ముంబై: చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నమెంట్ (సీఎల్‌టీ20) మళ్లీ తెరపైకి వచ్చింది. వివిధ దేశాలకు చెందిన ఫ్రాంచైజీ లీగ్ టీమ్స్ బరిలో నిలిచి 2009 నుంచి 2014 వరకు జరిగిన ఈ లీగ్‌ను పదేండ్ల తర్వాత రీస్టార్ట్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందుకోసం ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాల క్రికెట్ బోర్డుల మధ్య క్రియాశీల చర్చలు జరుగుతున్నాయి. చివరగా 2014లో జరిగిన సీఎల్‌టీ20 టోర్నీలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిచింది.
ఆ టోర్నీలో ఇండియా నుంచి మూడు టీమ్స్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా నుంచి రెండేసి జట్లు, పాకిస్తాన్, వెస్టిండీస్, న్యూజిలాండ్ నుంచి ఒక్కో జట్టు పోటీపడ్డాయి. మొత్తం ఆరు ఎడిషన్లలో నాలుగు ఇండియాలో జరగ్గా, రెండింటిని సౌతాఫ్రికాలో నిర్వహించారు. పదేండ్ల గ్యాప్ తర్వాత ఈ టోర్నీని పునరుద్ధరించడానికి ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మూడు పెద్ద బోర్డులు ప్రయత్నాలు చేస్తున్నాయని క్రికెట్ విక్టోరియా సీఈవో నిక్ కమిన్స్ తెలిపారు. ప్రస్తుత బిజీ క్రికెట్ క్యాలెండర్‌లో ఈ టోర్నీ కోసం విండోను (సమయం) కనుగొనడమే అతి పెద్ద సవాల్ అవుతుందన్నారు.