పగులుతున్న పైపులు ఆగుతున్న వాటర్​ సప్లై.. కొత్తగూడెంలో నీళ్ల గోస

  • రెండు నెలల ముందే హెచ్చరించిన కలెక్టర్
  • ఆఫీసర్ల నిర్లక్ష్యానికి తోడు పాలకుల పర్యవేక్షణ కరువు
  • పట్టణ వాసులకు తప్పని తిప్పలు
  • నల్లాలకు చేరని మిషన్​ భగీరథ నీళ్లు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు:  కొత్తగూడెం పట్టణవాసులకు నిత్యం తాగునీటి తిప్పలు తప్పడం లేదు. మిషన్ భగీరథ, కిన్నెరసాని వంటి నీళ్ల స్కీములున్నా పట్టణంలో ఒక్కోసారి నాలుగైదు రోజులు, మరోసారి వారం పదిరోజులకోసారి కూడా నల్లా నీళ్లు వస్త లేవు. నెలలో రోజు విడిచి రోజు నల్లా నీళ్లను వదలాలి. అయితే అలాంటి పరిస్థితి పట్టణంలో కనిపించడంలేదు. పాలకుల పర్యవేక్షణ లోపం, ఆఫీసర్ల నిర్లక్ష్యమే కారణం. 

వాటర్​ సోర్స్ ​ఉన్నా నల్లా తాగునీటి గోస తప్పడం లేదు. మిషన్​ భగీరథ నీళ్లు అందకపోవడంతో అరకొరగా వచ్చే సింగరేణి నీళ్లే పట్టణవాసులకు దిక్కువుతున్నాయి.  వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని రెండు నెలల కిందనే కలెక్టర్​అనుదీప్ మున్సిపల్​కమిషనర్లు, చైర్మన్లతో ప్రత్యేక మీటింగ్​పెట్టి మరీ హెచ్చరించారు. అయినా పరిస్థితిలో మార్పులేదు. కలెక్టర్​ఆదేశాలకే దిక్కులేకుండా పోయింది. 

పట్టణ వాసుల నీళ్ల గోస :

పట్టణంలో దాదాపు లక్ష జనాభా ఉంది. వారికి రోజుకు దాదాపు 10ఎంఎల్ డీ(మిలియన్​లీటర్స్​ఫర్​డే) నీటిని సప్లై చేయాల్సి ఉంది. కానీ 6 నుంచి 7 ఎంఎల్​డీ నీటినే సరఫరా చేస్తున్నారు. ఈ అంకెలు సాధారణ రోజులకు సంబంధించినవి. ఇక     వేసవిలో అయితే చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రోజు విడిచి రోజు నీటి సరఫరా చేయాల్సి ఉన్నా 15రోజులు కూడా వాటర్ సప్లై కాలేదు. జూన్ నెలలో కూడా గడిచిన రెండు వారాల్లో ఒకటి రెండు రోజులు మాత్రమే నీటి సప్లై జరిగిందని పట్టణవాసులు అంటున్నారు. దీంతో నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

సింగరేణి వాటర్​సప్లై లేకపోతే జనాలు అల్లాడి పోయేవారని పలువురు కౌన్సిలర్లే అంటున్నారు. కిన్నెరసాని వాటర్​సప్లై లేకపోవడంతో ప్రజలతోపాటు హోటల్స్​ప్యూరిఫైడ్​వాటర్​కొనుక్కొంటున్నారు. ఇక మిషన్ భగీరథ పైప్​లైన్ల లీకేజీల కారణంగా వాటర్​సప్లై చేయలేకపోతున్నామని ఆఫీసర్లు చెబుతున్నారు. దీనిపై పలువురు కౌన్సిలర్లు మండిపడుతున్నారు. ‘కిన్నెరసాని నీటి ప్రదాత’..అంటూ గొప్పలు చెప్పుకునే ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నీటి సరఫరా ఆగిపోయినా పట్టించుకోవడం లేదని పట్టణవాసులు ఫైరవుతున్నారు. 

ఇదీ అసలు సమస్య...

కొత్తగూడెం పట్టణానికి 12 కిలోమీట్లర్ల దూరంలోని కిన్నెరసాని రిజర్వాయర్​నుంచి పైపులైన్ వేశారు. పట్టణానికి సమీపంలోని రేగళ్ల తండా వద్ద ఈ కిన్నెర సాని స్కీం ప్రారంభించిన సమయంలో వేసిన పైపులే ఇప్పటికీ ఉన్నాయి. ఇవి తరుచూ పగిలిపోవడంతో పట్టణానికి నీటి సరఫరాలో సమస్య ఏర్పడుతోంది. రేగళ్లతండాతోపాటు మరో రెండు ప్రాంతాల్లో కూడా పైపులైన్​పగిలింది. వీటిని బాగు చేయడంలో ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తుండడంతో కిన్నెరసాని స్కీం వాటర్​సప్లై రాలేకపోతోంది. దీంతో పట్టణవాసులు కేవలం సింగరేణి వాటర్​మీదే ఆధారపడుతున్నారు.