ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు సక్కగ అమలు చేస్తలే

వెనుకబడిన తరగతుల వారి భవిష్యత్‌‌ ప్రణాళికల కోసం రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేక రిజర్వేషన్లను కల్పించారు. అవి సుప్రీం కోర్టు, హైకోర్టుల తీర్పుల ఆధారంగా అమలు కావాల్సి ఉండగా తెలంగాణలో అలా జరగడం లేదు. రాష్ట్రంలో కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఉద్యోగాల భర్తీకి సంబంధించి సమాంతరంగా అమలవ్వాల్సిన రిజర్వేషన్లను అధికారులు సరిగా అమలు చేయడం లేదు. దీంతో అభ్యర్థులు నష్టపోతున్నారు. రిజర్వేషన్ల అమలుపై ఎవరైనా కోర్టులకు వెళ్తే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా ఆలస్యమవుతోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కోర్టు తీర్పులు, రాజ్యాంగం నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసేలా జీవోలు తీసుకురావాలి.

రాజ్యాంగం, సుప్రీం కోర్టు, హైకోర్టుల తీర్పుల ఆధారంగా దేశంలో విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లను రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి నిలువు/సామాజిక రిజర్వేషన్లు, రెండోది సమాంతర/ప్రత్యేక రిజర్వేషన్లు. నిలువు రిజర్వేషన్లలో షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ), సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల(బీసీ) అభ్యర్థులు వస్తారు. సమాంతర రిజర్వేషన్లలో మహిళలు, ఎన్ సీసీ, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్​మెన్ రిజర్వేషన్ల అభ్యర్థులు వస్తారు. వికలాంగుల రిజర్వేషన్లను కూడా నిలువు పద్ధతిలోనే అమలు చేయాలని సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనాలు, 2013లో యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్, 2020లో సిద్దరాజు వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసుల్లో తీర్పులు వచ్చాయి. కాగా కోర్టు తీర్పులు, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా సమాంతర/ప్రత్యేక కోటా కింద కల్పించిన మహిళా రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో నిలువుగా అమలు చేస్తోంది.
 

నిలువు–సమాంతర రిజర్వేషన్ల అమలు..
సుప్రీంకోర్టు1992 నుంచి ఇప్పటి వరకు వివిధ కేసుల తీర్పుల సందర్భంగా రిజర్వేషన్ల అమలుకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఉత్తరాంచల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ మమ్తాబిషప్, అనురాగ్ పటేల్ వర్సెస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తదితర తీర్పుల్లో నిలువు, సమాంతర రిజర్వేషన్లను ఏవిధంగా అమలు చేయాలో స్పష్టం చేసింది. ఆర్టికల్15(4), 15(5), 16(4)లు వర్టికల్ రిజర్వేషన్లు కల్పిస్తున్నవి. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు జనరల్ కేటగిరీ పోస్టులకు వారికి కేటాయించిన రిజర్వేషన్ పోస్టులకు పోటీపడి ఎంపిక కావచ్చు. ఫలితంగా వారికి కేటాయించిన రిజర్వేషన్ శాతాన్ని మించి ఎంపిక కావచ్చు. అదే సమాంతర రిజర్వేషన్లలో మహిళలకు 33.33 శాతం రిజర్వేషన్లు ఆర్టికల్15(3) ద్వారా కల్పిస్తున్నారు కాబట్టి మహిళలు జనరల్ కేటగిరి పోస్టుల్లో లేదా వారికి కేటాయించిన కోటాలో ఎంపికైనప్పటికీ, మొత్తం ఎంపికైన మహిళా అభ్యర్థుల సంఖ్య 33.33 శాతానికి మించకూడదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు 2009లో జూనియర్ సివిల్ జడ్జీల నియామకాలకు సంబంధించి కె.వెంకటేష్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు, 2014లో పోలీస్ సబ్ ఇన్​స్పెక్టర్ నియామకాలకు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ బి. ప్రభాకర్ కేసు, 2020లో మాచర్ల సురేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ మధ్యజరిగిన కేసుల తీర్పుల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

భర్తీ ప్రక్రియలో ఆలస్యం..
సార్వత్రికల ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీకి గ్రీన్​సిగ్నల్​ఇచ్చింది. రిజర్వేషన్ల అమలులో ఉన్న చిక్కుల వల్ల భర్తీ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే ప్రమాదముంది. ఇప్పటికే ఉద్యోగ నియామకాల్లో మహిళా కోటాను నిలువుగా అమలు చేయడంవల్ల ఉద్యోగాలు రాలేదని పదుల సంఖ్యలో మెరిట్​సాధించిన పురుష అభ్యర్థులు హైకోర్టులో కేసులు వేశారు. ఇలాంటి  న్యాయపరమైన, విధానపరమైన అంశాలపై సకాలంలో ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోక పోవడం వల్ల ఉద్యోగ నియామకాల భర్తీలో సమయం వృథా అవుతుంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మహిళా, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్,  ఎన్​సీసీ కోటాలను సమాంతరంగా అమలు చేసేవిధంగా ఉత్తర్వులు జారీ చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్, అన్ని ప్రభుత్వ శాఖల,  ప్రభుత్వరంగ సంస్థల ద్వారా జరిపే నియామకాల్లో పకడ్బందీగా వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉంది. 

కొన్ని శాఖల్లో అమలు కావడం లేదు.. 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం1997లో 65 జీవో ద్వారా మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, వికలాంగులు, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్ సీసీ రిజర్వేషన్లను ఉద్యోగ నియామకాల్లో అమలు చేయడంపై100 పాయింట్ల రోస్టరును నిర్ధారించి, అన్ని రిజర్వేషన్లు కూడా నిలువుగా అమలు చేయాలనే భావం వచ్చే విధంగా తెలిపింది. అప్పటి నుంచి నేటి వరకు తెలంగాణలో అదే విధానం కొనసాగుతోంది. కానీ, మెడికల్ సీట్ల భర్తీలో మాత్రం మొదటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు మహిళా, వికలాంగులు, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్‌‌సీసీ కోటాలను సమాంతరంగా అమలు చేస్తున్నాయి. వివిధ సంఘాల విజ్ఞప్తి, కోర్టు తీర్పులను పరిగణనలోనికి తీసుకొని తప్పుని గ్రహించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర విభజన తర్వాత 2016లో 40 జీవో, 2018లో 63 జీవోను జారీ చేస్తూ మహిళా రిజర్వేషన్లను ఉద్యోగ నియామకాల్లో సమాంతరంగా అమలు చేయాలని నిర్ణయించింది. అయితే అవి కొన్ని ప్రభుత్వ శాఖల్లో నేటికీ అమలు జరగడంలేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో, విద్యా సంస్థల సీట్ల భర్తీలో ప్రత్యేకంగా మహిళలకు ఎలాంటి కోటా లేదు. అయినప్పటికీ సమాంతర కోటాకు సంబంధించిన స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ తదితర కోటాలను అమలు చేస్తున్నారు.

-కోడెపాక  కుమార స్వామి, రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం