్త అంశాలను వెలికి తీస్తున్నారు.  అయితే, దళిత సాహిత్యంపై జరుగుతున్నంతగా, మేడారం జాతర విషయంలో మాత్రం పెద్దగా పరిశోధనలు మాత్రం రావడంలేదు. వీటిని చరిత్ర, గిరిజన పరిశోధనా విభాగాలు కూడా పెద్దగా ప్రోత్సహించడంలేదనే విమర్శలున్నాయి. 

కె.వెంకటరమణ, సోషల్ ఎనలిస్ట్