- కెనడా, మెక్సికోలోని కొన్ని ప్రాంతాల్లోనూ కనిపించిన గ్రహణం
- గంటల తరబడి ప్రయాణించి నార్త్‌కు చేరుకున్న అమెరికన్లు
వాషింగ్టన్: నార్త్ అమెరికా, పసిఫిక్ తీర ప్రాంతాల్లో సోమవారం ఖగోళ అద్భుతం చోటుచేసుకుంది. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు రావడంతో సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆకాశంలో ఈ అద్భుతం మొదలైంది. భూమికి, సూర్యుడికి సరిగ్గా మధ్యలో చంద్రుడు చేరడంతో గ్రహణం మొదలైంది.
దీంతో పట్టపగలే నార్త్ అమెరికా సిటీలను చీకట్లు కమ్మేశాయి. సౌత్ పసిఫిక్ లో ప్రారంభమైన గ్రహణం నార్త్ అమెరికాలోకి ఎంటరై, ఆపై మెక్సికో, కెనడా, అట్లాంటా గుండా సాగింది. సరిగ్గా 4 నిమిషాల 28 సెకండ్ల పాటు కొనసాగిన గ్రహణం.. ఆపై క్రమంగా వీడిపోయింది. సంపూర్ణ సూర్య గ్రహణాన్ని చూసేందుకు అమెరికన్లు బీచ్ లకు, వ్యూ పాయింట్లకు, జూలకు పోటెత్తారు.
సుదూర ప్రాంతాల నుంచి గంటల తరబడి ప్రయాణించి మరీ గ్రహణం చూసేందుకు నార్త్ అమెరికా సిటీలకు చేరుకున్నారు. గ్రహణ సమయంలో జంతువుల ప్రవర్తనలో వచ్చే మార్పులు పరిశీలించేందుకు పరిశోధకులు జూలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భూ వాతావరణంలో మార్పులను గుర్తించేందుకు నాసా మూడు సౌండ్ రాకెట్లను ప్రయోగించింది. దీంతో పాటు 600 బెలూన్లను ఆకాశంలోకి ఎగరేసి మరో ప్రయోగం కూడా నిర్వహించింది.