ఈటల బాటలోనే..  అనుచరుల రాజీనామా

కరీంనగర్, వెలుగు: ఈటల రాజేందర్ వెంటే తాము ఉంటామని కింది స్థాయి క్యాడర్ అంటున్నారు. శుక్రవారం ఈటల టీఆర్ఎస్​కు రాజీనామా చేయడంతో ఆయన అనుచరులు పలువురు పార్టీకి రాజీనామా చేశారు. ఉమ్మడి కరీంనగర్ మాజీ జడ్పీ చైర్​పర్సన్​తుల ఉమ, గతంలో కరీంనగర్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన టీఆర్ఎస్ నాయకురాలు గండ్ర నళిని పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు మంద నగేశ్, జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న కోటి, ఇల్లందకుంట ఎంపీపీ పావని సైతం రాజీనామా చేసి ఈటల వెంటే ఉంటామని చెప్పారు. వీరితో  పాటు హుజురాబాద్  పార్టీ మండలాధ్యక్షుడు కొమురారెడ్డి సైతం ఈటల వెంటే నడుస్తున్నారు. 
రాజీనామా బాటలో మరికొందరు..
ఈట‍ల రాజేందర్ రాజీనామా తరువాత నియోజకవర్గ రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈటల ఇంటికి శుక్రవారం నియోజకవర్గం నుంచి సుమారుగా 100 వెహికల్స్​లో తరలివెళ్లారు. ఇన్ని రోజులు నయానో భయానో టీఆర్ఎస్ నాయకుల వెంట ఉంటామని చెప్పినా.. ఈటల రాజేందర్ రాజీనామా చేయడం..  పార్టీ మారతారనే స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ఆయన అభిమానుల్లోనూ ఉత్సాహం వచ్చింది. ఇప్పటికే కొంతమంది రాజీనామా  చేయగా.. ఇదే బాటలో ప్రతి గ్రామం నుంచి కూడా ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కొంతమంది మాత్రం పార్టీ మారుతున్న ఈటల వైపు వెళ్లాలా.. లేక టీఆర్ఎస్ పార్టీ వైపే ఉండాలా అనే డైలామాలో కూడా ఉన్నారు. మరోవైపు హుజురాబాద్ కు చెందిన బీజేపీ నాయకులు సైతం ఈటల పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నారు. దీంతో పార్టీ నియోజకవర్గంలో మరింత బలోపేతం అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 
రంగంలోకి టీఆర్ఎస్ నేతలు 
ఈటల పార్టీకి రాజీనామా చేశారో లేదో.. హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారు. ఎలాగైనా  క్యాడర్ ను తమవైపు తిప్పుకోవడానికి ప్లాన్లు వేస్తున్నారు. జమ్మికుంట, హుజురాబాద్ లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మీటింగ్ పెట్టి కార్యకర్తలకు డైరెక్షన్స్ ఇచ్చారు. దీంతోపాటు ఇల్లందకుంట, జమ్మికుంట మండలాల ఇన్ చార్జి జీవీ రామకృష్ణ కరీంనగర్ లోని ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేశారు. రెండు రోజుల్లో హుజురాబాద్ నియోజకవర్గం ముఖ్యనాయకులతో  కరీంనగర్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి మీటింగ్ పెట్టనున్నట్లు సమాచారం. ఆ తర్వాత మండలాలు.. గ్రామాలవారీగా మీటింగ్ లు పెట్టి సమీక్ష చేయనున్నారు. ఇదంతా పూర్తిగా ట్రబుల్ షూటర్ హరీశ్​రావు డైరెక్షన్ లో కొనసాగుతుంది. శుక్రవారం నగరంలోని ఓ హోటల్ లో జరిగిన పెళ్లికి ఆయన హాజరయ్యారు. మంత్రి గంగులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యంగా హుజురాబాద్ నియోజకవర్గం మీదనే చర్చించినట్లు తెలుస్తుంది.  జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులతో  హైదరాబాద్ లో  అధిష్టానం మీటింగ్ పెట్టనుంది. మొత్తం మీద హుజురాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ పాగా వేయడానికి.. ఈటలను ఓడించడానికి ఎత్తుకు పైఎత్తులు మొదలయ్యాయి.