కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలోని రెవెన్యూ జిల్లాలు, జోన్ల పరిధిని మారుస్తూ 2018లో కొత్తగా రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయి. పేరాలు 3, 6, 8ల్లో మండల పరిషత్, జిల్లా పరిషత్, ప్రభుత్వ బడుల్లో పనిచేసే ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీగ్రేడ్ టీచర్ల పోస్టులను వర్గీకరించారు. అయితే ఇందులో నాన్ గెజిటెడ్ పోస్టులైన స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడు టీచర్ల పోస్టులను ప్రత్యేక ఏకీకృత కేడర్‌గా గుర్తించారు. ఈ అంశంపై 2018 ఆగస్టులో హైకోర్టు తీర్పునిస్తూ ఆర్టికల్ 371(డి) ప్రకారం జిల్లా పరిషత్, మండల పరిషత్ టీచర్ పోస్టులను లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేయడానికి రాష్ట్రపతికి అధికారం ఉందికానీ, సర్వీసులను ఏకీకృతం చేసే అధికారం లేదని, టీచర్లను ఏకీకృతం చేసే పేరాలను కొట్టేసింది. షార్ట్ కట్లో పనిపూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడానికి బదులు మండల పరిషత్, జిల్లా పరిషత్ స్కూళ్లలోని టీచర్ పోస్టులను మాత్రమే లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేయడానికి రాష్ట్రపతి అనుమతి పొంది ఆ తర్వాత ఆర్టికల్ 309 ప్రకారం సర్వీసు నిబంధనలను జారీ చేస్తూ ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్ టీచర్ల సేవలను ఏకీకృతం చేయవచ్చని సూచించింది.
ఉమ్మడి సర్వీసుల నేపథ్యం ఇదీ
1981లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 168 ద్వారా పంచాయతీ రాజ్ శాఖలో పనిచేసే ఇతర ఉద్యోగులతోపాటు టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రావిన్షియలైజేషన్ చేసింది. తర్వాత ప్రభుత్వ, జిల్లా పరిషత్ బడుల్లో పనిచేస్తున్న టీచర్ల సర్వీసులను ఏకీకృతం చేస్తూ 1992లో జీవో 40 ఇచ్చింది. కోర్టులో సవాల్ చేసినందున సాంకేతిక కారణాల దృష్ట్యా ప్రభుత్వం ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకున్నది. 1998లో 505, 535 జీవోల ద్వారా ఏకీకృత సర్వీస్ రూల్స్‌ను మళ్లీ జారీ చేసింది. 1975లో జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ టీచర్లు లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేయబడ్డారు. అయితే వీరిని, లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేయబడని జిల్లా పరిషత్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లకు ఒకే సర్వీసు నిబంధనల పరిధిలోకి తేవడం రాష్ట్రపతి ఉత్తర్వులకు భిన్నమని 505, 538 జీవోలను హైకోర్టు కొట్టేసింది. దీంతో జిల్లా పరిషత్, మండల పరిషత్ స్కూల్ టీచర్ల సర్వీసులను లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు జారీ చేసేందుకు ప్రభుత్వం రాష్ట్రపతి అనుమతి పొందలేదని, ఇది రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమంటూ 2006లో జారీ చేసిన 95,96 జీవోలను హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పులపై అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. 2015లో సుప్రీంకోర్టు తీర్పును ప్రకటిస్తూ.. ‘‘పంచాయతీ సమితి, జిల్లా పరిషత్‌ల అధీనంలోని నియామకాలు రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 8వ పేరా ప్రకారం జరుపుతున్న కారణంగా ఇప్పటికే లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేయబడిన టీచర్లతో పంచాయతీ సమితి, జిల్లా పరిషత్ టీచర్లు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులైనందున లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేయడానికి రాష్ట్రపతి ఆమోదం పొంది ప్రతిపాదనలు పంపడానికి రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛ కలిగి ఉంది. ఇలాంటి ప్రతిపాదనలు వస్తే కేంద్రం వాటిని పరిగణనలోకి తీసుకోవాలి’’ అని స్పష్టంచేసింది. ఈ ఆదేశాల ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పంచాయతీరాజ్, ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేసే టీచర్ల సర్వీసులను ఏకీకృతం చేయడానికి ప్రతిపాదనలు పంపగా 2017లో జీఎస్ఆర్ 687(ఇ), 639(ఇ) ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేశారు. అయితే ఈ ఉత్తర్వుల్లో లోకల్ కేడర్‌గా గుర్తించడానికి బదులుగా ఏకీకృతం చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టి ఆ సవరణలను కొట్టేసింది.
పరిష్కారం ఏమిటి?
కోర్టులు వివిధ సందర్భాల్లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం సుప్రీంకోర్టు అనుమతి పొంది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జిల్లా పరిషత్, మండల పరిషత్ టీచర్లను లోకల్ కేడర్‌గా ప్రకటించటానికి చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాత ఆర్టికల్ 309 ప్రకారం టీచర్ల సర్వీసు నిబంధనలను రూపొందించినప్పుడు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉపాధ్యాయుల సర్వీసులను ఏకీకృతం చేయాలి. అప్పుడే మూడు దశాబ్దాల వివాదం కొలిక్కి వస్తుంది. విద్యాశాఖలో టీచర్ పోస్టులతోపాటు పర్యవేక్షణాధికారుల పోస్టులు భర్తీ చేస్తే స్కూల్ ఎడ్యుకేషన్ గాడిన పడుతుంది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున హైకోర్టు తీర్పులోని అంశాల ఆధారంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరిస్తూ, జిల్లా పరిషత్, మండల పరిషత్ టీచర్ల సర్వీసులను లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేయటానికి సుప్రీంకోర్టు అనుమతి తీసుకోవాలి. అప్పుడు కొత్తగా టీచర్ పోస్టులను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. పైగా 2018 ఆగస్ట్‌లో ఇచ్చిన జీవో 124 ప్రకారం కొత్తగా రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో పాత కేడర్లు రద్దవుతాయి. కొత్తగా కేడర్లను వర్గీకరించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. జీవో 124 జారీ చేసిన నాటి నుంచి 36 నెలల లోగా కొత్త కేడర్లను వర్గీకరించుకునే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే టీచర్ల కేడర్ల సమస్య పరిష్కారమై ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అవకాశం దక్కుతుంది.