యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలోని నృసింహ (బస్వాపురం) రిజర్వాయర్ నిర్వాసితులు మరోసారి ఆందోళన బాటపట్టారు. తమకు ఇవ్వాల్సిన భూముల పరిహారం, స్ట్రక్చర్ వ్యాల్యూ , పరిహారం కలిపి రూ.145 కోట్లు వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం రాత్రి రిజర్వాయర్ పనులను అడ్డుకున్నారు. కట్టపైనే టెంట్ వేసుకొని ఆందోళనకు దిగారు. నిర్వాసితులకు నచ్చెజెప్పడానికి ఆఫీసర్లు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి రంగంలోకి దిగారు. ఏదో ఒకటి చేసి పరిహారం ఇప్పించాలని, లేదంటే వచ్చే ఎన్నికల్లో తనకు కష్టాలు తప్పవని మొరపెట్టుకున్నారు.
నాలుగేండ్లుగా ఆందోళన
జిల్లాలోని భువనగిరి మండలం బస్వాపురంలో 11.39 టీఎంసీల కెపాసిటీతో నృసింహ రిజర్వాయర్ నిర్మాణం ఏండ్ల తరబడి కొనసాగుతోంది. ఈ రిజర్వాయర్ కారణంగా బీఎన్ తిమ్మాపురం, లప్ప నాయక్ తండా, చోక్లా నాయక్ తండా పూర్తిగా మునిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద హుస్సేనాబాద్, దాతరుపల్లిలో బాధితులకు ప్లాట్లు కేటాయించింది. అయితే ఇండ్లు మునిగిపోతున్నందున వాటికి సంబంధించి ఆఫీసర్లు స్ట్రక్చర్ వ్యాల్యూ లెక్కించారు.
ఆఫీసర్ల లెక్క ప్రకారం బీఎన్ తిమ్మాపురం గ్రామానికి సంబంధించిన 600 ఇండ్ల స్ట్రక్చర్ వ్యాల్యూ రూ.95 కోట్లు, ఇంకా రావాల్సిన భూముల పరిహారం రూ.50 కోట్లు కలిపి మొత్తం రూ.145 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే భూ పరిహారం అందరికీ ఒకేసారి ఇవ్వాలని గడిచిన నాలుగేండ్లుగా నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. 2020లో 11 రోజులు, 2022లో కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. నిరుడు నెలకుపైగా రిజర్వాయర్ పనులు ఆపి కట్టపైనే వంటావార్పు నిర్వహించారు. అయినా బాధితులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిహారం అందించలేదు.
ఫండ్స్ రిలీజ్ అయినా..
బీఎన్ తిమ్మాపురం గ్రామానికి అందాల్సిన పరిహారం, స్ట్రక్చర్ వ్యాల్యూ మొత్తం రూ.145 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించి జూన్ 16న టోకెన్ నంబర్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ ఇప్పటి వరకూ బాధితులకు డబ్బులు అందలేదు. భూమికి సంబంధించిన పరిహారం పూర్తిగా అందకపోగా.. స్ట్రక్చర్ వ్యాల్యూ కూడా రాకపోవడంతో నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ప్లాట్లు కేటాయించడంతో తమను ఎక్కడ ఖాళీ చేయమంటారో అని టెన్షన్ పడుతున్నారు. తమకు ఇవ్వాల్సిన భూముల పరిహారం, స్ట్రక్చర్ వ్యాల్యూ , పరిహారం కలిపి రూ.145 కోట్లు వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం రాత్రి రిజర్వాయర్ పనులను అడ్డుకున్నారు. రిజర్వాయర్ కట్టపైనే టెంట్ వేసుకొని ఆందోళనకు దిగారు.
ఈనెల 15లోపు పరిహారం అందేలా చూస్తం
రిజర్వాయర్ పనులను అడ్డుకున్నారని సమాచారం అందుకున్న ఆఫీసర్లు గురువారం అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. ఈనెల 15 వరకూ పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే నిర్వాసితులు మాత్రం పరిహారం ఇచ్చే వరకూ పనులు కొనసాగనీయబోమని స్పష్టం చేశారు. 15 వరకూ పరిహారం ఇస్తామంటున్నారు కాబట్టి అప్పటి వరకూ పనులు మీరే ఆపేయండని అధికారులకు కరాఖండిగా చెప్పారు. దీంతో ఆఫీసర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
డబ్బులు ఇప్పించండి : మంత్రి హరీశ్‌తో ఎమ్మెల్యే పైళ్ల
పరిహారం, స్ట్రక్చర్ వ్యాల్యూ కోసం నిర్వాసితులు ఆందోళన చేస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి బీఎన్ తిమ్మాపురం ఎంపీటీసీ ఉడుత శారద ఆంజనేయులు తీసుకెళ్లారు. దీంతో వెంటనే ఆయన మంత్రి హరీశ్‌రావు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. నిర్వాసితులకు రావాల్సిన అమౌంట్ వెంటనే ఇప్పించాలని, లేకపోతే ఎన్నికల సమయంలో తనకు ఇబ్బందిగా మారుతుందని చెప్పినట్లు సమాచారం.