
ఏటీఎం ఇంటర్ఛేంజ్ ఫీజుల రివిజన్కు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. మే 1, 2025 నుంచి ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ ట్రాన్షాక్షన్స్పై ఈ ఇంటర్ ఛేంజ్ ఫీజుల్లో చేసిన మార్పులుచేర్పులు అమల్లోకి వస్తాయి. ఫైనాన్షియల్ ట్రాన్షాక్షన్స్పై రెండు రూపాయలు పెంచుకునేందుకు, నాన్-ఫైనాన్షియల్ ట్రాన్షాక్షన్స్పై రూపాయి ఒక రూపాయి పెంచుకునేందుకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయం వల్ల తక్కువ ఏటీఎంలు ఉన్న బ్యాంకులపై ప్రభావం పడనుంది. కస్టమర్లపై ఈ భారం నేరుగా పడనుంది. ఫైనాన్షియల్ ట్రాన్షాక్షన్లపై ఇంటర్ ఛేంజ్ ఫీజు 17 నుంచి 19 రూపాయలకు, బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి నాన్-ఫైనాన్షియల్ ట్రాన్షాక్షన్లపై ఇంటర్ ఛేంజ్ ఫీజును 6 నుంచి 7 రూపాలయకు పెంచుకునేందుకు ఆర్బీఐ అనుమతి తెలిపింది.
ఏటీఎం ఇంటర్ ఛేంజ్ ఫీజు అంటే ఏంటో సింపుల్గా చెప్పాలంటే.. కొన్నిసార్లు మన బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం సెంటర్ అందుబాటులో లేకపోతే వేరే బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తుంటాం. మెట్రో ఏరియాల్లో 5 సార్లు, నాన్-మెట్రో ఏరియాల్లో 3 సార్లు ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో డబ్బులు విత్ డ్రా చేస్తే ఎటువంటి ఛార్జీలు కస్టమర్కు పడవు. కానీ.. ఈ లిమిట్ దాటితే వేరే బ్యాంకు ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసినందుకు ఇంటర్ ఛేంజ్ ఫీజు పడుతుంది. ఈ ఫీజుల్లో జూన్ 2021లో చివరిగా మార్పులుచేర్పులు చేశారు.
మళ్లీ.. ఇప్పుడు ఈ ఫీజును పెంచుకునేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. అందువల్ల.. ఈ ఛార్జీల నుంచి కస్టమర్లు తప్పించుకోవాలంటే ఒక్కటే మార్గం. ఏ బ్యాంకు డెబిట్ కార్డు ఉందో.. అదే బ్యాంకు ఏటీఎం సెంటర్ నుంచి డబ్బు డ్రా చేస్తే ఈ ఇంటర్ఛేంజ్ ఛార్జీల మోత నుంచి కస్టమర్ తప్పించుకోవచ్చు. డిజిటల్ ట్రాన్షాక్షన్స్ ఎక్కువగా చేస్తే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయాల్సిన అవసరం కూడా దాదాపుగా రాకపోవచ్చు. ఏటీఎంల్లో డబ్బు డ్రా చేస్తున్నప్పుడు ట్రాన్షాక్షన్ లిమిట్ దాటిందో, లేదో గుర్తుంచుకుంటే కస్టమర్లు అలర్ట్గా ఉండొచ్చు.