
హనుమకొండ/పరకాల, వెలుగు: పరకాల అసెంబ్లీ బరిలో నిలిచేందుకు గ్రీన్ ఫీల్డ్ హైవే భూనిర్వాసిత రైతులు నామినేషన్ వేశారు. తమ సమస్యను ఇంతవరకు ఏ నాయకుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లలేదని, ఎన్నికల్లో గెలిచి తమ సమస్యను తామే పరిష్కరించుకుంటామన్నారు. దాదాపు వంద మంది నామినేషన్ వేస్తామని ముందుగా ప్రకటించినా, చివరకు ఎనిమిది మంది వేశారు. నామినేషన్లకు శుక్రవారం చివరిరోజు కావడంతో 20 మంది ఆర్డీవో ఆఫీస్కు వచ్చారు.
మధ్యాహ్నం 3గంటల వరకు మాత్రమే టైం ఉండడంతో అప్పటికే అక్కడికి చేరుకున్న ఎనిమిది మందిని అధికారులు లోపలికి పంపించి గేట్లు క్లోజ్ చేశారు. పోచారం గ్రామానికి చెందిన బూర్గుల రామచంద్రరావు, గోనె రాజు, ఐలి సాంబయ్య, పెండ్లి జనార్దన్ రెడ్డి, ఊరుగొండకు చెందిన రాజిరెడ్డి, వెల్లంపల్లికి చెందిన మంద సంధ్యారాణి, పాడి రవీందర్ రెడ్డి, సీతారాంపూర్కు చెందిన నల్లెల్ల సతీశ్ నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో 10 వేల మంది రైతులున్నారని, వాళ్లందరి కుటంబాల మద్దతుతో గెలిచి చూపిస్తామన్నారు.