
- కొత్త డయాబెటిస్ టైప్ 5
- పోషకాహార లోపంతో వస్తున్నట్టు గుర్తింపు
- కనిపెట్టడం కష్టం.. ట్రీట్మెంటూ లేదు అధికారికంగా ప్రకటించిన ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్
- ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల మంది ‘టైప్ 5’ బాధితులు
- వీరిలో 19 ఏండ్లలోపు వాళ్లే ఎక్కువ
- మన దేశంలో 8.98 కోట్ల మందికి షుగర్ ఉన్నట్టు నివేదిక
హైదరాబాద్, వెలుగు: ఇప్పటిదాకా టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ గురించే అందరికీ తెలుసు. కానీ, ఆ జాబితాలోకి ఇప్పుడు కొత్తగా మరో రకం మధుమేహం వచ్చి చేరింది. ‘టైప్ 5’ డయాబెటిస్‌గా దానిని ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (ఐడీఎఫ్) అధికారికంగా గుర్తించింది. మిగతా డయాబెటిస్ రకాలతో పోలిస్తే ఇది కొంచెం వేరుగా ఉంటుందని, ప్రాణాంతకంగా పరిణమించే ముప్పూ ఎక్కువేనని చెబుతున్నారు.
టైప్1, టైప్2 డయాబెటిస్లు ఊబకాయంతో లేదంటే జన్యు సమస్యలతో వస్తుంటాయి. కానీ, ఈ టైప్ 5 డయాబెటిస్‌కు ప్రధాన కారణం పోషకాహారలోపమేనని సైంటిస్టులు వెల్లడించారు. ఎక్కువగా19 ఏండ్లలోపు యువతలోనే ఈ రకం డయాబెటిస్ డెవలప్ అవుతున్నదని పేర్కొంటున్నారు. ఇటీవల థాయిలాండ్‌లో నిర్వహించిన డయాబెటిస్ సదస్సులో టైప్ 5 డయాబెటిస్‌ను ఐడీఎఫ్ అధికారికంగా ప్రకటించింది.
మామూలుగా అయితే.. టైప్1, టైప్2 డయాబెటిస్లను ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా ట్రీట్ చేయొచ్చని, కానీ టైప్ 5 డయాబెటిస్‌ను ఇన్సులిన్ ఇంజెక్షన్తోనూ కంట్రోల్ చేయలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, కొంచెం కొంచెం ఇన్సులిన్‌తోపాటు ఓరల్ మెడిసిన్స్ఇస్తే ఫలితాలు ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిని గుర్తించడం కష్టమని, ప్రాణాంతకంగా మారే ప్రమాదమూ ఎక్కువేనని చెబుతున్నారు. వచ్చే రెండేండ్లలో దీనిని గుర్తించే డయాగ్నస్టిక్ టెస్టులు, ట్రీట్మెంట్లపై అధ్యయనాలను సైంటిస్టులు ముమ్మరం చేస్తున్నారు. తెలంగాణలోనూ ఇలాంటి కేసులు వస్తున్నట్టుగా డయాబెటిస్ నిపుణులు చెబుతున్నారు. అయితే, ఎన్ని కేసులు వస్తున్నాయన్నది మాత్రం ప్రస్తుతం పర్ఫెక్ట్ లెక్కలు లేవని అంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల కేసులు..
టైప్ 5 డయాబెటిస్ కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నట్టు ఐడీఎఫ్ సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 2.5 కోట్ల మంది దాని బారిన పడ్డారని చెబుతున్నారు. ఆసియా, ఆఫ్రికా రీజియన్లలోనే ఈ కేసులు ఎక్కువగా వస్తున్నట్టు గుర్తించారు. రెండేండ్ల క్రితం వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి చెందిన శాస్త్రవేత్తలతో కలిసి ఐడీఎఫ్ పరిశోధకులు ఓ స్టడీ నిర్వహించారు. పోషకాహారలోపం ఉన్న వాళ్లలో ఇన్సులిన్ స్రావాలు రావడం లేదని తేల్చారు. దానిని ఆదిలోనే తెలుసుకోవడం కూడా కష్టమేనని నిర్ధారించారు. దానిబారిన పడ్డాకే అది టైప్ 5 డయాబెటిస్‌గా తేల్చడం సాధ్యమవుతున్నదని గుర్తించారు.
ఆ స్టడీ ఆధారంగా ప్రపంచంలోని వివిధ దేశాల్లోనూ అధ్యయనాలు చేసిన ఐడీఎఫ్.. తాజాగా దానిని అధికారికంగా ప్రకటించింది. అంతకుముందు దానికి సంబంధించి కన్సెన్సస్ (పరస్పర సమ్మతి) డాక్యుమెంట్లను ఈ ఏడాది జనవరిలో ఇండియాలోనే రూపొందించారు. ఆ డాక్యుమెంట్ల ఆధారంగా ఈ నెల 7న థాయిల్యాండ్‌లోని బ్యాంకాక్‌లో నిర్వహించిన సదస్సులో అఫీషియల్‌గా పోషకాహారలోపం కారణంగా వచ్చే మధుమేహాన్ని టైప్5 డయాబెటిస్‌గా నిర్ధారిస్తూ ప్రకటన చేశారు. టైప్ 5 డయాబెటిస్‌ను తొలుత టైప్1 డయాబెటిస్‌గా చాలా మంది భావించారని సైంటిస్టులు చెబుతున్నారు. టైప్ 1 డయాబెటిస్‌లో ఎక్కువ మొత్తంలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఉన్నా కీటోన్యూరియా, కీటోసిస్ డెవలప్ కాదని, అదే టైప్5లో ఇవి ఉత్పత్తి అవుతున్నాయని గుర్తించారు.
1955లోనే గుర్తించినా..
టైప్5 డయాబెటిస్‌ను1955లోనే తొలిసారిగా జమైకాలో గుర్తించినట్టు సైంటిస్టులు చెబుతున్నారు. ఆ తర్వాత 1985లో దీనిని విభిన్నమైన మధుమేహంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) క్లాసిఫై చేసిందని, కానీ అది పోషకాహారలోపంతోనే వస్తుందని చెప్పేందుకు సరైన ఆధారాలను అప్పుడు సమర్పించలేకపోవడంతో 1999లో ఆ కేటగిరీ నుంచి తప్పించిందని గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత 2005 నుంచి సైంటిస్టులు దీనిపై పరిశోధనలు మొదలుపెట్టారు. ఐడీఎఫ్‌కు చెందిన డాక్టర్మెరిడిత్ హాకిన్స్ నేతృత్వంలోని సైంటిస్టుల బృందం ఐన్‌స్టీన్ గ్లోబల్ డయాబెటిస్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేసి ఇండియా సహా వివిధ దేశాల్లో అధ్యయనాలు చేసి ఆధారాలు సమర్పించారు. దీంతో దానిని టైప్5 కేటగిరీలో చేర్చారు. ఇప్పుడు డబ్ల్యూహెచ్‌వో ఆమోదానికి పంపనున్నారు.
దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరికి షుగర్
మన దేశంలో టైప్1, టైప్ 2 డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయని ఐడీఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. 2024లో ప్రతి ఏడుగురిలో ఒకరు డయాబెటిస్తో బాధపడుతున్నారని పేర్కొంది. డయాబెటిస్ కేసులపై 11వ ఎడిషన్ అట్లాస్‌ను ఐడీఎఫ్ విడుదల చేసింది. మన దేశంలో ప్రస్తుతం 8.98 కోట్ల మంది షుగర్‌తో బాధపడుతుండగా.. 3,34,922 మంది డయాబెటిస్ కారణంగా చనిపోయినట్టు వెల్లడించింది.
డయాబెటిస్ కేసులు ఎక్కువున్న దేశాల్లో నెంబర్ 2 ఇండియానే అని తెలిపింది. 2050 నాటికి షుగర్ కేసులు 75 శాతం పెరిగి.. 15.67 కోట్లకు చేరుకునే ప్రమాదం ఉందని పేర్కొంది. డయాబెటిస్ ఉన్నోళ్లలో దాదాపు 84 శాతం మందికి గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉందని తేల్చింది. పట్టణాల విస్తరణ, వలసలు, లైఫ్‌స్టైల్ కారణంగా మధుమేహం కేసులు భారీగా పెరుగుతాయని తెలిపింది. డయాబెటిస్‌పై ఒక్కొక్కరు సగటున రూ.9,500 దాకా ఖర్చు చేస్తున్నట్టు పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థపై డయాబెటిస్ భారం రూ.80 వేల కోట్ల దాకా ఉంటున్నదని తెలిపింది. కాగా, 2024లో 9.41 లక్షల మంది టైప్1 డయాబెటిస్తో బాధపడుతుండగా.. అందులో 20 ఏండ్లలోపు వాళ్లే 3.01 లక్షల మంది ఉన్నారని వెల్లడించింది.