ఎల్లంపల్లి భూనిర్వాసితులకు ఇంకా అందని పరిహారం 

  • చెగ్యాం గ్రామంలో పరిహారం కోసం 126 ఫ్యామిలీల ఎదురుచూపు
  • పదేళ్లు సర్వేల పేరుతో బీఆర్ఎస్ సర్కార్ కాలయాపన
  •  వరదలొస్తే భూనిర్వాసితుల ఇండ్లు మునుగుతున్నాయి
  • పరిహారం ఇస్తే ఇండ్లు కట్టుకుంటామంటున్న నిర్వాసితులు 

జగిత్యాల, వెలుగు: ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితుల్లో కొందరికి ఇంకా పరిహారం అందలేదు. కొన్ని గ్రామాలకు అందగా మరికొందరు నిర్వాసితులు నేటికీ ఎదురుచూస్తున్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్​ మండలంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో మునుగుతున్న నాలుగు గ్రామాలను గుర్తించారు. వీటిలో వ్యవసాయ భూములకు, నిర్మాణాలకు పరిహారం అందగా చెగ్యాం గ్రామంలోని సుమారు 62.05 ఎకరాలకు, 126 ఇండ్లకు అందాల్సి ఉంది. పరిహారం అందకపోవడంతో శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఉండలేక నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నారు. వరదలొస్తే ఇండ్ల చుట్టూ నీళ్లు చేరుతున్నాయని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పరిహారం చెల్లింపులో గత సర్కార్​ నిర్లక్ష్యం 

బీఆర్ఎస్ సర్కార్ పరిహారం ఇవ్వకుండా శాశ్వత పునరావాసం ఏర్పాటు చేయకపోవడంతో తమ బతుకులు అధ్వానంగా మారాయని ముంపు గ్రామస్తులు వాపోతున్నారు. బీఆర్ఎస్ సర్కార్ నిధులు మంజూరు చేయకపోగా ఇన్నాళ్లూ సర్వేల పేరుతో నెట్టుకొచ్చింది. ప్రతి ఏటా వర్షాకాలంలో సర్కార్ బడిలో తలదాచుకోవడం, ఎవరైనా ఆహార పోట్లాలు ఇస్తే తింటూ కాలం వెళ్లదీస్తున్నామని నిర్వాసితులు చెబుతున్నారు. 2007 నుంచి పరిహారం కోసం ఎదురుచూస్తూ కనిపించిన లీడర్ల కాళ్లావేళ్ల పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

చెగ్యాంలో రూ.28.75కోట్లు పరిహారం పెండింగ్​

శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం 2007లో బ్యాక్ వాటర్ ప్రభావిత ప్రాంతాలను సర్కార్​ గుర్తించింది. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటి లింగాల, మొక్కట్రావ్ పేట్, రాం నూర్, చెగ్యాం, తాళ్ల కొత్తపేట్‌‌‌‌‌‌‌‌ గ్రామాల్లో భూసేకరణ చేయాలని నిర్ణయించారు. వీటిలో అన్ని గ్రామాల్లో పరిహారం చెల్లింపులు పూర్తిచేశారు. ఒక్క చెగ్యాం గ్రామంలోనే పరిహారం పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉంది. ఈ గ్రామంలో 62.05 ఎకరాలతోపాటు 933 నిర్మాణాలు సేకరించాలని ఆఫీసర్లు గుర్తించారు.

ఇందులో 798 నిర్మాణాలకు రూ. 75.45కోట్లు అందజేశారు. కాగా సర్వేలో కొందరు స్థానిక లీడర్లు ఆఫీసర్లను ప్రలోభాలకు గురిచేయడంతో పరిహారం నిర్ధారణ విషయంలో అవకతవకలు  జరిగాయనే ఆరోపణలున్నాయి. దీంతో 126 కుటుంబాలు పరిహారం తీసుకోకుండా మరోసారి సర్వే చేయాలని డిమాండ్​ చేశారు.  గత సర్కార్​హయాంలోనే  సర్వే రిపోర్ట్​ ఉన్నతాధికారులకు చేరింది. అయినప్పటికీ పరిహారం మంజూరులో బీఆర్ఎస్​ సర్కార్​ నిర్లక్ష్యం వహించదన్న వాదనలున్నాయి. ఈ 126 నిర్మాణాలకు సంబంధించి రూ.28.75 కోట్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నట్లు తెలుస్తోంది. 

నాటి  సర్కార్ పట్టించుకోలే

వరదలు వస్తే మా ఇల్లు మునిగిపోతుంది. వరద ధాటికి గోడలు బీటలు వచ్చి కూలిపోతున్నాయి. మా పరిహారం మాకు ఇస్తే ఇల్లు కట్టుకుని బతుకుతాం. వరదలు వస్తే పాత బడికి పంపిస్తున్నారు.  బీఆర్ఎస్ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రజా ప్రతి నిధులకు, ఆఫీసర్లకు 
ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.

 రాజమ్మ, బాదితురాలు 

బ్యాక్ వాటర్ వస్తే మునుగుతున్నాయి

పదేళ్లు గా పరిహారం కోసం ఎదురు చూస్తున్నాం.  బ్యాక్ వాటర్ వస్తే ఇళ్లు నీటమునగిపోవడంతో ప్రతి ఏటా ఏదోచోట ఉంటూ కాలం వెల్లదీస్తున్నాం. మిగిలిన గ్రామాలకు పరిహారం అందించిన సర్కార్ మా గ్రామానికి ఇవ్వలేదు. పరిహారం ఇవ్వకపోవడం తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కాంగ్రెస్ సర్కార్ ఆదుకుని పరిహారం అందజేస్తే ఇల్లు నిర్మించకుంటాం. 

రాజేశం, ముంపు బాధితుడు