- నిజామాబాద్ నుంచి 2,478 మంది గల్ఫ్ బాట
- లోక్ సభలో వెల్లడించిన కేంద్రం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నుంచే ఎక్కువ మంది ఉద్యోగాల కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ వెల్లడించారు. గురువారం లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. నిజామాబాద్ నుంచి 2,478 మంది ఇమిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వైర్డ్(ఈసీఆర్)స్టాంప్ తో ఉద్యోగాల కోసం గల్ఫ్ కు వెళ్లారని మురళీధరన్ తెలిపారు. అతి తక్కువగా జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల నుంచి ముగ్గురు చొప్పున ఉన్నారని తెలిపారు.
ఈ ఏడాది అక్టోబర్ చివరినాటికి రాష్ట్రం నుంచి ఈసీఆర్ దేశాలకు వెళ్లిన వారి సంఖ్య 9576 కు పెరిగిందన్నారు. 2021లో 4, 375 మంది గల్ఫ్ దేశాలకు వెళ్లారని గుర్తుచేశారు. వీరంతా ఈమైగ్రేట్ పోర్టల్‌లో తమ పేరు నమోదు చేసుకొని బహ్రెయిన్, ఇరాక్, జోర్డన్, కువైట్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లో ఉద్యోగం కోసం పోయినట్లు మరళీధరన్ పేర్కొన్నారు.