గండిపేట్, వెలుగు: దళితుల భూములపై కన్నేసి కబ్జాలకు యత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోకాపేట వాసులు డిమాండ్ చేశారు. నార్సింగి మున్సిపల్ కోకాపేటలో దళితుల భూములను ఆక్రమిస్తున్నారని శనివారం తమ కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.
జయభేరీ కన్‌స్ట్రక్షన్స్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. కోట్ల రూపాయల విలువ చేసే భూమిని జయభేరి కన్‌స్ట్రక్షన్స్ అధినేత మురళీమోహన్ కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. తమ భూములను అప్పనంగా కాజేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రశ్నించే వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు, అధికారుల అండదండలతో తమ భూములను కబ్జా చేసిన మురళీమోహన్‌పై కేసు నమోదు చేయాలని కోరారు.