బీసీ గురుకులాల్లో .. ఇంటర్ ప్రవేశ ఫలితాలు విడుదల

బీసీ గురుకులాల్లో .. ఇంటర్ ప్రవేశ ఫలితాలు విడుదల
  • ఈ నెల 30 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలని సొసైటీ సెక్రటరీ సైదులు సూచన
  • వచ్చే నెల 1 నుంచి క్లాసులు ప్రారంభిస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: బీసీ సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. https://mjpabcwreis.cgg.gov.in/లో రిజల్ట్స్ అందుబాటులో ఉంచామని తెలంగాణ మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల సొసైటీ సెక్రటరీ బడుగు సైదులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంట్రన్స్‌ టెస్ట్‌లో మెరిట్‌ సాధించిన విద్యార్థులు తమకు అలాట్‌ చేసిన కాలేజీల్లో ఈ నెల 20 నుంచి 30 లోగా రిపోర్ట్‌ చేయాలని సూచించారు. ఎంట్రన్స్ టెస్ట్ అప్లికేషన్ సమయంలో ప్రతి విద్యార్థి వారి సొంత ఉమ్మడి జిల్లాలో ఉన్న గురుకుల కాలేజీల్లో ప్రయారిటీ ప్రకారం ఆప్షన్లు ఇవ్వగా, స్టూడెంట్స్‌కు వచ్చిన మార్కులు, ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయించామన్నారు.

 ఈ నెల 30 తర్వాత కాలేజీల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం రెండోసారి నోటిఫికేషన్ ఇస్తామని, దీని తర్వాత ఆన్‌లైన్‌లో స్పాట్ అడ్మిషన్లతో మిగిలిన సీట్లనూ భర్తీ చేస్తామని చెప్పారు. వచ్చే నెల 1 నుంచి తరగతులు ప్రారంభిస్తామని వెల్లడించారు. సీట్ల భర్తీలో ఎంబీసీలకు 75 శాతం, ఎస్టీలకు 15 శాతం, ఎస్సీలకు 5 శాతం , మిగిలిన వారికి 5 శాతం రిజర్వేషన్లు అమలు చేశామని తెలిపారు. కాగా, వివిధ కోర్సుల్లో మొత్తం 18,700 సీట్లకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా గత నెల 28న ఎంట్రన్స్ ఎగ్జామ్‌ నిర్వహించారు. 

ఎంపీసీలో 8,624 సీట్లు..

బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఎంపీసీ 8,624, బైపీసీ 6,463, ఎంఈసీ 484, సీఈసీ 2,676, హెచ్‌ఈసీలో 229 సీట్లు అందుబాటులో ఉన్నాయని సైదులు తెలిపారు. ఇందులో గర్ల్స్ కోసం 9,841, బాయ్స్ కోసం 8,635 కేటాయించామని చెప్పారు. వీటితో పాటు ఫ్రొఫెషనల్ కోర్పులు అయిన అగ్రికల్చర్ అండ్‌ క్రాప్ ప్రొడక్షన్ (ఏసీపీ)లో 19 సీట్లు, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ (సీజీటీ) 11 సీట్లు, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్‌ యానిమేషన్(సీజీఏ)లో 35 సీట్లు, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎంఎల్‌టీ) 76 సీట్లు, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఎంపీహెచ్‌డబ్ల్యూ)లో 92 సీట్లు, ఫిజియోథెరపీ (పీటీ)లో 12 సీట్లు, ఫ్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ (పీఎస్‌టీటీ)లో 9 సీట్లు, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్(టీహెచ్)లో 19 సీట్లు కలిపి మొత్తం 273 సీట్లు భర్తీ చేస్తామని వెల్లడించారు.