- బీఆర్ఎస్కు 8 మంది కౌన్సిలర్ల రాజీనామా
- కాంగ్రెస్ పార్టీతో కలిసి చైర్మన్ ఎన్నికకు సిద్ధం
వనపర్తి, వెలుగు : వనపర్తి మున్సిపాలిటీలో కొత్త చైర్మన్ ఎన్నిక జిల్లా రాజకీయాలను వేడెక్కించింది. మున్సిపాలిటీలో 33 మంది కౌన్సిలర్లకు గాను, 23 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ల మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి సముదాయించి ఇద్దరితో రాజీనామా చేయించి ఎమ్మెల్సీ క్యాంప్‌నకు తీసుకెళ్లారు. తీరా శనివారం బీఆర్ఎస్కు చెందిన 8 మంది కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వెంటనే వారితో సంప్రదింపులు జరిపినా అవి ఫలించలేదు. తమకు నిరంజన్‌రెడ్డి ఏమీ చేయలేదని
ఇప్పుడూ చేస్తారన్న నమ్మకం లేదంటూ వారు చెప్తున్నట్లు తెలిసింది. వీరి రాజీనామాతో బీఆర్ఎస్ కౌన్సిలర్ల సంఖ్య 15కు పడిపోయింది. కాంగ్రెస్‌పార్టీలో (కాంగ్రెస్+టీడీపీ+బీజేపీ) 10 మంది ఉన్నారు. తాజాగా రాజీనామా చేసిన వారిలో చైర్మన్ పదవిని ఆశిస్తున్న పుట్టపాకుల మహేశ్ కూడా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం చైర్మన్, వైస్ చైర్మన్లతో రాజీనామా చేయించిన మాజీ మంత్రి, చైర్మన్, వైస్ చైర్మన్లుగా తన అనుచరులు ఎన్నికయ్యేలా చూడాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.
చైర్మన్ అభ్యర్థి పీటముడితోనేనా?
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు చైర్మన్ స్థానాన్ని ఆశిస్తున్న సభ్యుడితో పాటు కొందరు కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నారన్న విషయమై మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసి, ఫలానా వ్యక్తి కాకుండా వేరే ఎవరినైనా చైర్మన్ చేసుకోండని చెప్పారని, అప్పటికే చైర్మన్ అభ్యర్థి కొందరు సభ్యులతో ఒప్పందం చేసుకున్నారు. తన అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం వచ్చేలా చూసుకున్న తరుణంలో మాజీ మంత్రి మాటలు నొప్పించాయి. అంతేకాకుండా సభ్యులు కూడా మొదటి నుంచి అతనికే
మద్దతు ఇస్తూ వస్తున్నామని, ఇప్పుడు మధ్యలో మాటమార్చబోమంటూ స్పష్టం చేశారు. చివరకు చైర్మన్, వైస్ చైర్మన్ల రాజీనామా తరువాత ఎమ్మెల్సీ క్యాంప్ నేపథ్యంలో మెజారిటీ సభ్యులు ఎవరనుకుంటే వారినే చైర్మన్‌గా ఎన్నుకోవాలని మాజీ మంత్రి చెప్పినా 8 మంది పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో కొత్త చైర్మన్ ఎన్నిక..
చైర్మన్, వైస్ చైర్మన్లు రాజీనామా చేయడంతో వచ్చే నెలమొదటి వారంలో కొత్త చైర్మన్ ఎన్నిక జరగనున్నట్లు తెలుస్తోంది. అందుకు జిల్లా అధికారులు ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకున్నట్లు సమాచారం. 8 మంది కౌన్సిలర్లు శుక్రవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిని కలిసిన మరుసటి రోజే పార్టీకి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ షరతులను లోబడే రాజీనామాలు చేశారని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.
చైర్మన్‌గా పుట్టపాకుల మహేశ్‌కు 10 మంది కౌన్సిలర్లు మద్దతిస్తారని, చైర్మన్ కాంగ్రెస్‌కే ఇవ్వాలన్న షరతు మేరకు పార్టీలో చేరడానికి అంగీకరించినట్లు చెబుతున్నారు. ఇందులోభాగంగానే బీఆర్ఎస్కు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఓటుతో కలిపి తమకు 19 మంది సభ్యుల మద్దతు ఉందని, చైర్మన్ ఎన్నిక ఇక లాంఛనమేనని, బీఆర్ఎస్ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేదని అంటున్నారు.