నాలా, లేఅవుట్​ లేకుండానే.. రిసార్ట్స్​ దందా

  • రోడ్లేసి విల్లాలు, స్విమ్మింగ్​ పూల్స్​ కడుతున్నా పట్టించుకోని ఆఫీసర్లు
  • లక్కీ డ్రాలు, రూ.లక్షల్లో ఆఫర్లంటూ కస్టమర్లను బోల్తా కొట్టిస్తున్న వైనం
  • 20 గుంటల లోపు రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఆదేశాలున్నా డోంట్​ కేర్
  • పట్టాదారు పాస్​బుక్, రైతుబంధు, రైతుబీమా వస్తుందని ప్రచారం
  • ఆదాయానికి గండి.. నోటీసులతో సరిపెడుతున్న ఆఫీసర్లు

మంచిర్యాల, వెలుగు: ఇప్పటివరకు హైదరాబాద్ ​చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైన రిసార్ట్స్ దందా మంచిర్యాలకు పాకింది. జిల్లా కేంద్రానికి దగ్గరలోని జైపూర్, భీమారం, మందమర్రి, హాజీపూర్, లక్సెట్టిపేట మండలాల్లో ఈ బిజినెస్ జోరుగా సాగుతోంది. సాగు భూముల్లో రిసార్ట్స్, ఫంక్షన్​హాళ్లు, హోటళ్లు, స్విమ్మింగ్​పూల్స్​ కడుతున్నారు. నాలా కన్వర్షన్, లేఅవుట్​ పర్మిషన్లు లేకుండానే వందల ఎకరాల్లో రియల్​వెంచర్లు వేస్తున్నారు. టీవీ యాంకర్లను తీసుకొచ్చి ఆర్భాటంగా లాంచింగ్, లక్కీ డ్రాలు, రూ.లక్షల్లో ఆఫర్లు అంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. వీటికి అన్ని పర్మిషన్లు ఉన్నాయంటూ బోల్తా కొట్టిస్తున్నారు. ఇదంతా ఓపెన్​గానే జరుగుతున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు.  ఫిర్యాదులు వస్తే నామమాత్రంగా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు.

వెంకటాపూర్​లో 40 ఎకరాల్లో

మందమర్రి మండలం వెంకటాపూర్ ​గ్రామ శివారు137, 138, 232, 233 సర్వే నంబర్లలోని సుమారు 40 ఎకరాల్లో గ్రీన్​పార్క్​ రిసార్ట్స్​ పేరిట భారీ వెంచర్​ వెలిసింది. నాలా, లేఅవుట్​ పర్మిషన్లు లేకుండానే బ్లాక్​టాప్​రోడ్లు వేసి అర్చీ ఏర్పాటు చేశారు. స్విమ్మింగ్​పూల్, మోడల్​ విల్లా నిర్మించారు. ఈ నెల 7న ఓ టీవీ యాంకర్​ను తీసుకొచ్చి ఆర్భాటంగా లాంచింగ్​ చేశారు. 

రెండు నుంచి ఐదు గుంటల చొప్పున ప్లాట్లు చేసి గజం రూ.4 వేల చొప్పున అమ్ముతున్నారు. ఇందులో 35 ఎకరాల్లో ప్లాట్లు చేస్తుండగా, మరో ఐదెకరాల్లో భారీ హంగులతో రిసార్ట్స్ ఏర్పాటు చేస్తామని ప్రచారం చేస్తున్నారు. ప్లాట్లలో శ్రీగంధం చెట్ల పెంపకం ద్వారా 15 ఏండ్లలో కోటీశ్వరులు అవుతారంటూ ఆశలు రేపుతున్నారు. లేదంటే రూ.80 లక్షలతో ఐదు గుంటల్లో విల్లాలు నిర్మించి నెలనెలా కిరాయిలు చెల్లిస్తామంటున్నారు. రికార్డుల్లో వ్యవసాయ భూమిగా ఉండడంతో పట్టా పాస్​బుక్, రైతుబంధు, రైతు బీమా వస్తుందని పేర్కొంటున్నారు.  

లక్కీ డ్రాలు, భారీ ఆఫర్లతో వల

రియల్టర్లు తమ బిజినెస్​ పెంచుకునేందుకు రూల్స్​కు విరుద్ధంగా లక్కీ డ్రాలు, భారీ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. లక్కీ డ్రా విజేతల్లో ఫస్ట్​ ప్రైజ్ కింద​రూ.40 లక్షల విలువైన విల్లా, సెకండ్​ ప్రైజ్​రూ.10 లక్షల కారు, మూడో బహుమతి 300 గజాల ప్లాట్, నాలుగో బహుమతి 150 గజాల ప్లాట్, ఐదో బహుమతికి 5 తులాల బంగారం అంటూ ఆఫర్లు ప్రకటించడం గమనార్హం. ఇలా ఎలాంటి అనుమతులు లేకుండా రూ.కోట్లలో దందా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతున్నారు. అయినా అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

నోటీసులు జారీ చేశాం

వెంకటాపూర్​ శివారులోని 40 ఎకరాల్లో గ్రీన్​పార్క్​ రిసార్ట్స్​ పేరిట ఏర్పాటు చేసిన వెంచర్​కు ఎలాంటి అనుమతులు లేవు. డీటీసీపీ లేఅవుట్​ పర్మిషన్​ తీసుకున్నాకే పనులు చేపట్టాలని గతంలోనే నోటీసులు జారీ చేశాం. ఈ విషయాన్ని పై ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.  
- ప్రశాంత్​, పంచాయతీ సెక్రటరీ, వెంకటాపూర్​

రిజిస్ట్రేషన్లు చేయట్లే

20 గుంటల లోపు వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్లు చేయరాదని ఆదేశాలున్నాయి. ఎవరైనా పేదలు తమ అవసరాల కోసం భూములు అమ్ముకుంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధరణ చేసుకున్నాకే రిజిస్ర్టేషన్ చేస్తున్నాం. 
- చంద్రశేఖర్, తహసీల్దార్, మందమర్రి