విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కీలకం

విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కీలకం. ఓబీసీ/బీసీ రిజర్వేషన్లకు సంబంధించి క్రీమిలేయర్​ ఆదాయ పరిమితిని ప్రతి మూడేండ్ల కోసారి సమీక్షించాల్సి ఉన్నా.. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.1993 నుంచి 2022 వరకు క్రీమిలేయర్(సంపన్న శ్రేణి) ఆదాయ పరిమితిని తొమ్మిది సార్లు పెంచాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం నాలుగు సార్లు మాత్రమే పెంచారు. దీంతో లక్షలాది ఓబీసీ/బీసీ నిరుద్యోగులు, విద్యార్థులకు అర్హత దక్కక రిజర్వేషన్లు కోల్పోయే పరిస్థితి నెలకొంది. కేంద్రంలో జనతాదళ్ ప్రభుత్వం విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధాన మంత్రి సారథ్యంలో 1990లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులుగా గుర్తింపు పొందిన ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) కోటాలో 27 శాతం రిజర్వేషన్లకు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై సుప్రీంకోర్టు 9 మంది జడ్జీల బెంచ్ 6:3 మెజారిటీ తీర్పుతో ఓబీసీ రిజర్వేషన్లను ఆమోదించింది. ఓబీసీ/బీసీ రిజర్వేషన్లలో క్రీమిలేయర్(సంపన్న శ్రేణి) వర్గాలను గుర్తించి, వారిని రిజర్వేషన్ల పరిధి నుంచి తొలగించాలని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

2017లో పెంపు..
 కేంద్రం1992లో ఓబీసీల్లో సంపన్న శ్రేణిని గుర్తించడానికి జస్టిస్ రామ్ నందన్ ప్రసాద్ అధ్యక్షతన జాతీయ స్థాయి నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదికను సమర్పిస్తూ, ఓబీసీ కులాల్లోని  ఆరు వర్గాలకు చెందిన వారి సంతతిని సంపన్న శ్రేణిగా గుర్తించింది. వీటిలో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు, కేంద్ర, రాష్త్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, పారామిలటరీ, వాయుసేన, నావికా దళాల్లో పనిచేస్తున్న అధికారులు, వ్యాపారులు, వ్యవసాయ భూమి, ఆస్తులు కలిగిన వారు, వార్షిక ఆదాయ పరిమితిలో ఉన్నవారు. ఇందులో చివరిదైన ఆదాయ పరిమితిలో తల్లితండ్రుల వార్షిక ఆదాయ పరిమితి 1 లక్ష రూపాయలుగా, ఉద్యోగుల జీతభత్యాలు, వ్యవసాయ ఆదాయాలను మినహాయించి నిర్ధారించింది. వీటిని ప్రతి మూడేండ్లకోసారి తిరిగి సమీక్షించి ఆదాయ పరిమితిని పెంచాలని, అవసరమైతే రూపాయి విలువ హెచ్చుతగ్గులను దృష్టిలో పెట్టుకొని కాలపరిమితికి  ముందే సమీక్షించాలని పేర్కొంది. ఆ నివేదికను కేంద్రం1993లో ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా నేటికి కేవలం 4 సార్లు మాత్రమే ఆదాయ పరిమితిని పెంచారు. కేంద్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ 2017లో సంపన్న శ్రేణి వార్షిక ఆదాయ పరిమితిని రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

 బీపీ శర్మ కమిటీ..
 కేంద్ర ప్రభుత్వం 2019లో ఓబీసీ కులాల్లోని సంపన్న శ్రేణి నిర్ధారణకు బీపీ శర్మ అధ్యక్షతన కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదికను ఆమోదిస్తే చాలా మందికి అన్యాయం జరిగే ప్రమాదముంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న తల్లిదండ్రుల ఉద్యోగుల వార్షిక ఆదాయం12 లక్షలు దాటితే ఉద్యోగ హోదాతో సంబంధం లేకుండా కోట్లాది మంది ఓబీసీ/బీసీ కులాలకు చెందిన విద్యార్థులు, నిరుద్యోగులు రిజర్వేషన్లకు దూరం కానున్నారు. ఆ కమిటీ నివేదిక రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా ఉందని జాతీయ బీసీ కమిషన్,  జాతీయ పార్లమెంటరీ కమిటీ, దేశ వ్యాప్తంగా ఓబీసీ ఉద్యోగ సంఘాలు తప్పుబట్టాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఓబీసీ/బీసీ కులాల సంపన్న శ్రేణి వార్షిక ఆదాయ పెంపు విషయంలో కాలయాపన చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటికైనా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం1993లో నిర్ధారించిన ఆరు నిబంధనలను కొనసాగిస్తూ, ఓబీసీ/బీసీల సంపన్న శ్రేణి వార్షిక ఆదాయాన్ని పెంచాలి.

 9 సార్లు పెంచి ఉంటే..
కేరళ ప్రభుత్వం బీసీ కులాల్లోని సంపన్న శ్రేణిని గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన ఆరు నిబంధనలను మార్చింది. కాగా1999లో సుప్రీంకోర్టు త్రిసభ్య రాజ్యాంగ ధర్మాసనం ఇంద్రా సహానీ వెర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పులో  కేరళ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. సంపన్న శ్రేణి నిర్ధారణకు కేంద్రం సూచించిన నిబంధనలను అమలు చేయాలని ఆదేశించింది. అప్పటి నుంచి దేశంలోని అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు కేంద్రం నిబంధనలను అమలు చేస్తున్నాయి. 1993 నుంచి నేటి వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రతి మూడేండ్లకు క్రిమిలేయర్ ఆదాయ పరిమితిని సమీక్షించి తొమ్మిదిసార్లు పెంచి ఉంటే..  నేడు వార్షిక ఆదాయ పరిమితి రూ. 30 లక్షలుగా ఉండేది. ఆదాయ పరిమితి నిబంధనను సమీక్షించి పరిమితిని పెంచే అధికారం రాష్ట్రాలకు ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని చేయడం లేదు. ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా లక్షలాది బీసీ విద్యార్థులు రాజ్యాంగబద్ధంగా పొందాల్సిన రిజర్వేషన్లు కోల్పోవాల్సి వస్తోంది.
- కోడెపాక కుమార స్వామి రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం