పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిసరాల్లో ఆంక్షలు అమలు

  • 16న సీఎం పర్యటన నేపథ్యంలో  మీడియా, ప్రతిపక్షాలకు నో పర్మిషన్​ 
  • ఎక్కడికక్కడ పోలీస్ ​చెక్​పోస్టులు 
  • ప్రాజెక్టు పనులు పూర్తి కాలే..
  • నిర్వాసితులకు పునరావాసం కల్పించలే 
  • అడ్డుకుంటారని, గుట్టంతా బయటపడుతుందనే నిర్బంధం 

నాగర్​కర్నూల్, వెలుగు : కాళేశ్వరం తర్వాత మరో ఇంజినీరింగ్​అద్భుతంగా సీఎం కేసీఆర్, మంత్రులు కీర్తిస్తున్న పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పరిసరాల్లో ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ నెల16న సీఎం కేసీఆర్​ప్రారంభించనున్న​నార్లాపూర్ పంప్​హౌస్​, రిజర్వాయర్​దరిదాపుల్లోకి ఎవరూ వెళ్లకుండా అష్టదిగ్బంధనం చేశారు. ఎక్కడికక్కడ పోలీస్​ చెక్​పోస్టులు ఏర్పాటుచేసి గస్తీ తిరుగుతున్నారు. ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తప్ప ఎవరినీ ఫస్ట్​లిఫ్ట్​వైపు వెళ్లనివ్వడం లేదు. రిజర్వాయర్​, పంప్​హౌజ్​కు అవతల భూములున్న రైతులను కూడా చేతిలో పార, పలుగు, వ్యవసాయ పనిముట్లు ఉంటేనే అనుమతిస్తున్నారు.  

ఎక్కడి పనులక్కడే..

తెలంగాణ ఏర్పడిన తర్వాత చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్​ ప్రారంభోత్సవానికి ఈ నెల16న ముహూర్తం ఫిక్స్​చేశారు. సీఎం కేసీఆర్​మొదటి పంప్​వెట్​రన్​ప్రారంభించి నీటిని రిజర్వాయర్​లోకి వదులుతారు. తర్వాత కొల్లాపూర్​లోని సింగోటం చౌరస్తా దగ్గర బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే, నార్లాపూర్​, ఏదుల, వట్టెం, కర్వెన రిజర్వాయర్లను నింపుతామని ఇరిగేషన్​ఆఫీసర్లు చెప్తున్నా నార్లాపూర్, ఏదుల వద్ద తప్ప మిగిలిన రిజర్వాయర్లలో ఆ అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఎనిమిదేండ్ల కింద ప్రారంభించిన పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్ట్​లో ఇప్పటికీ మెయిన్​కెనాల్స్ కంప్లీట్​చేయలేదు. ఒకటి రెండు పంపులను మాత్రం సిద్ధం చేశారు. నార్లాపూర్​రిజర్వాయర్​పనులు కొనసాగుతున్నాయి.

రిజర్వాయర్​మధ్యలోని కొండలను కలిపేందుకు రాక్​ ఫిల్​సిస్టం వైపు మొగ్గుచూపినా ఖర్చు ఎక్కువవుతుందనే ఉద్దేశంతో పాత పద్ధతిలోనే కట్ట పనులు కంప్లీట్​చేశారు. కట్టకు అక్కడక్కడా రివిట్​మెంట్​చేయాల్సి ఉంది. డీపీఆర్​లో ఈ రిజర్వాయర్ స్టోరేజీ కెపాసిటీ 8.5 టీఎంసీలు కాగా, 6.5 టీఎంసీలకు కుదించారు. నార్లాపూర్​నుంచి ఏదులకు వెళ్లే మెయిన్ కెనాల్​పూర్తి కాలేదు. ఎప్పటి వరకు పూర్తవుతుందో అంచనా కూడా లేదు. గ్రావీటి కెనాల్​లో ఇంకా దాదాపు 20 లక్షల క్యూబిక్​ మీటర్ల మట్టిని తవ్వితే తప్ప ప్రధాన కాల్వ ఉపయోగంలోకి రాదు. 

ముంపు గ్రామాల్లోనే జనాలు

ఆర్అండ్ఆర్​ప్యాకేజీ కింద పునరావాస కాలనీలు  ఏర్పాటు చేయకపోవడంతో నార్లాపూర్​రిజర్వాయర్​పరిధిలో ముంపు గ్రామాల ప్రజలు ఇంకా ఖాళీ చేయలేదు. ఒకవేళ నీళ్లు వదిలితే వడ్డె గుడిసెలు, సున్నపుతాండ, అంజనగిరి గ్రామాలు మునిగే అవకాశం ఉంటుంది. మొదటగా నీళ్లు వచ్చే వడ్డె గుడిసెలు ప్రాంతంలో 40కి పైగా ఇండ్లున్నాయి. వీరిలో ఒక్కరికి కూడా పునరావాసం కల్పించలేదు. తర్వాత ఉండే సున్నపు తాండలో వందల ఇండ్లున్నాయి. ఇక్కడ నివసించే వారంతా గిరిజనులే. వీరికీ పునరావాసం కల్పించకపోవడంతో అక్కడే ఉంటున్నారు. ఒకవేళ పూర్తిస్థాయిలో నీళ్లు వదిలితే ఈ గ్రామాలు పూర్తిగా నీట మునిగే పరిస్థితి ఉంటుంది. దీంతో ఇరిగేషన్​స్పెషల్​చీఫ్​సెక్రెటరీ రెండు టీఎంసీలు మాత్రమే నింపుతామని చెబుతున్నారు. ఇంటికో ఉద్యోగం,పూర్తి స్థాయి పరిహారం చెల్లించకుండా పనులు చేయమని స్వయంగా సీఎం కేసీఆర్​ఇదివరకే ప్రకటించారు. ఆ మాట నెరవేర్చకుండానే ప్రారంభోత్సవానికి వస్తుండడంపై నిర్వాసితులు మండిపడుతున్నారు.   

ALSO READ: భార్యను చంపాలని చూసిన భర్తకు నాలుగేండ్ల జైలు శిక్ష

నార్లాపూర్​కు ఎవల్నీ రానిస్తలేరు...

సీఎం పర్యటన నేపథ్యంలో వివిధ రాజకీయ పక్షాల లీడర్లు నార్లాపూర్​కు వెళ్లే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు అటు వైపు ఎవరూ వెళ్లకుండా చెక్​ పోస్టులు ఏర్పాటు చేశారు. నార్లాపూర్​ఫస్ట్​లిఫ్ట్​పరిసరాల్లోకి ఎవరూ వెళ్లకుండా సీనియర్​ పోలీస్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నార్లాపూర్​వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును మహబూబ్​నగర్​లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పనులు పూర్తి కాకపోవడంతో అన్ని విషయాలు ఎక్కడ బయటపెడుతుందోనని మీడియాను కూడా అనుమతించడం లేదు.

 ఇన్ని ఆంక్షలెందుకు?

పాలమూరు -–రంగారెడ్డి ప్రాజెక్టు అద్భుతమని మంత్రులు రోజు డబ్బా కొడుతున్నారు. నార్లపూర్ పంపు హౌజ్ కు వెళ్లకుండా మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావుతో పాటు మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలి. పోలీస్ చెక్ పోస్టులు పెట్టి స్థానికులను కూడా అడ్డుకోవడాన్ని చూస్తే పనులు పూర్తి కాని విషయం బయటపడుతుందని భయడపుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. పైగా రైతులకు పరిహారం ఇవ్వలే. నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ అమలు చేయలే. దీంతో నిర్బంధం పెడుతున్నారు.  

- డా. వంశీ కృష్ణ. మాజీ ఎమ్మెల్యే,  నాగర్ కర్నూల్ డీసీసీ ప్రసిడెంట్ 

రిజర్వాయర్ లో పడి  సచ్చే కాలం వచ్చింది 

పాలమూరు ప్రాజెక్టు పని మొదలు పెట్టే ముందు సీఎం కేసీఆర్ మా భూములన్ని గుంజుకున్నడు. ఒక ఎకరాకు ఐదు లక్షలు ఇచ్చిండు. నాకున్న రెండెకరాల భూమి పోయింది. తండాలో ఉన్న నా సొంత ఇంటికి ఐదు లక్షలు ఇచ్చిండు. ఇంటికో ఉద్యోగం అన్నడు. నా కొడుకు గోపి నాయక్ తన పెండ్లాం పిల్లలను తీసుకొని బతుకుదెరువు కోసం బొంబాయి పోయిండు. నేను గిట్లనే ఆ పని ఈ పని చేసుకుని బతుకుతున్న.

మేమందరం భూమిల పని చేసుకుని సంతోషంగా ఉండేటోళ్లం. రిజర్వాయర్ వచ్చినంక మా బతుకులు చెల్లా చెదురైనయ్. మా తండాల 20 ఇండ్లు, వడ్డే గుడిసెల్లో 30 ఇండ్లు ప్రాజెక్టులో మునిగిపోతున్నయ్​. ఇంటి స్థలం ఇస్తామన్నారు. ఇప్పటికీ చూపలేదు. ఇల్లు కట్టియ్యలేదు. మా పరిస్థితి ఏందో మాకు తెలవడం లేదు. మేము రిజర్వాయర్ల పడి చావాలని రాసిపెట్టి ఉందేమో.

- లక్ష్మి, సున్నపుతాండ