బ్యూరోక్రసీలో పెద్ద పొజిషన్‌కి వెళ్లే ఛాన్స్ ఐఏఎస్, ఐపిఎస్, ఐఆర్‌ఎస్ లేదా ఫారెస్ట్ సర్వీస్ నుంచి వచ్చినవాళ్లకే ఎక్కువ. గతంలో మాదిరిగా సీనియర్ బ్యూరోక్రాట్ కావాలంటే సివిల్ సర్వీసెస్ నుంచే వెళ్లక్కరలేదు. యూపీఎస్సీ ఎగ్జామ్ రాయకుండానే కార్పొరేట్ రంగాల్లో రాణించినవాళ్లెవరైనా డైరెక్ట్‌గా జాయింట్ సెక్రటరీ పొజిషన్‌కి వెళ్లే అవకాశాన్ని మోడీ ప్రభుత్వం కల్పించింది. 2014లో ప్రవేశపెట్టిన లేటరల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా ప్రొఫెషనల్స్‌ని తీసుకోవడం మొదలైంది. బయటి నుంచి వచ్చిన నిపుణులకు జాయింట్ సెక్రెటరీ వంటి కీలక హోదా ప్రభుత్వం కల్పిస్తుంది. ఇదొక సంప్రదాయంగా మారితే… అట్టడుగు వర్గాలకు దక్కాల్సిన సామాజిక న్యాయం దక్కదని, రిజర్వేషన్ల స్ఫూర్తే దెబ్బతింటుందని సోషల్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
లేటరల్ ఎంట్రీ స్కీం పేరుతో ఎస్సీలకు, ఎస్టీలకు రాజ్యాంగపరంగా అమలు చేయాల్సిన రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం గండి కొడుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ సీనియర్ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దీనికి సంబంధించిన సంకేతాలు గతంలోనే ఇచ్చిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించకతప్పదు. ‘‘ఉన్నా లేకపోయినా ఏమాత్రం తేడా రాని పరిస్థితికి రిజర్వేషన్లను మా ప్రభుత్వం తీసుకెళుతుందని ” రెండేళ్ల కిందట జోధ్ పూర్ లిటరేచర్ ఫెస్టివల్ సందర్భంగా మాట్లాడుతూ స్వామి చెప్పిన మాటను ఢిల్లీలో ఇప్పుడు చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షలు రాయకుండా, ఇంటర్వ్యూ అటెండ్ చేయకుండా డైరెక్ట్‌గా ఇండియన్ బ్యూరోక్రటిక్ వ్యవస్థలో ఎవరైనా చేరే అవకాశం దీని ద్వారా కలుగుతుంది. ఈ లేటరల్ ఎంట్రీ స్కీం ద్వారా బ్యూరోక్రాట్లుగా చేరడానికి దాదాపు 40 మంది ప్రొఫెషనల్స్ రెడీగా ఉన్నారు.
కేంద్రం ఉద్దేశమేంటి ?
ఐఏఎస్‌ల డామినేషన్ ఉండే మన బ్యూరోక్రసీలో బయటి వ్యక్తి రావడం ఇదే తొలిసారి కాదు. అయితే పెద్ద సంఖ్యలో అవుట్ సైడర్స్ బ్యూరోక్రాట్ వ్యవస్థలోకి ఎంటరవడంమాత్రం ఇదే ఫస్ట్ టైమ్. ఇందుకు వీలుగా మోడీ ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే తొమ్మిది మంది ప్రొఫెషనల్స్‌ను జాయింట్ సెక్రెటరీలుగా నియమించడానికి కేంద్రం ఓకే చెప్పింది. ‘ప్రభుత్వ అధికార వ్యవస్థలో దీనిని అతి పెద్ద లేటరల్ ఎంట్రీ’గా సామాజిక కార్యకర్తలు పేర్కొన్నారు. ఈ స్కీం ద్వారా బయటివ్యక్తులు దొడ్డి దారిన బ్యూరోక్రాట్లుగా ప్రవేశించడం వల్ల ఏకంగా రిజర్వేషన్ల వ్యవస్థే ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు సామాజిక కార్యకర్తలు. ఇక్కడో తిరకాసు ఉంది. లేటరల్ ఎంట్రీ స్కీం ద్వారా ఒకసారి ఒక్కో పోస్టును భర్తీ చేస్తారు. ఇలా ఒక పోస్టు భర్తీ చేసినప్పుడు రిజర్వేషన్లు అమలు కావని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ‘డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ’(డీవోపీటీ) బదులిచ్చింది.
చట్టంలోని ఈ లొసుగును ఆధారం చేసుకుని మొత్తం రిజర్వేషన్లకే మోడీ ప్రభుత్వం ఎసరు పెడుతోందంటున్నారు సోషల్ సైంటిస్టులు. ఈ ఏడాది ఏప్రిల్‌లో తొమ్మిది మంది ప్రొఫెషనల్స్ అంబర్ దూబే, రాజీవ్ సక్సేనా, సుజిత్ కుమార్ బాజ్ పేయి, సౌరభ్ మిశ్రా, దినేశ్ దయానంద్ జగ్ దాలే, కకోలి ఘోష్, భూషణ్ కుమార్, అరుణ్ గోయల్, సుమన్ ప్రసాద్ సింగ్ ను జాయింట్ సెక్రెటరీలుగా కేంద్ర ప్రభుత్వం సెలెక్ట్ చేసింది. త్వరలో వీరు బ్యూరోక్రాట్లుగా మోడీ సర్కార్‌లో చేరబోతున్నారు. అయితే ఈ తొమ్మిది మంది సెలక్షన్ కు ముందు వివిధ సోషల్ కేటగిరీల నుంచి వచ్చిన అప్లికేషన్లకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు యూపీఎస్ సీ బదులివ్వడానికి నిరాకరించింది. బ్యూరోక్రటిక్ వ్యవస్థలోకి ఈ తొమ్మిది మంది ప్రవేశంతోనే బయటివ్యక్తుల రాకకు ఫుల్ స్టాప్ పడదు. జాయింట్ సెక్రటరీలుగా అధికార వ్యవస్థలోకి ఎంట్రీ ఇవ్వడానికి డజన్ల కొద్దీ ప్రొఫెషనల్స్ రెడీగా ఉన్నారు. మొత్తం 54 ప్రధాన పోస్టులను ఇలా లేటరల్ ఎంట్రీ స్కీం ద్వారా భర్తీ చేయవచ్చని నీతి ఆయోగ్ గుర్తించింది.
ఏప్రిల్ బ్యాచ్‌లో తొమ్మిది మంది జాయింట్ సెక్రటరీలుగా రిక్రూట్ అయితే, మరో 40 మందికి పైగా డిప్యూటీ సెక్రటరీ, డైరెక్టర్ స్థాయి పోస్టుల్లో చేరడానికి రెడీగా ఉన్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. ఇదేదో అప్పటికప్పుడు అనుకుని చేస్తున్న పని కాదు. తమకు కావలసిన వ్యక్తులను ప్రొఫెషనల్స్ పేరుతో లేటరల్ ఎంట్రీ స్కీం ముసుగులో ఉన్నత పదవుల్లో కూర్చోపెట్టడానికి జరుగుతున్న ఓ పకడ్బందీ వ్యూహం అని సోషల్ సైంటిస్టులు విమర్శిస్తున్నారు. ఎవరైనా సరే ప్రొఫెషనల్ పేరు చెప్పుకుని డైరెక్ట్‌గా జాయింట్ సెక్రటరీ స్థాయి ఉద్యోగాల్లో చేరడం ఒక సంప్రదాయంగా మారితే… టోటల్‌గా అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం కింద అమలు చేయాల్సిన రిజర్వేషన్ల స్ఫూర్తే దెబ్బతింటుందని సోషల్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ, తమ ఐడియాలజీకి దగ్గరగా ఉన్న వారిని ఇలా ప్రొఫెషనల్స్ పేరుతో హయ్యర్ పోస్టుల్లో కూర్చోబెట్టే అవకాశాలు ఉన్నాయని వీరు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల అధికారపక్షానికి భిన్నమైన ఐడియాలజీ ఉన్న వారికి ఉన్నత ఉద్యోగాలు ఏమాత్రం దక్కవని వీరు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
తగ్గిన యూపీఎస్సీ నియామకాలు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు చేయడం ఇటీవలి కాలంలో బాగా తగ్గిందని లెక్కలు చెబుతున్నాయి. 2014లో 1,236 నియామకాలు జరగ్గా 2018 నాటికి ఈ సెలెక్షన్స్ కేవలం 759కే పరిమితమయ్యాయి. దీనికి తోడు లేటరల్ ఎంట్రీ స్కీం పేరుతో బయటి వ్యక్తులు ప్రవేశిస్తే రాజ్యాంగబద్ధంగా అమలు కావాల్సిన రిజర్వేషన్ల సంగతి ఏంటని సామాజిక శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు.
లేటరల్ ఎంట్రీ స్కీం పరిధి పెంపు?
మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన లేటరల్ ఎంట్రీ స్కీం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఈ స్కీం పేరుతో కేంద్రంలో పలుకుబడి ఉంటే ప్రొఫెషనల్ అనే పేరుతో ఏకంగా జాయింట్ సెక్రటరీ హోదా ఉద్యోగంలోకి ప్రవేశించే అవకాశం వస్తుందని, ఇది కరెక్ట్ పద్దతి కాదన్న వాదన వినిపిస్తోంది. ప్రొఫెషనల్ అంటే ఎవరు, ఏమేం క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎన్నేళ్ల అనుభవం ఉండాలి అనే అంశాలపై ఇప్పటివరకు ఎలాంటి గైడ్ లైన్స్ లేవు. ఇదిలా ఉంటే లేటరల్ ఎంట్రీ స్కీం పరిధిని మరింత పెంచాలని డీవోపీటీ భావించడం ఆందోళన కలిగిస్తోంది. డిప్యూటీ సెక్రటరీ, డైరెక్టర్ స్థాయి ఉద్యోగాలకు బయటి వ్యక్తులను మూడేళ్ల పాటు నియమించాలని డీవోపీటీ భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. అలాగే వారి పనితీరు బాగుంటే సర్వీసు మరో రెండేళ్లు పొడిగించాలని కేంద్రం భావిస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం.
పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ ప్రైవేటీకరణ
పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ (పీఎస్‌యూ) నష్టాల్లో నడుస్తున్నాయన్న వాదన లో వాస్తవం ఉన్నప్పటికీ చాలా మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రధాన సోర్స్ ఇదే. పీఎస్‌యూలు తప్పనిసరిగా రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది. అయితే నష్టాలు వస్తున్నాయన్న సాకు చూపించి వీటిని ప్రైవేటీకరిస్తే రిజర్వేషన్ల అమలుకు అవకాశం ఉండదు. ఇప్పటికే 42 పీఎస్‌యూలను ప్రైవేటీకరించాలని నీతి ఆయోగ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాల సమాచారం. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ రెండు నెలల కిందట ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు.
రిజర్వేషన్లను తప్పనిసరిగా అమలు చేయాలని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 16 (4), 46, 335 రిజర్వేషన్ల అమలుకు అండగా నిలుస్తున్నాయి. అయితే మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రిజర్వేషన్ల అమలుకు తూట్లు పొడుస్తున్నాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. రిజర్వేషన్ల అమలు సంగతి ఎలాగున్నా హయ్యర్ బ్యూరోక్రసీలో ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రాతినిధ్యం ఇప్పటికీ తక్కువేనన్న అభిప్రాయం సమాజంలో ఉంది. లేటరల్ ఎంట్రీ స్కీం పేరుతో బయటివ్యక్తులు వస్తే అట్టడుగు వర్గాల ప్రాతినిధ్యం
మరింత తగ్గే ప్రమాదం ఉందంటున్నారు సోషల్ సైంటిస్టులు.
జాయింట్ సెక్రటరీ కావాలంటే…
2014లో బ్యూరోక్రసీ వ్యవస్థను పరుగులు పెట్టించాలని కేంద్రం నిర్ణయించింది. లేటరల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా ప్రొఫెషనల్స్‌ని తీసుకుని జాయింట్ సెక్రటరీలుగా అపాయింట్ చేసుకోవాలని నీతి ఆయోగ్ సలహా ఇచ్చింది. ఈ లేటరల్ ఎంట్రీ స్కీమ్‌కి రాష్ట్ర ప్రభుత్వాల్లో అదే పొజిషన్‌లో పనిచేసినవారు; పీఎస్‌యూలు, అటానమస్ బాడీస్, యూనివర్సిటీలు, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లు, ప్రైవేటు సెక్టార్ కంపెనీలు, కన్సల్టెన్సీలు, మల్టీ నేషనల్ సంస్థలలో ప్రతిభ కనబరిచినవారై ఉండాలి. పై విభాగాల్లో కనీసం 15 ఏళ్ల అనుభవంతోపాటు, 40 ఏళ్లు దాటినవారి నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తారు. వీరిని మూడేళ్లపాటు కాంట్రాక్ట్ బేసిస్‌పై నియమించి, పనితీరును బట్టి మరో రెండేళ్లపాటు కాంట్రాక్ట్ పొడిగించే అవకాశం ఉంది. జాయింట్ సెక్రటరీలుగా అపాయింట్ అయినవారికి ఆ పోస్టులోని ఇతర సివిల్ సర్వీసెస్ అధికారులకు చెల్లించినట్లే జీత భత్యాలుంటాయి. తాజాగా ఎంపికైన 9 మంది తీసుకోబోయే శాఖల వివరాలను చూస్తే… కాకోలీ ఘోష్ (వ్యవసాయ, సహకార, రైతాంగ సంక్షేమం), అంబర్ దూబే (సివిల్ ఏవియేషన్), అరుణ్ గోయల్ (వాణిజ్యం), రాజీవ్ సక్సేనా (ఆర్థిక వ్యవహారాలు), సుజిత్ కుమార్ బాజ్‌పేయి (పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులు), సౌరబ్ మిశ్రా (ఫైనాన్షియల్ సర్వీసెస్), దినేశ్ దయానంద్ జగ్‌దలే (రెన్యూవబుల్ ఎనర్జీ), సుమన్ ప్రసాద్ సింగ్ (రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేలు), భూషణ్ కుమార్ (షిప్పింగ్) ఉన్నారు. ఈ సెలక్షన్‌కి సంబంధించిన ఇప్పటికే అనేక అభ్యంతరాలున్నాయి. సివిల్ ఏవియేషన్ జాయింట్ సెక్రటరీగా ఎంపికైన అంబర్ దూబే నెదర్లాండ్స్‌కి చెందిన ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ క్లైన్‌వెల్డ్ పీట్ మార్విక్ గోర్డెలర్ (కేసీఎంజీ)లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే, ఎన్విరాన్‌మెంట్ శాఖకి ఎంపికైన సుజిత్ బాజ్‌పేయి పబ్లిక్ సెక్టార్ సంస్థ నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్‌లో సీనియర్ మేనేజర్‌గా పనిచేశారు. అంబర్ దూబే ట్యాక్స్ కన్సల్టెన్సీకి చెందిన వ్యక్తి కాగా, సుజిత్ కుమార్ చాలా జూనియర్ అనే అభిప్రాయం ఉంది.