ఆధునిక రాజ్యాలు సంక్షేమ రాజ్యాలు. దేశ రక్షణ శాంతి భద్రతల పరిరక్షణతోపాటు పౌరుల వికాసానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. రాజ్యాంగంలో ముఖ్యంగా బలహీనవర్గాలకు ప్రత్యేక సంరక్షణలు కల్పించారు. ఈ నేపథ్యంలోనే 2019లో కేంద్ర ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణ పేదల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఈ రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని పలు సంస్థలు, వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మెజార్టీ తీర్పును ప్రకటిస్తూ అగ్రవర్ణ పేదలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధమే అని పేర్కొన్నది.
దేశంలో రిజర్వేషన్లకు మూలం ఏమిటి? ఏయే వర్గాల వారికి ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించారు? రిజర్వేషన్ల గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా భారత సామాజిక వ్యవస్థ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. భారత సామాజిక వ్యవస్థ కులాల పునాదులపై నిర్మితమైంది. నిచ్చెన మెట్లు లాంటి సామాజిక వ్యవస్థలో కొన్ని కులాలు, వర్గాలు తీవ్ర అణచివేతకు గురయ్యాయి. అణచివేతకు గురైన వర్గాలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించినప్పుడే ఆ వర్గాలకు అభివృద్ధిలోకి తీసుకురావచ్చనే నేపథ్యంలో రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపర్చారు. అయితే, స్వాతంత్ర్యం రాకముందే దేశంలో రిజర్వేషన్లు కల్పించారు. మొదటిసారిగా 1902లో కోల్హాపూర్ సంస్థానంలో ఛత్రపతి సాహూ మహరాజ్ బహుజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించారు. అందుకే ఈయన్ని రిజర్వేషన్ల పితామహుడు అని అంటారు. ఆ తర్వాత 1921లో మద్రాస్, బొంబాయి ప్రావిన్స్‌ల్లో రిజర్వేషన్లు అమలు చేశారు.
రాజ్యాంగ నిర్మాతలు సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలకు వారి జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించారు. ఇతర వెనుకబడిన కులాల విషయంలో చాలా కాలం వరకు ఎలాంటి రిజర్వేషన్లు కల్పించలేదు. 1963లో ఎం.ఆర్.బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో వెనుకబాటుతనం అనేది కేవలం కులాన్ని బట్టి కాకుండా సామాజిక, విద్యాపరమైన ప్రాతిపదికపైన కూడా ఉండాలని పేర్కొంది. అలాగే, ఒక తరగతి వెనుకబడిందా? లేదా? అనే అంశాన్ని నిర్ణయించడంలో కులంతోపాటు పేదరికం, నివాసం, ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలని ఈ కేసులో తీర్పు చెప్పింది. అదే విధంగా మొత్తం రిజర్వేషన్స్ 50 శాతానికి మించరాదని పేర్కొన్నాది.
1979లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం వెనుకబడిన తరగతులను వర్గీకరించి తగిన రాయితీలను కల్పించడానికి బిందేశ్వర్ ప్రసాద్ మండల్ అధ్యక్షతన ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీన్నే బి.పి.మండల్ కమిషన్ అని పిలుస్తారు. ఈ కమిషన్ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించింది. సుమారు 3743 వెనుకబడిన కులాలు ఉన్నాయని గుర్తించింది. దేశ జనాభాలో 52 శాతం ఓబీసీ కులాల జనాభా ఉంటుందని, వారికి కేంద్ర సర్వీసుల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కమిషన్ సిఫారసు చేసింది. కమిషన్ తన నివేదికను 1980లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. 1989లో అధికారంలోకి వచ్చిన వి.పి.సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ నివేదికను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత పి.వి.నరసింహారావు ప్రభుత్వం 1991లో జస్టిస్ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి మండల్ కమిషన్ నివేదికకు రెండు సవరణలు చేసింది. వెనుకబడిన తరగతులకు కేటాయించిన రిజర్వేషన్లను ఆర్థిక ప్రాతిపదికన అమలు చేయడం.అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం. మండల్ కమిషన్ 11 అంశాల ఆధారంగా వెనుకబాటుతనాన్ని నిర్ణయించింది. ఇందులో ముఖ్యమైనవి సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన అంశాలు. మండల్ కమిషన్ నివేదికపైన ఇందిరాసహాని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1992) కేసును మండల్ కేసు అని కూడా అంటారు. ఈ కేసులో 6–3 తేడాతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.ఎన్.వెంకటాచలయ్య తీర్పు ప్రకటించారు.
తీర్పులోని ముఖ్యాంశాలు
- వెనుకబడిన తరగతులకు(ఓబీసీ) 27 శాతం రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగబద్ధమే.
- వెనుకబడిన తరగతుల్లో క్రిమీలేయర్ (సంపన్న వర్గాలు) వారిని గుర్తించి రిజర్వేషన్లకు అనర్హులుగా పరిగణించాలి.
- కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప అన్నిరకాల రిజర్వేషన్లు కలిపి 50 శాతం మించరాదు. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10శాతం రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఎం.ఆర్.బాలాజీ వర్సెస్ మైసూర్ కేసులో తీర్పును సమర్థించింది. ఓబీసీ రిజర్వేషన్లు ప్రభుత్వ ఉద్యోగానికి పొందడానికే గాని పదోన్నతికి కాదు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించారు. ఈ క్రమంలోనే ఓబీసీ రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయి.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్
2019లో కేంద్ర ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ ద్వారా 15(6), 16(6) క్లాజును చేర్చింది. 15(6) ప్రకరణ ప్రకారం విద్యా సంస్థల్లో అగ్రవర్ణ పేదల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10శాతం రిజర్వేషన్లు కల్పించారు. అలాగే 16(6) క్లాజు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కల్పించవచ్చు అని పేర్కొన్నారు.
ఈడబ్ల్యూఎస్ ప్రాతిపదికలు
- అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.8లక్షల లోపు ఉండాలి.
- కుటుంబానికి ఐదెకరాలకు మించి వ్యవసాయ భూమి ఉండరాదు.
- సొంత నివాస గృహం 1000 చదరపు గజాల లోపు ఉండాలి.
- నివాస స్థలం మున్సిపాలిటీల్లో అయితే 100 చదరపు గజాల లోపు ఉండాలి.
- గ్రామీణ ప్రాంతంలో అయితే 200 చదరపు గజాల లోపు ఉండాలి.
- పై అంశాల్లో కేంద్ర ప్రభుత్వం కాలానుగుణంగా మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది.
- అనుకూల వాదనలు
- ఈడబ్ల్యూఎస్ 10శాతం రిజర్వేషన్లు ఇప్పుడు అమలులో ఉన్న సామాజిక,విద్యాపరమైన రిజర్వేషన్లు తగ్గించడం లేదు. ఇది ప్రత్యేక కోటా కింద కల్పిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అమలవుతున్న రిజర్వేషన్లకు ఇది వ్యతిరేకం కాదు.
- మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించిరాదు అన్న నిబంధన ఇందిరాసహాని కేసులో
- ప్రత్యేక పరిస్థితుల్లో 50శాతానికి మించవచ్చని పేర్కొంది.
- మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో రిజర్వేషన్లు ఆర్థిక ప్రాతిపదికన కల్పించడంలో తప్ప ఏముంటుందని వాదిస్తున్నారు.
వ్యతిరేక వాదనలు
- అగ్రవర్ణ పేదల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కల్పించిన 10శాతం రిజర్వేషన్లపై అనుకూల ప్రతికూల వాదనలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సమర్థిస్తూ మెజార్టీ తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై దేశంలోని కొన్ని సంస్థలు, వ్యక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పును వ్యతిరేకించడానికి చాలా కారణాలు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు.
- దేశంలో రిజర్వేషన్ల ద్వారా సామాజిక న్యాయం అందించడానికి సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా అగ్ర వర్ణాల్లో మాత్రమే ఆర్థికంగా వెనుకబడిన వారిని గుర్తించి రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని పేర్కొంటున్నారు.
- ఈడబ్ల్యూఎస్ ప్రజలు కులం ఆధారంగా నిర్మాణాత్మకంగా అసమానతలను అనుభవించలేదు. ఈ రిజర్వేషన్లు అనేది సమాన అవకాశాల సారాంశానికి విరుద్ధం.
- ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పరిధి నుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలను మినహాయించడం ప్రాథమిక హక్కుల్లో సమానత్వపు హక్కుకు విరుద్ధం కాదా!
- దేశంలో సుప్రీంకోర్టు అనేక కేసుల సందర్భంలో మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించరాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు కల్పించడం వల్ల 50శాతం పరిధి మించింది.
- 10శాతం రిజర్వేషన్లు ఎందుకు నిర్ణయించారనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు.