ఇక ఎన్​బీఎఫ్​సీల నుంచీ క్రెడిట్​ కార్డులు

ఇక ఎన్​బీఎఫ్​సీల నుంచీ క్రెడిట్​ కార్డులు

వెలుగు బిజినెస్​ డెస్క్​: క్రెడిట్​ కార్డులు జారీ చేసేందుకు దేశంలోని కొన్ని పెద్ద నాన్​బ్యాంకింగ్​ ఫైనాన్షియల్​ కంపెనీలకు అనుమతి రానుంది. బలమైన కొన్ని ఎన్​బీఎఫ్​సీలకు కఠినమైన కండిషన్లతో  అనుమతి ఇవ్వాలని రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) నిర్ణయించినట్లు సమాచారం. మన దేశ జనాభాలో  మూడు, నాలుగు శాతం మందికి మాత్రమే క్రెడిట్​ కార్డులున్నాయి. బ్యాంకులు కూడా ప్రైమ్​, సూపర్​ ప్రైమ్​ కస్టమర్లకు మాత్రమే క్రెడిట్​ కార్డులు ఇస్తున్నాయి. దీంతో చాలా మంది ఈ అర్హతను పొందలేకపోతున్నారు. అలా మిగిలిన వారికి క్రెడిట్​ కార్డులు ఇవ్వాలనేది కొన్ని ఎన్​బీఎఫ్​సీలు, ఫిన్​టెక్​ కంపెనీల ఆలోచన. ఈ దిశలో కొన్ని గైడ్​లైన్స్​ రూపొందించేందుకు ఆర్​బీఐ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎన్​బీఎఫ్​సీలకు కనీస నెట్​వర్త్​ రూల్​ తేవాలని ఆలోచిస్తోంది. దేశంలో ఎన్​బీఎఫ్​సీగా రిజిస్ట్రేషన్​ పొందాలంటే మరీ ఎక్కువ క్యాపిటల్​ అవసరం లేదని, కాబట్టి అన్ని ఎన్​బీఎఫ్​సీలకు క్రెడిట్​ కార్డులు జారీ చేసేందుకు అనుమతి దొరకదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఆర్​బీఐ చొరవ...
క్రెడిట్​ కార్డుల జారీకి కొన్ని ఎన్​బీఎఫ్​సీలతో రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా చర్చలు జరుపుతున్న విషయాన్ని మొదట బిజినెస్​ స్టాండర్డ్​ వెలుగులోకి తెచ్చింది. కనీస నెట్​వర్త్​ రూల్​తోపాటు, తగినంత లిక్విడిటీ ఉండాలనే నిబంధననూ ఆర్​బీఐ అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఐటీ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​, సైబర్​ సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా పటిష్టంగా ఉండేలా చూడాలనుకుంటోంది. ఎందుకంటే, ఇప్పుడు క్రెడిట్​ కార్డులను డిజిటల్​గా కూడా జారీ చేయొచ్చు. మన దేశంలో 15 పెద్ద ఎన్​బీఎఫ్​సీలు ఉన్నాయి. వీటన్నింటినీ రెగ్యులర్​గా ఆర్​బీఐనే మానిటర్​ చేస్తోంది. వాటిలో కొన్ని క్రెడిట్​ కార్డుల జారీకి అర్హత పొందుతాయని భావిస్తున్నారు. ఎన్​బీఎఫ్​సీ నెట్​వర్త్​ బేసిస్​ మీద క్రెడిట్​ లిమిట్​ను కూడా రిజర్వ్​ బ్యాంకే నిర్ణయించేలా రూల్​ ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇండియాలో ఇప్పటిదాకా రెండు ఎన్​బీఎఫ్​సీలు ( ఎస్​బీఐ కార్డ్స్, బాబ్​ కార్డ్​లు) మాత్రమే క్రెడిట్​ కార్డులు ఇస్తున్నాయి. ఈ రెండూ ప్రభుత్వ రంగంలోవే. 

ఫిన్​టెక్​ కంపెనీలకు మరింత ఛాన్స్​...
స్లైస్​, యూని, లేజీపే వంటి ఫిన్​టెక్​ కంపెనీలు ఎన్​బీఎఫ్​సీ లైసెన్సులు తీసుకుని, బ్యాంకుల సాయంతో దేశంలో ప్రి పెయిడ్​ కార్డులను అందిస్తున్నాయి. ఇలాంటి కంపెనీలకు ఆర్​బీఐ అనుమతి దొరికితే క్రెడిట్​ కార్డుల జారీ వాటికి సులభమవుతుంది. చాలా మంది కస్టమర్లను ఫార్మల్​ క్రెడిట్​లోకి తేవడానికి ఎన్​బీఎఫ్​సీలకు మెరుగైన అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాంటి కస్టమర్లకు బ్యాంకుల నుంచి నేరుగా అప్పులు పొందడానికి తగిన అర్హతలు ఉండటం లేదని వివరించింది. ఈ ఏడాదే ఇది జరిగితే డిజిటైజేషన్​ మరింత ఊపందుకుంటుందని ఒక ఫిన్​టెక్​ కంపెనీ ప్రతినిధి చెప్పారు. ఇటీవల కాలంలో పుట్టుకొచ్చిన అన్ని ఫిన్​టెక్​ కంపెనీలూ ఆర్​బీఐ  పెట్టే రూల్స్​కింద అర్హత పొందలేవు. సరయిన పద్ధతిలో అప్పులు ఇవ్వకపోతే మూడు, నాలుగేళ్లలోనే బకాయిలు తడిసి మోపడవుతాయి. అందుకే పటిష్టమైన బాలెన్స్​షీట్లున్న ఎన్​బీఎఫ్​సీలకే తప్ప స్టార్టప్​ కంపెనీలకు అది సాధ్యం కాదని ఆ ప్రతినిధి పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ, క్రెడిట్​ కార్డుల జారీకి ఎన్​బీఎఫ్​సీలకు అనుమతిస్తే, చాలా ఫిన్​టెక్​ కంపెనీలూ తమ అవకాశాలను మెరుగుపరుచుకుని, మార్కెట్లో విస్తరిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. బ్యాంకులతోనే కాకుండా, ఎన్​బీఎఫ్​సీలతోనూ ఒప్పందాలు కుదుర్చుకుని ఫిన్​టెక్​ కంపెనీలు క్రెడిట్​ కార్డులను ఆఫర్​ చేసే వీలు కలుగుతుందని పేర్కొన్నారు.

6.7 కోట్ల క్రెడిట్​ కార్డులున్నాయ్​..
మన దేశంలో నవంబర్​ 2021 నాటికి మొత్తం 6.7 కోట్ల క్రెడిట్​ కార్డులు జారీ అయినట్లు డేటా చెబుతోంది. డెబిట్​ కార్డులు మాత్రం ఏకంగా 93.4 కోట్లు.  క్రెడిట్​ బ్యూరోల వద్ద దేశంలోని 55 కోట్ల మంది కస్టమర్ల హిస్టరీ అందుబాటులో ఉందని జనవరి 2022 మంత్లీ బులెటిన్​లో ఆర్​బీఐ వెల్లడించింది. తమ మార్కెట్​ను విస్తరించుకునే టార్గెట్​తో చాలా ఫిన్​టెక్​ కంపెనీలు సబ్​–ప్రైమ్​ కస్టమర్లతో పాటు, కొత్తగా క్రెడిట్​ మార్కెట్లోకి వచ్చే వారికి రకరకాల మోడల్స్​లో అప్పులు ఇస్తున్నాయి. బై నౌ పే లేటర్​ (బీఎన్​పీఎల్​), ఈఎంఐలు, ప్రీపెయిడ్​ కార్డులు, లేదా తమ బిల్లులను మూడు లేదా ఎక్కువ ఇన్​స్టాల్​మెంట్లలో చెల్లించేలా ఈ ఫిన్​టెక్​ కంపెనీలు అప్పులు అందిస్తున్నాయి. దేశంలో మరింత ఎక్కువ మందికి అప్పులు దొరకాలంటే డిజిటల్​ క్రెడిట్​ కార్డులు, లైన్​ ఆఫ్​ క్రెడిట్​ఇచ్చే కంపెనీలకు లైసెన్స్​ అవసరం ఉండకూడదని డిజిటల్​ లెండింగ్​పై  ఆర్​బీఐ వర్కింగ్​ గ్రూప్​ రిపోర్టు వెల్లడించింది. 

For more news..

బీఎస్‌‌‌‌ 6 కార్లకు సీఎన్జీ కిట్స్‌‌‌‌