తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ లోక్సభ ఎన్నికలలో తెలంగాణ ఓటర్లు విలక్షణమైన తీర్పునే ఇస్తున్నారు. 1980లో ఇందిరాగాంధీ ఆంధ్రప్రదేశ్లోని మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తే .. ఆమె గెలవటమే కాదు రాష్ట్రం నుంచి 42 లోక్సభ స్థానాలకు గాను 41 లోక్సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేసింది.
ఇందిరా గాంధీ హత్యానంతరం 1984లో జరిగిన లోక్సభ ఎన్నికలలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం వీస్తే ఆంధ్రప్రదేశ్లో మాత్రం తెలుగుదేశం పార్టీ 31 లోక్సభ స్థానాలలో గెలుపొందింది. లోక్సభలో అత్యధిక స్థానాలు సాధించిన ప్రధాన ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీగా టీడీపీ చరిత్రకెక్కింది. 2004 , 2009లో జరిగిన లోక్సభ ఎన్నికలలో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచిన లోక్సభ స్థానాల బలంతో యూపీఏ ప్రభుత్వం రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత రెండు పర్యాయాలు జరిగిన లోక్సభ ఎన్నికలలో అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ బలం 11 లోక్సభ స్థానాల నుంచి తొమ్మిదికి పడిపోయింది. 2019 లోక్సభ ఎన్నికలలో సారు, కారు, పదహారు నినాదంతో ఎన్నికల బరిలో దిగిన బీఆర్ఎస్ కేవలం తొమ్మిది లోక్ సభ స్థానాలలో మాత్రమే విజయం సాధించగలిగింది. శాసనసభలో ఉన్న బలం మేరకు బీఆర్ఎస్ పార్టీ 2019 ఎన్నికలలో దరిదాపు 12 లోక్సభ స్థానాలలో గెలవాలి. కానీ, బీఆర్ఎస్ తొమ్మిది లోక్సభ స్థానాలలో మాత్రమే గెలుపు సాధించగలిగింది.
అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఉన్న బలం ప్రకారంగా కాంగ్రెస్ దాదాపు తొమ్మిది లోక్సభ స్థానాలలో గెలవాలి. బీజేపీ ఒక లోక్సభ స్థానంలో, ఎంఐఎం ఒక లోక్సభ స్థానంలో, బీఆర్ఎస్ పార్టీ దాదాపు ఆరు లోక్ సభ స్థానాలలో గెలవాలి. కానీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ 14 లేదా 15 లోక్సభ స్థానాలలో విజయం సాధిస్తుందనే ధీమాని వ్యక్తం చేస్తున్నారు. గత రెండు లోక్సభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కేవలం రెండు, మూడు లోక్ సభ స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈ లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తే భవిష్యత్తులో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింతగా బలపడే అవకాశం ఉంటుంది.
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ సక్సెస్
2021లో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలమైన పార్టీగా నిర్మించారనే చెప్పాలి. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి తీసుకువచ్చి తన బలాన్ని చూపెట్టిన రేవంత్ రెడ్డి అంతే ధీమాతో ముఖ్యమంత్రిగా మెజార్టీ లోక్ సభ స్థానాలలో పార్టీని గెలిపించటానికి వ్యూహాలను రూపొందిస్తున్నారు. గెలుపు ఓటములు ఎలా ఉన్నా ఒక్క హైదరాబాద్ లోక్సభ స్థానంలో మినహా రాష్ట్రంలోని అన్ని లోక్సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీని బలమైన పోటీదారుగా రేవంత్ రెడ్డి నిలబెట్టగలిగారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ అధినేతగా పార్టీ నాయకుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మెజార్టీ లోక్సభ స్థానాలలో గెలిస్తే అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ రేవంత్ రెడ్డి బలం పెరుగుతుందనటంలో సందేహం లేదు. హైదరాబాద్ లోక్సభ స్థానంలో గెలుపు అవకాశాలు లేకపోయినా సికింద్రాబాద్, నిజామాబాద్, అదిలాబాద్ లోక్సభ స్థానాలలో గెలుపు పై సందేహాలున్నా కొద్దిగా ప్రయత్నిస్తే కరీంనగర్లో కూడా గెలుపు సాధించవచ్చని కాంగ్రెస్ పార్టీ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. కాబట్టి 13 లోక్సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి ధీమాగా ఉన్నారు.
కాంగ్రెస్ లక్ష్యం నెరవేరుతుందా?
2014, 2019లో జరిగిన లోక్సభ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పదకొండు లోక్సభ స్థానాలకు మించి గెలవలేకపోయింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 15 లోక్సభ స్థానాలలో విజయం సాధించాలనే లక్ష్యం నెరవేరుతుందా అనే సందేహం వ్యక్తమవుతున్నది. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో విజయం సాధించిన తరువాత ఈ నాలుగు నెలల కాలంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వలసలతో మరింత బలహీనపడటం, బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రభావవంతమైన పార్టీగా లేకపోవడం, కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికలలో కలిసి వచ్చే అంశాలుగా చూడాలి.
ఉత్తర తెలంగాణలో, దక్షిణ తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ తెలంగాణలో మాత్రం బలహీనంగా ఉంది. సెంట్రల్ తెలంగాణలో ఉన్న మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, మెదక్ లోక్సభ స్థానాల పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షాల నుంచి బలమైన పోటీ ఎదురవుతుంది. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆయా నియోజకవర్గాలలో ఇతర పార్టీలలో ఉన్న బలమైన నేతలను, ప్రజాప్రతినిధులను తన వైపు తిప్పుకొని ఆ స్థానాలలో కూడా గెలుపు సాధించాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను రూపొందిస్తోంది. శాసనసభ ఎన్నికలలో సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్సభ పరిధిలో ఒక్క శాసనసభ స్థానాన్ని కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది. ప్రస్తుతం ఆ రెండు లోక్సభ స్థానాలలో కూడా కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే స్థాయికి చేరుకుంది.
రేవంత్ వ్యూహ సంపన్నుడు
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మెజార్టీ లోక్సభ స్థానాలను గెలవగలిగితే అది ఈ నాలుగు నెలలలో ప్రభుత్వ పనితీరుకి, ఈ నాలుగు నెలలలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రేవంత్ రెడ్డి వేసిన రాజకీయ ఎత్తుగడలకు దక్కిన ఫలితంగానే చెప్పాలి. పార్టీ బలహీనంగా ఉన్న అనేక లోక్సభ స్థానాలలో పార్టీ బలోపేతానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ లోక్సభ స్థానాలలో గెలవటానికి దోహదం చేస్తున్నాయి. తెలంగాణ లాంటి విభజిత రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులను, ప్రాజెక్టులను, హామీలను రాబట్టడానికి ఎంపీల బలం చాలా ముఖ్యమనే విషయాన్ని గమనించాలి.
విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను సాధించేందుకు పోరాట పటిమ, చాతుర్యం, నేర్పరితనం ఉన్న ఎంపీలు గెలవాల్సిన అవసరం ఉంది. 17 మంది లోక్సభ సభ్యులు, 8 మంది రాజ్యసభ సభ్యులు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలి. గత దశాబ్ద కాలంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యులు రాష్ట్రం కోసం ప్రజలు ఆశించిన స్థాయిలో పని చేయలేదనేది వాస్తవం. ఈ లోక్సభ ఎన్నికలలో ఏ పార్టీవారు గెలిచినా.. రాష్ట్రం కోసం పనిచేసేవారు, పోరాడేవారు లోక్సభ సభ్యులుగా గెలవాలని కోరుకుందాం.
- డాక్టర్ తిరునహరి శేషు,
పొలిటికల్ ఎనలిస్ట్,
కాకతీయ వర్సిటీ