రిజర్వాయర్లు ఖాళీ అవుతున్నయ్!

రిజర్వాయర్లు ఖాళీ అవుతున్నయ్!
  •     పాలేరులో 8.85 అడుగులకు చేరిన నీటిమట్టం
  •     వైరాలో 5.11 అడుగుల మేర మాత్రమే నీరు
  •     మరో 15 రోజులకు మాత్రమే తాగునీరు

ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో రిజర్వాయర్లు అడుగంటుతున్నాయి. రోజురోజుకు పాలేరు, వైరా రిజర్వాయర్లలో నీళ్లు తగ్గిపోతున్నాయి. జూన్ నెలాఖరుకు చేరుతున్నా ఇప్పటి వరకు సరైన వర్షాలు లేకపోవడంతో రిజర్వాయర్లకు పెద్దగా ఇన్ ఫ్లో రావడం లేదు. ప్రధానంగా నాగార్జున సాగర్ నుంచి వచ్చే నీటి పైనే ఆధారపడాల్సి రావడం, గతేడాది వర్షాల్లేక సాగర్ ప్రాజెక్టులోనూ నీళ్లు లేకపోవడంతో కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని విడుదల చేశారు.

ఎడమ కాల్వ ద్వారా మే నెలలో పాలేరు రిజర్వాయర్ కు విడుదల చేసిన నీరును  ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఎండాకాలం తాగునీటి అవసరాలకోసం ఉపయోగించారు. అవి కూడా ఇప్పుడు తగ్గిపోయాయి. 

  •     పాలేరు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా (2.5 టీఎంసీలు), ప్రస్తుత జలాశయంలో 8.85 అడుగుల (0.72 టీఎంసీలు)  వరకే నీళ్లున్నాయి. మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోని 4,200 హాబిటేషన్లకు పాలేరు జలాశయం నుంచి నీరు సరఫరా అవుతోంది. మరో 15 రోజులకు సరిపడా మాత్రమే తాగునీరు అందించే అవకాశం ఉంది. వర్షాల కారణంగా ఇటీవల జలాశయానికి 90 క్యూసెక్కుల మేర మాత్రమే వరద నీరు వచ్చి చేరింది. 
  •     వైరా రిజర్వాయర్ లో పూర్తి స్థాయి నీటి మట్టం 18.3 (2.5 టీఎంసీలు) అడుగులు కాగా, ప్రస్తుతం కేవలం 5.11 (0.795) అడుగుల వరకే  నీరు నిల్వ ఉంది. ఈ రిజర్వాయర్ ద్వారా వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. నిల్వ ఉన్న నీరు మరో రెండు వారాలపాటు తాగునీటి అవసరాలకు సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. 
  •     సాగర్ ఆయకట్టు కింద జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలు సాగుభూములుండగా వీటికి కూడా ఈ రెండు రిజర్వాయర్లే ప్రధానంగా నీటి నిల్వకు ఉపయోగపడతాయి. తాగునీటికి కూడా ఇప్పుడు సరిపోను నీళ్లు లేకపోవడంతో మరికొద్దిరోజుల్లో వర్షాలు పడకపోతే రైతులకు తిప్పలు తప్పేలా లేవు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఆగస్ట్ 15 నాటికి సీతారామ ప్రాజెక్టు నుంచి లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్ కు నీళ్లు చేర్చితే దాదాపు లక్షన్నర ఎకరాలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.