హైదరాబాద్ సిటీ, వెలుగు: అమీన్పూర్పరిధి సర్వే నంబర్12లోని ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా మార్చి తమకు అంటగట్టారని, సర్వే నంబర్6లో ఉన్నట్లు చూపించి మోసం చేశారని పలువురు హైడ్రాను ఆశ్రయించారు. తమను మోసగించిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైడ్రా ఆఫీసులో కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. మాధవరెడ్డి, చంద్రశేఖర్, కోటేశ్వరరావు అనే వ్యక్తుల దగ్గర ప్లాట్లు కొని మోసపోయామని వాపోయారు.
అలాగే అమీన్ పూర్ మండలంలోని పెద్ద చెరువు అలుగులు మూసేసి, చెరువు నీరు ఎగువన ఉన్న స్థలాల్లోకి వచ్చేలా చేశారంటూ మరికొందరు ఫిర్యాదు చేశారు. పెద్ద చెరువు కింద ఉన్న బండికుంట చెరువుకు నీరు పోకుండా అలుగులు కబ్జా చేశారని చెప్పారు. సర్వే నంబర్153లోని పార్కు స్థలాన్ని కొత్తగా వెంచర్ వేస్తున్నవారు కబ్జా చేశారని అమీన్పూర్వెంకటరమణ కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. సర్వే చేయించి పార్కుతోపాటు లేఅవుట్లోని రోడ్లను కాపాడాలని కోరారు. ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని, సర్వే చేయించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని కమిషనర్ రంగనాథ్ వారికి హామీ ఇచ్చారు.