రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు అవుతున్నా తెలంగాణ బీసీల బతుకుల్లో మార్పు రావడం లేదు. అసమానతలకు, అణచివేతకూ గురవుతూనే ఉన్నారు. ఉద్యమ సమయంలో ఎన్నో వాగ్దానాలు చేసిన ప్రభుత్వం పదవిలోకి వచ్చాక వాటి మాటే పట్టించుకోవడం లేదు. బీసీలు, దళితులపై వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. వారికి పదవులు లేవు.. పథకాలు చేరవు. కేవలం బీసీలను ఓటర్లుగానే చూస్తున్నారు. వెంటనే బీసీ జనగణన సరైన రీతిలో చేసి వారి వాటాలను, రిజర్వేషన్లను అమలు చెయ్యాలె.
స్వాతంత్ర్య సమర కాలంలో ఉద్యమం నిర్మించడంలో సైనికుల్లా, తర్వాత దేశ అభివృద్ధిలో కార్మికుల్లా, ఇప్పుడు దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతుల్లా బీసీలు దేశ నిర్మాణంలో ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు. కానీ దేశ రాజకీయాల్లో ఓబీసీలది ఇప్పటికీ మధ్యస్థ పాత్రే. ఈ సంగతి కొత్తది కానప్పటికీ వారు ఇంకా రాజకీయంగా మధ్యవర్తులు గానే ఉంటూ రాజకీయ బానిసల్లా బతుకుతున్నారు. దేశంలో 50% పైగా ఓబీసీ జనాభా ఉన్నా వారిని కేవలం ఓటర్లు గానే గుర్తింపు రావడం అనేది వారి రాజకీయ అనైక్యత కు నిదర్శనం. 99% కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో రాజ్యాధికారం అనుభవించేది కేవలం 7 % ఉన్న అగ్రకుల వారే. 93శాతం ఉన్న ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇతర వెనుకబడిన కులాలు కేవలం1% శాతం మాత్రమే రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు వెనుకబడిన కులాలు సాధించిన అధికారం ఒక్క(1%) శాతం మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మిగతా ఆధిపత్య అగ్రకులాల వాళ్ళు 99% రాజకీయ అధికారాన్ని, ఆర్థిక స్వాతంత్రాన్ని అనుభవిస్తూ వెనుకబడిన కులాలకు అధికారాన్ని దక్కకుండా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అంగట్లో సరుకులా అమ్మకానికి పెట్టారు. ఆధిపత్య కులాలు ఏం చెబితే అదే ప్రజాస్వామ్యంగా చట్టంగా చలామణి అవుతోంది. ఉదాహరణగా 7 శాతం ఉన్న అగ్రకులాలు 10 శాతం రిజర్వేషన్ కేవలం 2 రోజుల్లో మాత్రమే పార్లమెంటులో బిల్లు ఆమోదించుకోగలిగారు. మరి 60 శాతం ఉన్న ఓబీసీలు 27శాతం మాత్రమే రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. మిగతా రిజర్వేషన్స్ ఎవరు అనుభవిస్తున్నారు? అందుకే దేశంలో బీసీ జనగణన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టడం లేదు. బీసీ జనగణన చేస్తే వారి జనాభా ప్రకారం అన్ని రంగాలలో రిజర్వేషన్స్ , వాటా ఇవ్వాల్సి వస్తుందని వారి అభిప్రాయం, భయం కూడా ఉంది.
ఎంత శాతం అధికారం అనుభవిస్తున్నారు?
75 ఏండ్ల స్వతంత్ర ప్రజాస్వామిక దేశంలో, రాజ్యాధికారంలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర వెనుకబడిన కులాల వాటా ప్రకారం ఎంత శాతం అధికారాన్ని అనుభవిస్తున్నారు? అందులో 60 శాతం ఉన్న ఓబీసీల రాజ్యాధికారం వాటా ఎంత ? రాజ్యాంగం ప్రకారం వారికి దక్కాల్సిన రాజ్యాధికారం కేవలం బీసీలకు మాత్రమే పూర్తి స్థాయిలో దక్కక పోవడం, రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడం అనేది ప్రజాస్వామ్య సూత్రానికే విరుద్ధం. ఇది బీసీల రాజకీయ బానిసత్వానికి చక్కటి ఉదాహరణ. దేశ వ్యాప్తంగా ఉన్న ఓబీసీలకు పోరాట స్ఫూర్తి లేదనడానికి ఇంకా మధ్యవర్తులు గానే, మెజార్టీ ఓటర్లుగానే ఆరాట పడడం వారి రాజకీయ అవగాహన తెలియజేస్తుంది. ఓటర్ లిస్ట్ లోనే మెజార్టీ కనిపిస్తుంది, కానీ రాజకీయ రిజర్వేషన్లలో మాత్రం కనిపించడం లేదు. మెజారిటీ వర్గంగా, రహస్య ఓటర్లుగా ఎవరైనా ఉన్నారు అంటే అది ఓబీసీలు మాత్రమే. రాజ్యాంగం ప్రకారం వారికి రావాల్సిన అధికారం కోసం పోరాటం చేయలేని, గట్టిగా అసెంబ్లీలో, పార్లమెంటులో మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో ఓబీసీల రాజకీయ చైతన్యం ఉందంటే వారి పరిస్థితి ఏమిటో మనం అంచనా వేయొచ్చు. వారి చిరకాల కోరిక రాజకీయ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తే అందుకు ఏ పార్టీల నాయకులు ముందుకొస్తున్నారు? ఏ సామాజిక వర్గాలు ముందుకు వస్తాయి?
మెజారిటీ వర్గాలు మద్దతునివ్వడం లేదు..
జనాభాలో ఓటర్ లిస్టు లో మెజార్టీ వర్గంగా ఉన్న ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడు కూడా లేడంటే అతిశయోక్తి కాదు. ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు పార్టీలు పెడితే వారి పార్టీలకు ఎందుకు ఈ మెజార్టీ వర్గాలు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వలేక పోతున్నాయి? ఎందుకు మెజార్టీ వర్గాల మద్దతు ఈ సామాజిక వర్గం నేతలు పొందలేకపోతున్నారు. అదే తక్కువ ఓటు బ్యాంకు కలిగిన అగ్రకులాలకు చెందిన ఓ వ్యక్తి పార్టీ పెడితే అలాంటి పార్టీలకు సమాజంలో మెజార్టీ వర్గంగా ఉన్న బీసీ, ఇతర వెనకబడిన వర్గాల వారి నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తోంది. ఈ వెనుకబడిన మెజారిటీ వర్గం వారు ఎవరి నుంచి ఏమి ఆశిస్తున్నారో నేతలు గ్రహించలేకపోతున్నారు. ఆర్థికంగా చితికిపోయిన బీసీ కులాలను పట్టించుకోవడం కానీ, వారికి అవకాశాలు ఇవ్వడం కానీ చేయడం లేదు.
అంబేద్కర్ స్ఫూర్తితో
ఓబిసి రిజర్వేషన్ల కోసం అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టికల్ 340 ద్వారా బీసీ కులాలను గుర్తించడానికి ఒక కమిషన్ వేయవలసిందిగా ప్రతిపాదించారు. అంబేద్కర్ మంత్రివర్గ సభ్యుడిగా నాలుగు అంశాలను ఆ సందర్భంలో ప్రతిపాదిస్తే వాటిలో ప్రధానమైనది బీసీ కమిషన్ నియమించాలని. అయితే అంబేద్కర్ ప్రతిపాదనను అప్పటి ప్రభుత్వం తిరస్కరిండంతో అంబేద్కర్ రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లారు. ఆయన ఇచ్చిన బీసీల గుర్తింపు ప్రతిపాదన సర్దార్ వల్లభాయ్ పటేల్ దృష్టికి వెళ్లింది. పటేల్‌తో అంబేద్కర్ బీసీల రిజర్వేషన్లు కల్పించడానికి ఆర్టికల్ 46 నేరుగా సహకరిస్తుందని చెప్పారు. ఈ సూచనను అంగీకరించిన రాజ్యాంగ పరిషత్ 340 అధికరణను రాజ్యాంగంలో చేర్చడానికి అవకాశం వచ్చింది. కానీ బీసీలకు రిజర్వేషన్లు మాత్రం ఇవ్వలేదు. ఆ తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు రెండోసారి బీసీ సమస్యలను అధ్యయనం చేయడానికి ఓబీసీకి చెందిన ఎంపీ బిందేశ్వర్ ప్రసాద్ మండల్ అధ్యక్షతన ఒక కమిటీ నియమించారు. ఈ కమిటీ దేశం నలుమూలలా ఉన్న 3743 కులాలను బీసీ కులాలుగా గుర్తించి, వారి పరిస్థితులను మెరుగు పరచడం కోసం వారికి రాజకీయ పరమైన రిజర్వేషన్లతో సహా అన్ని రంగాల్లో వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని పేర్కొంది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత 50 శాతం రావాల్సిన రిజర్వేషన్లు కేవలం 27 శాతం మాత్రమే ఇవ్వడం జరిగింది.
రాజకీయంగా జరుగుతున్న అన్యాయం..
బీసీలు కలిసి ఉన్నారు కానీ ఒకటిగా లేరు. కాబట్టి విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి కానీ రాజకీయపరంగా బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదో మెజార్టీ వర్గంగా ఉన్న బీసీ ఓటర్లు, ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆలోచించాలి. అసెంబ్లీలో, పార్లమెంటులో వారి హక్కులకై గొంతు ఎత్తాలి, కానీ అలా అడగలేక పోతున్నారు. ఆ వర్గాల నుంచి వచ్చిన నేతలు ఆ వర్గం ప్రజల రాజ్యాధికార కోరికలను గుర్తించాలి. రాజకీయ రిజర్వేషన్ల కోసం ఇంకా అడపాదడపా పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఆ ఉద్యమాలు ఒక ఉప్పెనగా మారడం లేదు. కేవలం చిన్న చిన్న ప్రతిఘటనలు, ఉద్యమాలు వారి మనుగడను కాపాడుకోవడానికి ఉపయోగపడుతున్నాయి, మెజార్టీ వర్గంగా ఉన్న బీసీలు, చట్టసభలలో తమ రాజకీయ రిజర్వేషన్స్ కోసం చలనం లేని మౌన శిల లాగా చూస్తుంటే హక్కులు కోల్పోయి మ్యూజియంలో వస్తువుల్లా ఉండిపోవాల్సి వస్తుంది. అన్ని పార్టీల నాయకులు దేశంలో అత్యధిక జనాభా ఓబీసీలే అంటారు. అలాగే వారికి రాజకీయ రిజర్వేషన్లు చట్టసభలలో కల్పించాలని ఏసీ గదుల్లో కూర్చుని మాత్రమే మాట్లాడతారు. బయట, చట్టసభలలో మాట్లాడేటప్పుడు వారు నోరు విప్పరు. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కేటాయించేటప్పుడు వారి జనాభా ప్రకారం వారికి సీట్లు ఇవ్వరు. మైనార్టీ వర్గంలో ఉన్న వారికే మెజారిటీ సీట్లు కేటాయిస్తారు. ఇలా ప్రతి సందర్భంలో బీసీలు రాజకీయ అవమానాలకు గురవుతున్నారు. చట్టసభలలో బీసీలకు దక్కాల్సిన సీట్లు పార్లమెంటులో 545 ఎంపీ సీట్లలో 270 సీట్లు, 250 రాజ్య సభ సీట్లలో 120 సీట్లు కేవలం ఓబీసీలకు మాత్రమే రావాలి. అదే విధంగా తెలంగాణలో 119 ఎమ్మెల్యే సీట్లలో 59 సీట్లు, జనాభా పరంగా బీసీలకు రావాలి. తెలంగాణలో జిల్లాల ప్రకారం చూసుకుంటే ఉదాహరణకి ఒక జిల్లాలో 14 సీట్లు ఉంటే 7 సీట్లు బీసీలకే రావాలి కానీ అలా జరగడం లేదు.
ఇంకా ఎన్ని ఏండ్లు పోరాడాలి?
తెలంగాణలో ప్రాంతీయ, జాతీయ పార్టీలు ఇప్పటి వరకూ రాష్ట్ర బాధ్యతలను పెద్దపెద్ద భూస్వాములు, పెట్టుబడిదారులు ఆధిపత్య కులాలకు మాత్రమే నాయకత్వ అవకాశాలు ఇచ్చాయి. కానీ వెనుకబడిన వర్గాలకు, బీసీలకు పూర్తిస్థాయిలో నాయకత్వ అవకాశాలు ఇవ్వడం లేదు. వెనుకబడిన వర్గాలకు, ఓబీసీలకు నాయకత్వ లక్షణాలు లేవని ప్రచారం చేస్తున్నారు. ఇదే పద్ధతి తెలంగాణలోని అన్ని జిల్లాలలో కొనసాగుతోంది. ప్రతి నియోజకవర్గంలో వారసత్వంగా కొన్ని కులాలు ఏలుతున్నాయి. అధికారాన్ని అనుభవిస్తున్నాయి. ఇతర సామాజిక వర్గాలకు అవకాశాలు రావడం లేదు. ఈ పరిస్థితులను ప్రాంతీయ, జాతీయ అగ్ర నాయకత్వం గుర్తించాలి. అన్ని సమస్యలను పరిష్కరించి బీసీలకు రాజకీయ అవకాశాలు ఇవ్వాలి. అప్పుడే సమగ్రంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజకీయంగా, రాజ్యాంగపరంగా హక్కులు అందరికీ లభిస్తాయి.
- నల్లవేల్లి భరత్,
తెలంగాణ నిరుద్యోగ సంఘం రాష్ట్ర కార్యదర్శి