
ప్రతి దేశంలోనూ ద్రవ్య వ్యవస్థ నియంత్రణకు, బ్యాంకింగ్ రంగ నియంత్రణకు ఒక కేంద్ర బ్యాంక్ ఉంటుంది. అందుకే కేంద్ర బ్యాంక్‌ను ద్రవ్య వ్యవస్థ నియంత్రణాధికారి, బ్యాంకింగ్ వ్యవస్థ నియంత్రణాధికారి అని పిలుస్తారు. మన దేశంలో కూడా కేంద్ర బ్యాంక్ ఉంది. దీన్నే రిజర్వ్ బ్యాంక్ అంటారు. 1926లో కరెన్సీ, ఫైనాన్స్‌పై నియామకమైన రాయల్ కమిషన్ భారతదేశంలో ఒక కేంద్ర బ్యాంక్ స్థాపించాలని సలహా ఇచ్చింది. 1931లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ కూడా ఆర్బీఐని ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ సూచనల మేరకు ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొంది, 1934లో రిజర్వు బ్యాంక్ చట్టం చేయబడి, 1935, ఏప్రిల్ 1న రిజర్వు బ్యాంక్‌గా ఏర్పడింది.
రిజర్వు బ్యాంక్ రూ.5 కోట్ల మూలధనం, ఒక్కొక్క వాటా రూ.100 చొప్పున 5 లక్షల వాటాలతో వాహనదారుల బ్యాంకుగా ఏర్పడింది. కొద్ది మంది చేతిలో ఆర్బీఐ వాటాలు కేంద్రీకృతం కావడం న్యాయం కాదని భావించి 1949, జనవరి 1న ఆర్బీఐను జాతీయం చేశారు. ద్రవ్య మార్కెట్లో ఆర్బీఐ శిఖరాగ్ర సంస్థ. ప్రారంభంలో ఆర్బీఐ ప్రధాన కార్యాలయం కలకత్తాలో ఉండేది. 1937లో ముంబయికి మార్చారు.20 ప్రాంతీయ కార్యాలయాలు, 11 ఉప కార్యాలయాలు పనిచేస్తున్నాయి. 20 మందితో కూడిన డైరెక్టర్ల బోర్డు ఉంటుంది. ఇందులో ఒక గవర్నర్, నలుగురు ఉప గవర్నర్లు ఉంటారు. ఈ బోర్డును కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఆర్బీఐకి కేంద్ర బోర్డుతోపాటు నాలుగు లోకల్ బోర్డులు ఉంటాయి. వీటి కార్యాలయాలు ముంబయి, చెన్నై, కోల్‌కతా, న్యూఢిల్లీలో ఉన్నాయి. ఆర్బీఐ ప్రధాన అధికారి గవర్నర్. మొదటి భారతీయ గవర్నర్ సీడీ దేశ్‌ముఖ్.
2018, డిసెంబర్ 12 నుంచి శక్తికాంత్ దాస్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆర్బీఐ సాధారణ విధుల్లో భాగంగా కరెన్సీ నోట్లను జారీ చేయడంతోపాటు ప్రభుత్వానికి బ్యాంక్, బ్యాంకులకే బ్యాంక్‌గా వ్యవహరిస్తుంది.
బ్యాంకులకు బ్యాంక్: ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు బ్యాంక్‌గా వ్యవహరిస్తుంది. ఒక కొత్త వాణిజ్య బ్యాంకును నెలకొల్పాలన్నా, ఒక బ్యాంక్ కొత్త శాఖను ప్రారంభించాలన్నా ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి.
నగదు నిల్వల నిర్వహణ: అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లలో కొంత మొత్తాన్ని ఒక నిర్ణీత శాతంలో ఆర్బీఐ వద్ద గానీ, తమ వద్ద గానీ నిల్వ చేయాలి. తద్వారా పరపతి పరిమాణాన్ని నియంత్రణ చేసి ద్రవ్యోల్బణాన్ని, ప్రతి ద్రవ్యోల్బణాన్ని నివారించవచ్చు.
నగదు నిల్వల నిష్పత్తి: ప్రతి వాణిజ్య బ్యాంక్ తమ డిపాజిట్లలో కొంత శాతాన్ని ప్రభుత్వ సెక్యూరిటీల్లో తన వద్దనే నిల్వ చేయాలి.
చట్టబద్ధత ద్రవ్య నిష్పత్తి: ప్రతి షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్ తమ డిపాజిట్లలో కొంత శాతాన్ని ప్రభుత్వ సెక్యూరిటీల్లో తన వద్దనే నిల్వ చేయాలి. ప్రతి షెడ్యూల్డ్ బ్యాంక్ వారం వారం తమ వ్యవహారాలకు సంబంధించి ఆర్బీఐకి నివేదిక అందజేస్తుంది.
ప్రభుత్వానికి బ్యాంక్: కేంద్ర ప్రభుత్వానికి, మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్బీఐ ప్రభుత్వ బ్యాంకుగా, సలహాదారుగా, ఏజెంటుగా వ్యవహరిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాధారణ బ్యాంకింగ్ వ్యవహారాలను ఆర్బీఐ నిర్వహిస్తుంది. ప్రభుత్వ నగదు నిల్వలను డిపాజిట్ రూపంలో పెట్టుకోవడం, ప్రభుత్వం తరఫున చెల్లింపు చేయడం ఆర్బీఐ విధి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 90 రోజుల కాల పరిమితితో స్వల్పకాలిక రుణాలను మంజూరు చేస్తుంది. వీటినే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు అంటారు. అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది. ప్రభుత్వం జారీ చేసే ట్రెజరీ బిల్లులను విక్రయిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున రుణాలు స్వీకరిస్తుంది. ఆర్థిక ద్రవ్య విధానాల్లో ప్రభుత్వానికి సలహా ఇస్తుంది.
ఎ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అకౌంట్లను నిర్వహిస్తుంది. వాటి తరఫున చెల్లింపులు చేస్తుంది. ప్రభుత్వానికి నూతన రుణాలు ఇస్తుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్మే, కొనుగోలు చేసే మార్కెట్లయిన గిల్ట్ ఎడ్జెడ్ మార్కెట్‌ను క్రియాశీలకంగా నిర్వహిస్తుంది.
బి. కేంద్ర బ్యాంక్, ప్రభుత్వానికి సలహా ఇవ్వడం అనే విధికి అధిక ప్రాధాన్యం ఉంది. ప్రణాళికలకు ముందు సలహా పరిధికి పరిమితం. ప్రణాళికల తర్వాత మారింది. ఆర్బీఐ ప్రభుత్వానికి బ్యాంకింగ్, విత్త అంశాల్లో మాత్రమే కాకుండా ఆర్థిక సమస్యలపై కూడా సలహాలు ఇస్తుంది.
సి. ప్రభుత్వ వ్యవహారాలను నిర్వహించడానికి ఆర్బీఐకి ఏజెంట్‌గా ఎస్బీఐ పనిచేస్తుంది.
కరెన్సీ నోట్ల జారీ: కరెన్సీ నోట్ల జారీలో ఆర్బీఐకు గుత్తాధిపత్యం ఉంది. ఒక రూపాయి నోటు, నాణేలు మినహా మిగతా కరెన్సీ నోట్లను ఆర్బీఐ ముద్రిస్తుంది. ప్రస్తుతం 10, 20, 50, 100, 200, 500 రూపాయల నోట్లను ముద్రిస్తోంది. 2, 5 నోట్ల ముద్రణను నిలిపి వేసింది. హిందీ, ఇంగ్లీష్ భాషలు కాకుండా పేపర్ నోటుపై 15 భాషలు కనిపిస్తాయి. ఆర్బీఐ జారీ చేసిన ద్రవ్యాన్ని చట్టబద్ధ ద్రవ్యం అంటారు. ఆర్బీఐ ఒరిజినల్ చట్టం ప్రకారం అనుపాత నిల్వల పద్ధతిలో కరెన్సీ నోట్లు ముద్రిస్తారని పేర్కొన్నారు.
అయితే, ఈ పద్ధతిలో వ్యాకోచత్వం తక్కువ ఉండటంతో ఒరిజినల్ చట్టాన్ని 1957లో సవరించి కనీస నిల్వల పద్ధతిని ప్రవేశపెట్టారు. ఆర్బీఐ సవరణ చట్టం – 1956 ప్రకారం 515 కోట్ల విలువ గల రిజర్వులు ఉండాలి. 1957లో దీనిని సవరించి 200 కోట్లకు తగ్గించారు. దీని ప్రకారం 115 కోట్లకు తక్కువ కాకుండా బంగారం నిల్వలు, 85 కోట్ల విదేశీ మారక నిల్వలు ఉండాలి. రూపాయిని భారత విత్త మంత్రిత్వశాఖ ముద్రిస్తుంది. రూపాయి నోటుపై ఆర్థికశాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది. ఒక రూపాయి నోటును, నాణేలను ఆర్థిక మంత్రిత్వశాఖ జారీ చేసినా వాటి పంపిణీ బాధ్యత ఆర్బీఐకి అప్పగించారు.