కాలుష్య కంపెనీపై చర్యలు తీసుకోవాలి

కాలుష్య కంపెనీపై చర్యలు తీసుకోవాలి
  • కలెక్టరేట్​ వద్ద రంగాయిపల్లి వాసుల ఆందోళన

మెదక్, వెలుగు : కాలుష్యాన్ని వెదజల్లుతున్న కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మనోహరాబాద్ మండలం రంగాయిపల్లి గ్రామస్తులు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు.  గ్రామంలో ఉన్న కంపెనీని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ  సందర్భంగా రంగాయిపల్లి గ్రామస్తులు మాట్లాడుతూ..  తమ గ్రామంలో దాదాపు 5  వేల జనాభా ఉందని, కంపెనీ గ్రామానికి ఆనుకుని ఉండటంతోవల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయన్నారు.  

ఇల్లు కూలిపోవడటం, బోరు మోటార్లు చెడిపోవటం, చిన్నారులకు, మహిళలకు విషజ్వరాలు, దద్దుర్లు, మోకాళ్ల నొప్పులు తదితర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  గ్రామంలో 2013లో కంపెనీ ఏర్పాటు చేసే సమయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కోరినప్పటికీ ఎవరూ స్పందించడం లేదని ఆరోపించారు.  జింక్ ప్లాంట్ వల్ల వ్యవసాయ భూముల్లో పంటలు పండక నాలుగైదు సంవత్సరాలు అవుతుందన్నారు.  

రాత్రి వేళ కంపెనీ నుంచి వెలువడుతున్న భారీ శబ్దాలతో భూకంపాలు వచ్చినట్లు అనిపిస్తున్నాయన్నారు.  200 టన్నుల సామర్థ్యం కంపెనీ వల్ల గ్రామానికి తీవ్ర నష్టం కలుగుతోందన్నారు.  జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఎన్నో సార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ పట్టించుకోవడంలేదన్నారు.చందు గౌడ్, వెంకటేశ్,  ప్రసాద్, మహేశ్ , శివలక్ష్మి, శ్యామల,  నర్సవ్వ, ఎల్లవ్వ పాల్గొన్నారు.