రెస్టారెంట్ కి వెళ్తే బిల్ తో పాటు జీఎస్టీ అని, సర్వీస్ చార్జెస్ అని అదనంగా వసూలు చేస్తుంటారు. అయితే.. బిల్ మీద జీఎస్టీ వసూలు చేసినప్పుడు సర్వీస్ ట్యాక్స్ వంటి అదనపు చార్జీలు వసూలు చేయటం ఇల్లీగల్. ఈ విషయం మనలో చాలామందికి తెలీక రెస్టారెంట్ వాడు వేసిన అదనపు చార్జీలను నోరెత్తకుండా సమర్పించుకొని వస్తుంటాం. అయితే.. హైదరాబాద్ లో ఓ కస్టమర్ సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తున్న రెస్టారెంట్ కి షాక్ ఇచ్చాడు. అదనంగా వసూలు చేసిన సర్వీస్ ట్యాక్స్ కి బదులుగా రెస్టారెంట్ నుండి కన్స్యూమర్ కోర్టులో కేసు వేసి మరీ.. ఏడాది తర్వాత రూ.4వేలు వసూలు చేశాడు ఓ కస్టమర్.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఉన్న చిగురు రెస్టారెంట్ కి వెళ్లిన ఓ కస్టమర్ కి బిల్ మీద జీఎస్టీతో పాటు.. రూ. 247 సర్వీస్ ట్యాక్స్ కూడా వేశారు.సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయటం ఇల్లీగల్ అని.. తనకు చార్జ్ చేసిన మొత్తాన్ని రిఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు సదరు కస్టమర్. రీఫండ్ ఇచ్చేందుకు రెస్టారెంట్ నిరాకరించింది.. దీంతో లీగల్ నోటీసులు పంపాడు కస్టమర్. లీగల్ నోటిసులతో వెనక్కు తగ్గిన రెస్టారెంట్ అతనికి రీఫండ్ చెల్లించింది.
Also Read:-ఏపీకి ముంచుకొస్తున్న తుఫాన్ గండం
ఇక మీదట సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయటం ఆపేస్తారా అని కస్టమర్ అడుగగా.. ఆపమంటూ బదులిచ్చారు రెస్టారెంట్ సిబ్బంది. రెస్టారెంట్ సిబ్బంది సమాధానంతో అవమానంగా ఫీలైన కస్టమర్ కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించాడు. రెస్టారెంట్ నుండి రూ. 1లక్ష నష్టపరిహారం డిమాండ్ చేస్తూ అక్టోబర్ 28, 2023 నాడు కేసు వేశాడు. ఎట్టకేలకు ఏడాది తర్వాత ఈ కేసుపై తీర్పు వెల్లడించింది కన్స్యూమర్ కోర్టు. కస్టమర్ కి జరిగిన అవమానానికి గాను.. రూ. 3వేలు, అదనపు చార్జీల కోసం వెయ్యి రూపాయలు చెల్లించాలని ఆదేశాలిచ్చింది కోర్టు.