చర్లపల్లి రైల్వే టెర్మినల్ సర్వీస్​ రోడ్డును విస్తరిస్తే ఇండ్లు కోల్పోతాం

చర్లపల్లి రైల్వే టెర్మినల్ సర్వీస్​ రోడ్డును విస్తరిస్తే ఇండ్లు కోల్పోతాం
  • మహాలక్ష్మినగర్ కాలనీవాసుల నిరసన

మల్కాజిగిరి, వెలుగు: చర్లపల్లి రైల్వే టెర్మినల్ సర్వీస్ రోడ్డును 30 ఫీట్ల నుంచి 80 ఫీట్లకు విస్తరిస్తే తాము నష్టపోతామని స్థానిక మహాలక్ష్మి నగర్​కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఫ్లకార్డులు, ఫ్లెక్సీతో ధర్నాకు దిగారు. కాలనీ సంక్షేమ సంఘం నేతలు శ్రీనివాసరావు, శ్రీమన్నారాయణ మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణతో తాము ఇండ్లు కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. మింట్ కాలనీ, మహాలక్ష్మినగర్ లోని 40 ఫీట్ల రోడ్లు రైల్వే టెర్మినల్​లోని ఫుట్ఓవర్ బ్రిడ్జిలకు కనెక్ట్​అయి ఉన్నాయన్నారు.

 డెవలప్​చేస్తే ఓకే కానీ ఉన్న రోడ్డును 80 ఫీట్లకు పెంచితే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పటికే టెర్మినల్​కు దక్షిణం వైపున ఉన్న 3 రోడ్లను అందుబాటులోకి తెచ్చారని, మింట్ కాలనీ, మహాలక్ష్మికాలనీలోని 4 రోడ్లను వినియోగించుకుంటే రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని తెలిపారు. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్, రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. కానీ ఎలాంటి స్పందన లేదని, సీఎం రేవంత్​రెడ్డి చొరవ తీసుకొని న్యాయం చేయాలని కోరారు. ఆందోళనలో కాలనీ వాసులు మురళీధర్, అశోక్, నాగేశ్వరరావు, ఫణి, జాన్, ప్రేమ్ సాగర్, జ్యోతి కుమార్, నీరజ, అన్నపూర్ణ, పద్మావతి, మాధురి, మమత పాల్గొన్నారు.