కానిస్టేబుల్ వేధింపులు భరించలేక రీసెర్చ్ స్కాలర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఉద్యోగం ఇప్పిస్తానని తండ్రి తీసుకున్న డబ్బు తిరిగివ్వాలని ఆమెను వేధించడంతో మనస్తాపానికి గురై ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాచారం పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకున్న ఘటన వివరాలివీ..!
నాచారంలోని బాపూజీనగర్ సరస్వతీకాలనీకి చెందిన పులివర్తి దీప్తి(28) హబ్సిగూడలోని ఐఐసీటీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ)లో ప్రాజెక్టు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. దీప్తి తండ్రి సంగీతరావు ఐఐసీటీలో పనిచేసి పదవీ విరమణ పొందారు. సంగీతరావుకు డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బెల్లా అనిల్‌తో పరిచయముంది.
సంగీతరావు.. అనిల్ భార్య అనితకు ఐఐసీటీలో ఉద్యోగం ఇప్పిస్తానని రెండేళ్ల క్రితం రూ.15 లక్షలు తీసుకున్నాడు. ఈ ఏడాది ( 2024) సెప్టెంబరు వరకూ ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో అనిల్ తన డబ్బు తిరిగివ్వాలని దీప్తిని అడిగేవాడు. డబ్బు తన తండ్రి తీసుకున్నాడని, ఆయన తమతో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండడం లేదని సమాధానం చెప్పింది. అనిల్ పట్టించుకోకుండా తన భార్యతో నాచారం ఠాణాలో ఫిర్యాదు చేయించాడు. దీప్తి, సంగీతరావు మీద ఛీటింగ్ కేసు నమోదైంది. అనిల్, అనిత న్యాయస్థానంలో సివిల్ దావా కూడా వేశారు. మనస్తాపానికి గురైన దీప్తి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి వచ్చి చూసేసరికి అప్పటికే మరణించింది. ఫోన్ తనిఖీ చేస్తే.. సెల్ఫీ వీడియో ఉంది. నాచారం పోలీసులు అనిత, అనిల్, సోమయ్య, సైదులు మీద కేసు నమోదు చేశారు.
వీడియోలో ఏముందంటే..!
‘‘నా మరణానికి అనిల్, ఆయన భార్య అనిత, ఆమె తండ్రి సోమయ్య కారణం. నాన్న డబ్బు తీసుకుంటే నామీద నకిలీకేసు నమోదు చేయించి జీవితాన్ని నాశనం చేశారు.ఈ కేసుల మీద పోరాడే స్తోమత లేదు. నా మరణంతోనైనా కుటుంబానికి న్యాయం జరుగుతుంది. నా చావుకు కారణమైన వాళ్లకు శిక్షపడాలి. నా మృతదేహాన్ని వైద్య పరిశోధనకు ఇచ్చేయండి’’ అని కన్నీరు పెట్టుకుంటూ సెల్ఫీ వీడియో చిత్రీకరించింది