హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గూప్- 1 పరీక్షపై దాఖలైన పిటిషన్లపై తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది. గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి దాఖలైన వేర్వేరు పిటిషన్లపై ఇవాళ (అక్టోబర్ 4) విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. ఇరువర్గాల వాదప్రతివాదనలు పూర్తిగా విని తీర్పును హోల్డ్‌లో పెట్టింది. కాగా, ఈ ఏడాది జూన్ 9వ తేదీన 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం టీజీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. జూన్ 13వ తేదీన ప్రిలిమినరీ కీ రిలీజ్ చేసింది.
ఈ క్రమంలోనే గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రిలిమినరీ ‘కీ’ లో తప్పులు ఉన్నాయని.. కీని రీ నోటిఫికేషన్ చేయాలని కొందరు, గ్రూప్ 1 పరీక్షలో ఎస్టీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ మరీ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టగా.. తప్పుడు ప్రశ్నలు తొలగించి మళ్లీ మెరిట్ జాబితా విడుదల చేయాలని అభ్యర్థుల తరుఫు లాయర్ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. సబ్జెక్ట్ నిపుణుల కమిటీ అన్ని పరిశీలించాకే ‘కీ’ రూపొందించామని.. కీలో తప్పులు ఉన్నాయంటూ కొందరు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేయాలని టీజీపీఎస్సీ తరుఫు లాయర్ వాదించారు.
త్వరలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయని.. ఈ సమయంలో కోర్టులు జోక్యం చేసుకుంటే మెయిన్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని టీజీపీఎస్సీ పేర్కొంది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల (అక్టోబర్) 21వ తేదీ నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గ్రూప్ 1 పిటిషన్లపై హైకోర్టు తీర్పు హోల్డ్ చేయడంతో మెయిన్స్ రాసే అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.