- కాలుష్యంతో కిష్టారంవాసులకు అనారోగ్య సమస్యలు
- గ్రామానికి రెండు వైపులా సింగరేణి ఓపెన్ కాస్ట్
- పరిహారం ఇవ్వకుండా నాన్చుడు ధోరణి
- వాళ్లే ఖాళీ చేసి వెళ్లిపోయేలా ఇబ్బందులు
ఖమ్మం/సత్తుపల్లి, వెలుగు : సత్తుపల్లి మండలంలోని కిష్టారం వాసులు నల్లటి దుమ్ము, ధూళితో ఇబ్బందులు పడుతున్నారు. ఊరికి సమీపంలోనే సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఉంది. 2019లో ప్రారంభించిన ఈ మైన్లో బ్లాస్టింగ్ కారణంగా మొదటి నుంచి సమస్య ఉంది. 8 నెలల క్రితం దగ్గర్లోనే కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ఏర్పాటు చేశారు. దీంతో అది మరింత ఎక్కువైంది. ఓపెన్ కాస్ట్ లో తవ్విన బొగ్గును కన్వేయర్ బెల్టుల ద్వారా తెచ్చి, సీహెచ్పీ దగ్గర గూడ్స్ రైలు బోగీల్లో నింపుతున్నారు. దీంతో నల్లటి దుమ్ము, ధూళి కిలోమీటర్ల మేర వ్యాపిస్తోంది. అంబేద్కర్ నగర్ వద్ద హ్యాండ్లింగ్ ప్లాంట్ఉండగా, దానికి దగ్గరే ఉన్న కిష్టారం జీపీలో దాదాపు5 వేల మంది నివసిస్తున్నారు.
ఓవైపు ఓసీ నుంచి వచ్చే బొగ్గు కాలుష్యానికి తోడు, మరోవైపు హ్యాండ్లింగ్ ప్లాంట్ నుంచి వచ్చే ధూళితో కిష్టారంలోని ఇండ్లన్నీ నల్లటి దుమ్ముతో నిండిపోతున్నాయి. ఇండ్లలో వస్తువులు, నిల్వ చేసుకున్న నీళ్లపై కమ్ముతోంది. ఓసీకి సమీపంలో ఉన్న కొమ్మేపల్లి, జగన్నాథపురాలను అధాకారులు ఖాళీ చేయించారు. తమకు పరిహారం ఇవ్వకుండా ఊరు ఖాళీ చేసి వెళ్లి పోయేలా చేసేందుకు ఇబ్బందులు పెడుతున్నారు. వ్యాపిస్తున్న ధూళి కారణంగా ఊపిరితిత్తుల సమస్యలు వచ్చి, అనారోగ్యం పాలవుతున్నామని, చర్మవ్యాధులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనారోగ్యం పాలవుతున్నా పట్టింపులేదు..
సత్తుపల్లిలో 2005లో జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్(జేవీఆర్ ఓసీ)ని ఏర్పాటుచేశారు. దాని విస్తరణలో భాగంగా కిష్టారానికి అర కిలోమీటర్ దూరంలో ఉన్న కొమ్మేపల్లిని ప్రభావిత ప్రాంతంగా ప్రకటించి, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చి గ్రామాన్ని ఖాళీ చేయించారు. ఓసీ-–2 కోసం జగన్నాథపురంలో కూడా ఆర్అండ్ఆర్ ప్యాకేజీని అమలు చేశారు. అయితే ఈ రెండు ఓపెన్ కాస్ట్ మైనింగ్ జరిగే ప్రాంతాలకు ఏరియల్ డిస్టెన్స్ లో కిలోమీటర్ లోపే ఉన్న కిష్టారాన్ని మాత్రం ప్రభావిత ప్రాంతంగా ప్రకటించలేదు. తమ ఇబ్బందులు అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు అంటున్నారు. ఇక ఖమ్మం నుంచి సత్తుపల్లి వెళ్లే మెయిన్ రోడ్డును పక్కనే సైలో బంకర్ ఉండడంతో ఆ రోడ్డు మీద ప్రయాణించే వాహనదారులకు కూడా ప్రమాదకరంగా మారింది.
సాయంత్రం చీకటి పడితే, దుమ్ముతో బండి లైట్ల వెలుతురుకు రోడ్డు కూడా కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. సింగరేణికి వ్యాపార దృక్పథం తప్పించి, ప్రభావిత ప్రాంతాల సమస్యలు పట్టడం లేదని, తమ ఆరోగ్య పరిస్థితిని కనీసం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఈ ప్రాంతంలోని మొక్కల నిండా ఈ బొగ్గు మసి పడి క్రమంగా అవి ఎండిపోతున్నాయి. నీరు నల్లగా మారి కలుషితమవుతోంది. చర్మ, శ్వాస కోశ వ్యాధులు వస్తుండడంతో అంబేద్కర్ నగర్ వాసులు ఆందోళన చెందుతున్నారు. అనారోగ్యంతో దాదాపు75 మంది చనిపోయారని చెబుతున్నారు. సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ ఏర్పాటు నాటి నుంచి ఇచ్చిన హామీలను ఎన్నడూ నెరవేర్చలేదని, ఎప్పటికప్పుడు వారి పబ్బం గడుపుకోవడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు బాధిత ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
స్థానికులకు పని లేకుండాపోయింది..
సింగరేణి ఓపెన్ కాస్ట్ నుంచి వచ్చే కాలుష్యాన్ని భరిస్తున్న స్థానికులకు, ఉపాధి అవకాశాలు కూడా క్రమంగా దూరమవుతున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లోని వారి నుంచి గతంలో కోల్ ట్రాన్స్ పోర్ట్ కోసం చాలా మంది లారీలు కొన్నారు. సత్తుపల్లి నుంచి కొత్తగూడెం వరకు రెగ్యులర్ గా లారీల్లో బొగ్గు ట్రాన్స్ పోర్ట్ చేసేవారు. గతేడాది సత్తుపల్లి నుంచి రైల్వే లైన్ నిర్మించడం, ఇక్కడే కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ద్వారా వ్యాగన్లలో బొగ్గు నింపుతుండడంతో కోల్ ట్రాన్స్ పోర్ట్ చేసే లారీలకు పనిలేకుండా పోయింది. ఈ రైల్వే లోడింగ్ సైలో బంకర్ ఏర్పాటు సమయంలో కూడా ఎప్పటి మాదిరిగానే దుమ్ము, ధూళి వెలువడకుండా చూస్తామని చెప్పిన మాటలు నీటి మీద రాతలు గానే మారాయంటూ గ్రామస్తులు ఆగ్రహిస్తున్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకనే రెండురోజుల క్రితం రైల్వే ట్రాక్ పై స్థానికులు ఆందోళనకు దిగారు. చర్చలతో కాలయాపన చేయకుండా,నెల రోజుల్లో ఈ కాలుష్యానికి శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఖాళీచేసి పోవాలని చెబితే ఎక్కువ మొత్తం లో పరిహారం అడుగుతామనే,పొగ, దుమ్మ తో తాము వెళ్లిపోయేలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఇప్పటికే చాలామంది చనిపోయారు..
సింగరేణి కాలుష్యంతో గ్రామంలో చాలా మందికి శ్వాసకోశ, చర్మవ్యాధులు వస్తున్నాయి. ఊపరితిత్తులు దెబ్బతిని చాలామంది చనిపోయారు. నామమాత్రపు వైద్య శిబిరాలతో సింగరేణి యాజమాన్యం చేతులు దులుపుకుంటూ ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తుంది. కాలుష్య నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలి.
– చెట్టుమాల రేణుక, సర్పంచ్, కిష్టారం
కాలుష్యంతో ఊపిరితిత్తుల సమస్యలు జఠిలం..
ఇక్కడి ప్రజల్లో శ్వాసకోశ వ్యాధులు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నాయి. దగ్గు, ఆయాసం, కళ్లే వంటి లక్షణాలతో నిత్యం ప్రజలు ఆసుపత్రికి వస్తున్నారు. వాయు కాలుష్యంతో ఇలాంటి వ్యాధులు వస్తుంటాయి. నిర్లక్ష్యం చేస్తే వ్యాధి ముదిరి, ఊపరితిత్తులు ఫెయిలయ్యే పరిస్థితికి వస్తుంది. స్వచ్ఛమైన గాలి తగ్గిపోవడమే ఇందుకు కారణం.
–డాక్టర్కొప్పుల తులసి, పల్మనాలజిస్ట్, సత్తుపల్లి
కాలుష్యం కమ్మేస్తుంది..
కిష్టారం ఓసీ దుమ్ము , సైలో బంకర్ లోడింగ్ పాయింట్ నుంచి వచ్చే ధూళి మా ఊరిని కమ్మేస్తున్నయి. గ్రామంలో చాలామంది రోగాలతో బాధపడుతున్నరు. కొందరు ఇప్పటికే చనిపోయిండ్రు. ఈ కాలుష్యాన్ని చూస్తే భయమైతుంది. ఎన్నిసార్లు చెప్పినా సార్లు, పెద్దోళ్లు(పాలకులు) వింటలేరు.
- పాలకుర్తి సుశీల, బాధితురాలు, కిష్టారం