సులువుగా లోన్లు పొందేందుకు యూఎల్​ఐ

సులువుగా లోన్లు పొందేందుకు యూఎల్​ఐ
  • త్వరలో ఆర్​బీఐ ద్వారా అందుబాటులోకి

బెంగళూరు:  రిజర్వ్ బ్యాంక్ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌‌‌‌ఫేస్ (యూఎల్​ఐ)ని త్వరలోనే జాతీయస్థాయిలో ప్రారంభించనుంది.  ఇది యూపీఐ మాదిరే పనిచేస్తుంది. యూపీఐ యాప్‌‌‌‌ని ఉపయోగించి అన్ని బ్యాంకులకు చెల్లింపులు చేయగలిగినట్టే... యూఎల్​ఐ ద్వారా ఒకే యాప్‌‌‌‌ని ఉపయోగించి అన్ని బ్యాంకుల నుంచి లోన్లు పొందవచ్చు. ముఖ్యంగా చిన్న,  గ్రామీణ రుణగ్రహీతలకు మేలు చేయడానికి యూఎల్​ఐ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆర్​బీఐ తెలిపింది.  గత సంవత్సరం, రిజర్వ్ బ్యాంక్ రెండు రాష్ట్రాల్లో సులభ రుణాలను ఇచ్చే టెక్నాలజీ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌ను పైలట్‌‌‌‌గా ప్రారంభించింది.  

వివిధ రాష్ట్రాల భూ రికార్డులతో సహా డిజిటల్ సమాచారంతో ఇది పనిచేస్తుందని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.   యూఎల్​ఐ క్రెడిట్ అసెస్​మెంట్​ కోసం పట్టే సమయాన్ని తగ్గిస్తుందని, ముఖ్యంగా చిన్న,  గ్రామీణ రుణగ్రహీతలకు తేలిగ్గా అప్పులు పుడతాయని చెప్పారు. దరఖాస్తుదారులు భారీగా డాక్యుమెంటేషన్ అవసరం లేకుండానే సులువుగా క్రెడిట్ పొందవచ్చని, త్వరగా టర్న్‌‌‌‌అరౌండ్ సమయాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుందని ఆయన చెప్పారు. ముఖ్యంగా వ్యవసాయ, ఎంఎస్​ఎంఈ రుణగ్రహీతల డిమాండ్​ను ఇది తీర్చగలదని దాస్ చెప్పారు.