చౌటుప్పల్/ మునుగోడు, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో వచ్చే తీర్పుపైనే రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉందని, ఓటర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కుటుంబ పాలనకు, దోపిడీకి వ్యతిరేకంగా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు సాకారం కావాలంటే కేసీఆర్ కుటుంబ పాలన పోవాలని, టీఆర్ఎస్ పార్టీ గద్దె దిగాలని అన్నారు.
‘‘రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు జేసిండు. విచ్చలవిడిగా వైన్ షాపులు, బెల్టు షాపులను నడిపిస్తూ ప్రజలను లిక్కర్‌కు బానిసలుగా మార్చిండు. ప్రజలు తాగితే వచ్చే సొమ్ముతో పింఛన్లు, రైతుబంధు ఇస్తున్నడు” అని విమర్శించారు. ఆదివారం చౌటుప్పల్, నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. చౌటుప్పుల్ మండలంలో కైతాపురం, కొయ్యలగూడెం, మందోల్ల గూడెం, తూర్పుగూడెం, సింగరాయి చెరువు, కుంట్ల గూడెం, అంకిరెడ్డి గూడెం గ్రామాల్లో సుమారు 400 మంది బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. చేనేత కార్మికులు, నిరుద్యోగులు, వివిధ సంఘాల నాయకులు స్వచ్ఛందంగా బీజేపీలో చేరుతున్నారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ద్వారా తెలంగాణలో మలి యుద్ధం మొదలైందని పేర్కొన్నారు.
ఎంతోమంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణ కొందరి చేతిలో బందీ అయిందని, ఎనిమిడేండ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ఏ వర్గానికి కూడా న్యాయం జరగలేదని అన్నారు. పచ్చని గ్రామాల్లో బెల్ట్ షాపులను కేసీఆర్ పెంచి పోషిస్తున్నారని, ఎన్నో కుటుంబాల ఉసురుపోసుకుంటున్నారని, అలా వచ్చిన సొమ్ముతోనే పెన్షన్లు, రైతు బంధు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘ప్రాజెక్టులన్నీ ఆంధ్రా కాంట్రాక్టర్లకు కట్టబెట్టి, కమీషన్లు తీసుకొని ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండు.
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా సక్రమంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కేవలం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ లో మాత్రమే అభివృద్ధి జరుగుతున్నది. ఇతర నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదు” అని కేసీఆర్‌పై రాజగోపాల్ ఫైర్ అయ్యారు. రాజగోపాల్‌రెడ్డి వెంట జడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, ఉప్పు భద్రయ్య, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమణగొని శంకర్, పబ్బురాజు గౌడ్, భిక్షం, మొగదల రమేష్ , వెంకటయ్య, వెంకటేష్ ఉన్నారు.
పలువురికి ఆర్థిక సాయం
చౌటుప్పల్ మండలం కైతాపురం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ శ్రీశైలం రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోవడంతో ఆయనను కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పరామర్శించి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. శ్రీశైలం కూతురు చదువుకు మరో లక్ష రూపాయలు ఇచ్చి కుటుంబానికి అండగా ఉంటానన్నారు. కొయ్యలగూడెం గ్రామంలో కుడికాల పాండు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా.. ఆయనను రాజగోపాల్‌రెడ్డే హాస్పిటల్లో చేర్పించి సుమారు రూ.5 లక్షలతో ట్రీట్మెంట్చేయించారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన పాండును ఇంటి వద్ద ఆదివారం రాజగోపాల్ పరామర్శించారు.
మునుగోడులో బతుకమ్మ సంబురాలు
నల్గొండ జిల్లా మునుగోడులో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం ఎంగిలిపువ్వు బతుకమ్మ సంబురాలు జరిగాయి. సాయంత్రం 5 గంటలకు మునుగోడు చౌరస్తా నుంచి బతుకమ్మలతో చండూరు రోడ్డులో ఉన్న రాజగోపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయం వరకు మహిళలు ర్యాలీగా వెళ్లారు. దీంతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొన్నది. చిన్నా పెద్దా బతుకమ్మ ఆడారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మునుగోడు ఉప ఎన్నిక ఇన్‌చార్జి వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నేతలు శ్రీనివాస్ రెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, పాలకూరి యాదయ్య, మాధగోని రాజేశ్ గౌడ్, ప్రమోద్ రెడ్డి, పాల్వాయి జితేందర్ రెడ్డి, మునుగోడు సాయి, సురేశ్ పాల్గొన్నారు.