చండూరు (మర్రిగూడ), వెలుగు : డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా శివన్నగూడెం రిజర్వాయర్ కోసం భూములు ఇచ్చిన వారికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నల్గొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రాజెక్ట్ శంకుస్థాపన టైంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. అలాగే మర్రిగూడ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఖుదాభక్షపల్లి, రాంరెడ్డిపల్లి, లోయపల్లి, అజిలాపురం నిర్వాసితులు చేపట్టిన దీక్షలు సోమవారంతో ఐదో రోజుకు చేరుకున్నాయి. ప్రాజెక్ట్ కోసం భూములు తీసుకోవడంతో 200 మంది రైతుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించే వరకు ఆందోళన చేస్తామని చెప్పారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ భాస్కరరావుకు వినతిపత్రం అందజేశారు.
చేనేత కళాకారులను ఆదుకోవాలి
కోదాడ, వెలుగు : చేనేత, హస్త కళాకారులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ సూచించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని వర్తక సంఘం భవన్‌లో కళా సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళా ప్రదర్శనను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక చేనేత, హస్త కళాకారులను ఆదుకుంటోందన్నారు. అనంతరం కోదాడ పీఏసీఎస్‌లో బ్యాంకింగ్ సేవలు, గోల్డ్ లాకర్లు, సీసీ కెమెరాలను ప్రారంభించారు. అలాగే వివిధ వార్డుల్లో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బుర్ర సుధారాణి, ఎంపీపీ చింత కవిత, పీఏసీఎస్ చైర్మన్ ఆవుల రామారావు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, పైడిమర్రి సత్య బాబు, చందు నాగేశ్వరరావు, గుండెల సూర్యనారాయణ పాల్గొన్నారు.
దళితులకు 300 యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్ ఇయ్యాలి
సూర్యాపేట, వెలుగు : దళితులకు 300 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ ఇవ్వాలని కేవీపీఎస్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కోట గోపి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్‌ఈ పాల్‌రాజ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ దళితులకు 101 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని తెచ్చిన జీవోను 342 అమలు కావడం లేదన్నారు. కేరళ, ఏపీ, ఢిల్లీ మాదిరిగా తెలంగాణలో కూడా 300 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో జిల్లా అధ్యక్షుడు మర్రి నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యురాలు బొడ్డుపల్లి వెంకటరమణ, జిల్లా ఉపాధ్యక్షుడు నందిగామ సైదులు, పిండిగ నాగమణి, ఇరుగు రమణ పాల్గొన్నారు.
ప్రభుత్వ స్కూల్స్‌ను స్మార్ట్‌గా తీర్చిదిద్దుతాం
యాదాద్రి, వెలుగు : ప్రభుత్వ బడులను స్మార్ట్ స్కూల్స్‌గా తీర్చిదిద్దుతామని టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ చైర్‌పర్సన్, సినీ నటి మంచు లక్ష్మి చెప్పారు. యాదాద్రి జిల్లా వడపర్తి స్కూల్‌లో సోమవారం డిజిటల్ ల్యాబ్‌ను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని 27 స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, ఎంపీపీ నరాల నిర్మల, జడ్పీటీసీ సూబ్బూరు బీరుమల్లయ్య, సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి ఉన్నారు. అంతకుముందు ఆమె యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు అద్దాల మండపం వద్ద ఆమెకు వేదాశీర్వచనం చేయగా, అద్దాల మండపం వద్ద ఆమెకు ఆలయ ప్రధానార్చకులు మోహనాచార్యులు వేదాశీర్వచనం చేయగా.. ఏఈవో రామ్మోహన్ స్వామివారి ప్రసాదం అందజేశారు.
సాగర్ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
హాలియా, వెలుగు : శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. సాగర్‌కు 1,79,003 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో 16 గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తి 1,28,096 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌లో ప్రస్తుతం 589.10 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. సాగర్ నుంచి కుడికాల్వకు 1,00,40 క్యూసెక్కులు, ఎడమకాల్వకు 6,634, ఎస్‌ఎల్‌బీసీకి 1,800, వరదకాల్వకు 400, మెయిన్ పవర్ హౌజ్‌కు 32,033 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
సమస్యల పరిష్కారానికి పోరాడాలి
సూర్యాపేట, వెలుగు : బంజారాలు తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలు చేయాలని ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచంద్రనాయక్ సూచించారు. సోమవారం సూర్యాపేటలో జరిగిన నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. సంచార జాతులకు సంక్షేమ పథకాలు అందే వరకు పోరాటం చేస్తానని చెప్పారు. అనంతరం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ధరావత్ బాబునాయక్‌ను సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సోమునాయక్, భాస్కర్‌నాయక్, గోపాల్‌నాయక్, అజయ్ నాయక్, ప్రధాన కార్యదర్శులు నరినాయక్, వాంకుడోత్ వెంకన్ననాయక్, పుల్‌సింగ్, కోశాధికారి వెంకన్న పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ హయాంలోనే హుజూర్‌నగర్ అభివృద్ధి
హుజూర్‌నగర్, వెలుగు : హుజూర్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధి టీఆర్‌ఎస్ హయాంలోనే జరిగిందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చెప్పారు. పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలో గత పాలకులు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని, 6 నెలల్లో పనులన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పారు. కోర్టుల్లో కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదన్నారు. అనంతరం పట్టణంలోని 17వ వార్డుకు చెందిన అవిరేసి స్వాతికి గుండె ఆపరేషన్ కోసం రూ. 3 లక్షల ఎల్‌వోసీ అందజేశారు. అలాగే లింగగిరి రోడ్డులో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
మోటార్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్ట్
భూదాన్‌పోచంపల్లి, వెలుగు : వ్యవసాయ బావుల వద్ద మోటార్లను చోరీ చేస్తున్న ముఠాను సోమవారం యాదాద్రి జిల్లా భూదాన్‌పోచంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ ఉదయ్‌రెడ్డి వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... బీదర్‌కు చెందిన హజార్ఖాన్, సందీప్ బెరధార్, నజీర్‌ఖాన్, సతీశ్ దేవకట్టె, హైదరాబాద్‌కు చెందిన ఎస్‌కే. షకీర్ కలిసి వ్యవసాయ మోటార్లను చోరీ చేస్తున్నారు. గత నాలుగు నెలల్లో భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్, రామన్నపేట, వలిగొండ, అబ్దుల్లాపూర్‌మెంట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 82 మోటార్లను దొంగిలించారు. సోమవారం తెల్లవారుజామున పోచంపల్లి మండలం జిబ్లక్‌పల్లి పరిధిలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన కారును ఆపి తనిఖీ చేశారు. అందులో విద్యుత్ మోటార్లు కనిపించడంతో కారులో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించారు. వారిచ్చిన సమాచారంతో మరో వ్యక్తితో పాటు హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్‌కు చెందిన షకీర్‌ను అరెస్ట్ చేయగా, హజార్ఖాన్ పరారీలో ఉన్నాడని ఏసీపీ తెలిపారు. వారి వద్ద నుంచి 9 మోటార్లు, కారు, బైక్, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆయన వెంట చౌటుప్పవ్ రూరల్ సీఐ వెంకటయ్య, ఎస్సై సైదిరెడ్డి పాల్గొన్నారు.
హత్య కేసులో జీవిత ఖైదు
యాదాద్రి, వెలుగు : హత్య కేసులో ఓ వ్యక్తికి జీవిత ఖైదుతో పాటు, రూ. 10 వేల ఫైన్ వేస్తూ యాదాద్రి జిల్లా జడ్జి వి.బాలభాస్కర్‌రావు సోమవారం తీర్పు చెప్పారు. కేసుకు సంబంధించిన వివరాలు... యాదాద్రి జిల్లా గుండాల మండలం సీతారాంపురానికి చెందిన జోగు ఐలయ్యకు 2014లో కులపెద్ద జోగు దానయ్య రూ. 30 వేల ఫైన్ విధించారు. దీంతో దానయ్యపై కోపం పెంచుకున్న ఐలయ్య అతడిని హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. 2016 ఫిబ్రవరి 9న దానయ్య వ్యవసాయ బావి నుంచి ఇంటికి వస్తుండగా గమనించిన ఐలయ్య ట్రాక్టర్‌తో ఢీకొట్టి హత్య చేశాడు. గమనించిన దాన్యయ కొడుకు నర్సయ్య వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయగా నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. నర్సయ్య గుండాల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐలయ్యను జ్యూడీషియల్ కస్టడికి తరలించారు. అతడు హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో జీవిత ఖైదు, రూ. 10 వేల ఫైన్ వేస్తూ తీర్పు ఇచ్చారు.
స్కూల్ అభివృద్ధికి రూ. 5 లక్షలు అందజేత
మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని జడ్పీ గర్ల్స్ హైస్కూల్‌లో వసతుల కల్పనకు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి రూ. 5 లక్షల ఆర్థికసాయం అందజేశారు. ఈ చెక్కును సోమవారం స్కూల్ స్టాఫ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూసమాజ నిర్మాణంలో టీచర్లే కీలకం అన్నారు. అనంతరం టీచర్లను సన్మానించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు కొమ్ము శ్రీనివాస్, గంధం రామకృష్ణ, జాని పాల్గొన్నారు.
ఓటర్ కార్డును ఆధార్‌తో అనుసంధానించాలి
దేవరకొండ, వెలుగు : ప్రతి ఒక్కరూ తమ ఓటర్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని దేవరకొండ ఆర్డీవో గోపీరాం సూచించారు. నల్గొండ జిల్లా దేవరకొండ ఎంపీడీవో ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీడీవో శర్మ, తహసీల్దార్ రాజు పాల్గొన్నారు.
సబ్ జైలులో మైనర్లను ఉంచొద్దు
హుజూర్‌నగర్, వెలుగు : బాల నేరస్తులను సబ్‌జైలులో ఉంచకూడదని బాల నేరస్తుల జస్టిస్ బోర్డు సభ్యుడు జి.మోహన్‌రావు సూచించారు. బోర్డు సభ్యురాలు లలితతో కలిసి సోమవారం హుజూర్‌నగర్ సబ్‌జైలును పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. 18 ఏళ్ల లోపు పిల్లలను జువైనల్ హోమ్‌కు తరలించాలన్నారు. ఆయన వెంట జైలు సూపరింటెండెంట్ లావోరి మంగత ఉన్నారు.
ఎల్‌ఐసీ ప్రీమియంపై జీఎస్టీ ఎత్తివేయాలి
సూర్యాపేట/హుజూర్‌నగర్/కోదాడ/నల్గొండ అర్బన్, వెలుగు : ఎల్‌ఐసీ ప్రీమియంపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఎల్‌ఐసీ ఏజెంట్లు సోమవారం నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించారు. సూర్యాపేటలో ఏజెంట్ల ఆందోళనకు టీఆర్‌ఎస్ లీడర్లు సైతం మద్దతు ప్రకటించారు. సూర్యాపేటలో జడ్పీ చైర్‌పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్‌రావు, హుజూర్‌నగర్‌లో సికింద్రాబాద్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ గొంగారెడ్డి నాగిరెడ్డి, నల్గొండలో కట్టా వెంకట్‌రెడ్డి హాజరై మాట్లాడారు. పాలసీదారుల ప్రీమియంపై జీఎస్టీ వసూలు చేయడం వల్ల భారం పడుతోందన్నారు. జీఎస్టీని ఎత్తివేయడంతో పాటు, బోనస్ పెంచాలని డిమాండ్ చేశారు. ల్యాప్ట్ అయిన పాలసీలను పునరుద్ధరించుకునే చాన్స్ ఇవ్వాలని, పాలసీలపై తీసుకున్న లోన్‌కు వడ్డీ తగ్గించాలి కోరారు. సూర్యాపేటలో మున్సిపల్ చైర్‌పర్సన్ అన్నపూర్ణ, జడ్పీ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, హుజూర్‌నగర్‌లో మోహన్‌రెడ్డి, యాదగిరి, నల్గొండలో డివిజన్ అధ్యక్షుడు జానకిరెడ్డి, నాయకులు సత్యనారాయణ పాల్గొన్నారు.
దళితబంధులో మాలలకు అన్యాయం
మునుగోడు, వెలుగు : దళితబంధు ఎంపికలో మాలలకు అన్యాయం జరుగుతోందని మాల మహానాడు జాతీయ స్టీరింగ్ కమిటీ సభ్యుడు సైదులు ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మునుగోడులో సోమవారం మీడియాతో మాట్లాడారు. మాలలకు దళితబంధు ఇవ్వకపోతే మునుగోడు నియోజకవర్గంలో తిరగకుండా అడ్డుకుంటామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎక్కువగా ఉన్న మునుగోడులో అన్ని పార్టీలు బహుజనులకే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ ఇల్లు ఇవ్వకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షుడు బోగరి విజయకుమార్, నాయకులు బేరి లింగస్వామి, హరి, తెలగమల మురళి, మహేశ్వర అరవింద్, మంచాల వేణు పాల్గొన్నారు.
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
నార్కట్‌పల్లి, వెలుగు : బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ప్రమాదం నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మిర్యాలగూడకు చెందిన వెదురుపల్లి మహేశ్ (25) బైక్‌పై నార్కట్‌పల్లి మండలం ఎనుగులదొరి గ్రామం నుంచి నార్కట్‌పల్లికి వస్తున్నాడు. ఈ క్రమంలో మునుగోడు రోడ్డులోని అండర్‌పాస్ వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ మహేశ్ స్పాట్‌లోనే చనిపోయాడు.
ప్రజావాణికి 62 ఫిర్యాదులు
యాదాద్రి, వెలుగు : యాదాద్రి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 62 ఫిర్యాదులు అందాయి. వీటిలో రెవెన్యూకు సంబంధించినవి 50 ఉండగా మిగతావి వివిధ శాఖలకు చెందినవని ఆఫీసర్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంట వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆఫీసర్లను ఆదేశించారు. ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్
డి.శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ విజయకుమారి పాల్గొన్నారు.
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి
చౌటుప్పల్, వెలుగు : ఆవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలన్న డిమాండ్‌తో మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ కోటిపల్లి శివకుమార్ ప్రకటించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లోని అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో మానసిక వికలాంగుల చేతుల మీదుగా సోమవారం మునుగోడు ఎన్నికల పాంప్లెంట్స్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఎనిమిదేళ్లుగా పోరాటం చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. ఎంఐఎంకు సహకారం అందిస్తున్న సీఎంకు మునుగోడు ఎన్నికల్లో కచ్చితంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ నెల 11 నుంచి మునుగోడులో ‘గడపగడపకూ గోమాత’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.
రాంపూర్ కేజీబీవీ స్టాఫ్‌పై చర్యలు తీసుకోవాలి
యాదగిరిగుట్ట, వెలుగు : యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం రాంపూర్ కేజీబీవీ స్టూడెంట్లతో హమాలీ పని చేయించడాన్ని నిరసిస్తూ సోమవారం ఏబీవీపీ నాయకులు స్కూల్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ బాలికల చేత బియ్యం సంచులు మోయించడం హేయమైన చర్య అన్నారు. ఆఫీసర్లు స్పందించి కేజీబీవీ ప్రిన్సిపల్, స్కూల్ స్టాఫ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సంజయ్, వేణు, భరత్, మల్లికార్జున్, విజయ్, మధు, గణేశ్, మహేశ్, రాజు పాల్గొన్నారు.
సొసైటీ బలోపేతమే లక్ష్యం
మిర్యాలగూడ, వెలుగు : పీఏసీఎస్‌లను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నారం పీఏసీఎస్ ఆవరణలో నిర్మించిన గోడౌన్, గోల్డ్ లోన్ కౌంటర్‌ను సోమవారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్లలో దీర్ఘకాలిక, క్రాప్, గోల్డ్, మార్టిగేజ్, ఎడ్యుకేషన్ లోన్ల శాతాన్ని పెంచడం ద్వారా టర్నోవర్‌ను రూ. 900 కోట్ల నుంచి రూ.1,900 కోట్లకు చేరుకుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడుతూ రైతులకు యూరియా, ఇతర ఎరువుల సరఫరాతో పాటు అవసరమైన సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నూకల సరళహనుమంతరెడ్డి, జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, ఎస్‌ఎంసీ మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అంబటి వెంకట్‌రెడ్డి, డీసీసీబీ సీఈవో మదన్‌మోహన్ పాల్గొన్నారు.
సాగర్ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
హాలియా, వెలుగు : శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. సాగర్‌కు 1,79,003 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో 16 గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తి 1,28,096 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌లో ప్రస్తుతం 589.10 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. సాగర్ నుంచి కుడికాల్వకు 1,00,40 క్యూసెక్కులు, ఎడమకాల్వకు 6,634, ఎస్‌ఎల్‌బీసీకి 1,800, వరదకాల్వకు 400, మెయిన్ పవర్ హౌజ్‌కు 32,033 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.