- అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయాలని ప్రచారం
- ఎకరానికి రూ.4 వేలు ప్రోత్సాహం ఇస్తామన్న సర్కారు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: చెప్పినట్లు పత్తి సాగు చేయండి.. ప్రభుత్వం రూ.4వేల ప్రోత్సాహం పంట సాగు దశలోనే ఇస్తుందని అధికారులు విస్తృతంగా ప్రచారం చేశారు. పంట పెట్టుబడికి డబ్బులు ఉపయోగపడతాయని ఆశ పడ్డ రైతులు ప్రభుత్వం సూచించినట్లుగా హైడెన్సిటీ పద్ధతిలో పత్తి సాగు చేశారు. పత్తి చేతికొస్తున్నా ప్రోత్సాహం జాడ లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు.
ప్రోత్సాహం కోసం ఎదురుచూపులు..
హైడెన్సిటీ పద్ధతిలో పత్తి సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందంటూ వ్యవసాయశాఖాధికారులు ప్రచారం చే శారు. మొదట రైతులు స్పందించకపోయినప్పటికీ ప్రభుత్వం నుంచి రూ. 4వేలు ప్రోత్సాహంతో పాటు అధిక దిగుబడి వస్తుందనే ఆశతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు ఈ పద్ధతిలో పంట సాగు చేశారు. జిల్లాలో వానా కాలం సీజన్లో 1.60 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశా రు. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసేందుకు ప్ర భుత్వం జిల్లాలోని కొన్ని ప్రాంతాలను పైలెట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేసింది. జిల్లాలోని పినపాక మండలంలో జానంపేట, బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం, దుమ్ముగూడెం మండలం దుమ్ముగూడెం, ఆర్లగూడెం, ఇల్లందు మండలం చల్లసముద్రం, ఇల్లందు, గుండాల మండలం కాచనపల్లి, గుండాల, కొత్తగూడెం, జూలూరుపాడు మండ లం మాచినేనిపేట, జూలూరుపాడు, పాపకొల్లు, సుజాతనగర్ మండలం సుజాతనగర్, సీతంపేట, లక్ష్మీదేవిపల్లి మండలంలో బంగారు చెలక, లక్ష్మీదేవిపల్లి, టేకులపల్లి మండలం బోడు, పాల్వంచ మండలం యానంబైలు, ఉల్వనూర్ క్లస్టర్లను పైలెట్ ప్రాజెక్ట్ కింద సెలెక్టర్ చేశారు.
ఈ ప్రాంతాల్లో 252 మంది రైతులు 397 ఎకరాల్లో అధిక సాంధ్ర పద్దతిలో పత్తి సాగు చేశారు. కొత్త విధానంలో పంట సాగు చేయాల్సి ఉండడంతో ఎంపిక చేసిన రైతులకు రూ.4 వేల చొప్పున సాగు మొదట్లోనే ప్రోత్సాహం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు ఆశపడ్డారు. ఖాతాల్లోనే ప్రోత్సాహం డబ్బులు జమ అవుతాయని అధికారులు చెప్పారు. పత్తి తీస్తున్నప్పటికీ ఆ డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవడంపై అధికారులను అడిగితే వస్తాయని చెబుతున్నారని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రోత్సాహం డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరుతున్నారు.
ప్రోత్సాహం వెంటనే ఇవ్వాలి..
అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేస్తే ప్రభుత్వం రూ.4 వేలు ప్రోత్సాహం సాగు మొదట్లోనే వస్తాయని అధికారులు చెప్పారు. పంట కోత కొచ్చినా ప్రోత్సాహం జాడలేదు. వెంటనే డబ్బులు ఖాతాల్లో వేయాలి.
- వెంకటేశ్వర్లు, రైతు
త్వరలోనే డబ్బులు వస్తాయ్
హైడెన్సిటీ పద్ధతిలో పత్తి సాగు చేసిన వారికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా డబ్బులు త్వరలో వస్తాయి. మొదటిసారి కొత్త పద్దతిలో రైతులు పత్తి సాగు చేసేందుకు ముందుకు రావడం అభినందనీయం.
- అభిమన్యుడు, డీఏవో, భద్రాద్రి కొత్తగూడెం