పట్టు బిగిస్తేనే ఫలితాలు : దిలీప్ రెడ్డి

‘కాలుష్య కారకులే ఖర్చు భరించాలి’ అనే సహజ న్యాయం కోసం పోరాటమే ఈసారి వర్యావరణ ప్రపంచ సదస్సు, కాప్ –​27 ప్రత్యేకాంశంగా వేడి పుట్టిస్తున్నది. బాధ్యుల్ని ఫిక్స్‌‌ చేయడానికి, బాధితులకు నష్టపరిహారం ఇప్పించడానికి నిర్మాణాత్మక ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. ‘వాతావరణ మార్పు’ దుష్ప్రభావాలతో తీవ్రంగా కష్టాలు ఎదుర్కొంటున్న పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ఇప్పటిదాకా ప్రపంచ కాలుష్యాలకు ప్రధాన కారుకులైన సంపన్న, అభివృద్ధి చెందిన దేశాలకు మధ్య పిల్లీ – ఎలుక పోరు ఎప్పటిలాగే మొదలైంది. కాకపోతే, ఈ సారి బాధిత దేశాల నుంచి ఒత్తిడి తీవ్రంగా ఉంది. తమ ఖండంలోనే సదస్సు జరుగుతున్నందుకేమో! తగిన కసరత్తు చేసుకొని వచ్చిన ఆఫ్రికా దేశాలను ఈ విషయంలో అభినందించాలి. సానుభూతి మాటలు, కళాత్మక ప్రసంగాలు చేసి జారుకుందామనుకుంటున్న సంపన్న దేశాల ఎత్తుగడల ప్రభావం ఈసారి కూడా ముఖ్యమే! సదస్సు గతిని మలుపు తిప్పి, తమ వ్యాపారాలకు అనుగుణంగా, ప్రధాన లక్ష్యాలకు గండికొట్టేందుకు మారువేశాల్లో అక్కడ మోహరించిన హైనాల వంటి కంపెనీలు, కార్పొరేట్లు కూడా ప్రమాదకారులే! చర్చలు, నిర్ణయాలపై అవి ఎంతగా పట్టు సాధిస్తాయనే దాన్ని బట్టి సదస్సు తుది ఫలితాలు ఆధారపడనున్నాయి. ఐక్యరాజ్యసమితి(యూఎన్‌‌) నేతృత్వంలో ఈజిప్ట్‌‌లోని షార్మ్ ఎల్- షేక్ లో జరుగుతున్న భాగస్వామ్య దేశాల ( కాప్–కాన్ఫరెన్స్ ఆఫ్ ప్యారిస్‌‌ 27వ‌‌) స‌‌ద‌‌స్సు మొదలై నాలుగు రోజులైంది. నిరుడు గ్లాస్గో (యూకే) లో జరిగిన కాప్‌‌–26 తో పోల్చి చూస్తే, ఇది ఇంకొంత ఆచరణాత్మకంగా జరుగుతున్నట్టే కనిపిస్తున్నది. కానీ, సదస్సు ఈ నెల18 దాకా ఉండటంతో... రాగల రోజుల్లో జరిగే లాబీయింగ్‌‌, వాటి ప్రభావంతో చోటుచేసుకునే పరిణామాలు అత్యంత కీలకమని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ప్రతిస్పందన నిధి కావాలి

ప్రకృతి – సహజ వనరుల వినియోగం ప్రపంచంలో ఇప్పటిదాకా సమరీతిలో జరగలేదు. పారిశ్రామిక విప్లవం నుంచి అభివృద్ధి చెందిన సమాజాలు ఈ వనరుల్ని బాగా పిండుకున్నాయి. ప్రపంచీకరణ తర్వాత మరింత అధికంగా వినియోగిస్తున్నాయి. ఇంకా వాడని చిన్న, పేద, అభివృద్ధి చెందని దేశాలు నిజానికి కాలుష్య కారకాలు కావు. కానీ, ఇప్పుడు వాతావరణ మార్పు ఉపద్రవంతో అధికంగా నష్టపోతున్నది అవే! పైన 20 దేశాలు ప్రధాన కారకులైతే, అడుగున 55 దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో బొగ్గు, పెట్రోలియం వంటి శిలాజ ఇంధనాల వాడకంపైన, ఇతరత్రా ఆంక్షలు, ప్రంచం అంతటికీ ఏకరీతిన విధిస్తే... తాము మరింత నష్టపోతామన్నది వాటి ఆందోళన. ‘కాలుష్యం మీ వల్ల, కష్టాలు మాకా?’ అని అవి ప్రశ్నిస్తున్నాయి. ఏటా రెండు లక్షల కోట్ల డాలర్ల చొప్పున, 2030 వరకు నష్టపరిహారం ఇస్తే, అభివృద్ధి చెందుతున్న చిన్న, పేద దేశాలు కొంతలో కొంత కోలుకుంటాయి. ఇందుకోసం అభివృద్ధి చెందిన దేశాలు, కర్బన ఉద్గారాల నష్ట నివారణకు ‘ప్రతిస్పందన నిధి’ని ఏర్పాటు చేయాలనేది డిమాండ్‌‌! సమస్య నిజమే, నష్టపరిహారం ఇవ్వాల్సింది న్యాయమే, కానీ, అమలు కష్టంగా ఉందనే సన్నాయి నొక్కులు అభివృద్ధి చెందిన దేశాలు వినిపిస్తున్నాయి. నిరుడు కాప్‌‌–26 లోనే ఈ డిమాండ్‌‌ వచ్చింది. కానీ, అంతగా పట్టుబట్టలేదు. ఈసారి మాత్రం కొన్ని ఆఫ్రికా దేశాలు గడిచిన300 ఏండ్లలో ఎవరి పాపం ఎంత? అనే స్పష్టమైన లెక్కలతో వచ్చాయి. దాంతో సంపన్న దేశాలు ఇరుకున పడ్డాయి. దీనికి స్పందించే విషయంలో యురోపియన్‌‌ యూనియన్‌‌కు ఉన్నంత సుముఖత అమెరికాకు లేదు. పెద్ద కాలుష్య కారకులైన చైనా, రష్యా వంటి దేశాలు ఈ సదస్సునే ఎగ్గొడుతున్నాయి. చైనా, అమెరికా కలిసి 60 శాతం కర్బన ఉద్గారాలకు కారణమవుతున్నాయి. ప్యారిస్‌‌ సదస్సు(2015) లో అంగీకరించిన అంశాలకు కూడా సంపన్న దేశాలు కట్టుబడటం లేదు. కొత్తగా కార్బన్‌‌ మార్కెట్‌‌ అంశాన్ని తెరమీదకు తెస్తున్నాయి. కార్బన్‌‌ టాక్స్‌‌ గురించి అతకని మాటలు చెబుతున్నాయి. ఏటా పదివేల కోట్ల డాలర్ల మేర సాయం అభివృద్ధి చెందని మూడో ప్రపంచ దేశాలకు అందిస్తామని అభివృద్ధి చెందిన దేశాలు 2010లో ఇచ్చిన హామీ గాలికి పోయింది.

ఎక్కడ గండిపడుతున్నది?

ప్రతిసారీ కాప్‌‌ సదస్సు భారీ ఆశలు, అంచనాలతో మొదలవుతుంది. కానీ, తుది ఫలితం చప్పగా ఉంతున్నది. ముఖ్యంగా, విశ్వవ్యాపిత పర్యావరణ పరిరక్షకులైన శాస్త్రవేత్తలు, కార్యకర్తలు, హితంకోరే వారికి తీవ్ర నిరాశనే మిగులుస్తున్నది. దీనికి పలు కారణాలున్నాయి. సౌఖ్యాలకు మరిగి, తమ ముందరి కాళ్లకు బంధం పడకూడదని కోరుకునే అభివృద్ధి చెందిన దేశాల ఎత్తుగడలు ఒక కారణం. సదస్సుకు వచ్చి, గంభీరంగా ఇచ్చే పెద్ద పెద్ద హామీలను ఆయా దేశాలు అమలులో, కార్యాచరణలో చూపకపోవడం ఇంకో కారణం. కంపెనీలు, కార్పొరేట్ల లాబీయింగ్‌‌ మూడో బలమైన కారణం. కర్బన ఉద్గారాలకు కారణమవుతున్న ప్రపంచ స్థాయి బొగ్గు, పెట్రోల్‌‌ తదితర శిలాజ ఇంధనాల ఉత్పత్తి కార్పొరేట్లు, కార్ల కంపెనీలు, రుణాలిచ్చే ఐఎంఎఫ్‌‌ వంటి ఆర్థిక సంస్థలు... తెలివిగా ఈ లాబీయింగ్‌‌కు పాల్పడుతున్నాయి. పలు కీలకమైన ప్రతిపాదనలకు కాప్‌‌–26 లోనే అడ్డుతగిలిన వీరు, చివరకు ఆయా విషయాల్లో తుది అంగీకారాలు బలహీనంగా, చప్పగా నమోదవడానికి కారణమయ్యారు. కాప్‌‌ సదస్సులపై వాటి ప్రభావాన్ని ఎంత తగ్గించాలనుకున్నా, పెరుగుతూనే ఉంది. కాప్‌‌ – 26 కు సుమారు 500 మంది ఇలాంటి ప్రతినిధులు వస్తే, ఆ సంఖ్య ఈ సారి 600 కు పెరిగింది. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, వివిధ ప్రభుత్వాలు పంపిన అధికారిక ప్రతినిధి బృందాల్లో భాగంగా కంపెనీలు, కార్పొరేట్ల ప్రతినిధులు ‘ముసుగు దొంగల్లా’ సదస్సుకు వస్తున్నారు. ఈ విషయంలో మనదేశానికీ మినహాయింపేమీ లేదు. అగ్రరాజ్యాల నుంచి అల్ప దేశాల వరకు ఇలాంటి కార్పొరేట్‌‌ శక్తులకు లొంగిపోయే ప్రభుత్వాల వల్లే పర్యావరణ అంగీకారాలు, ఉమ్మడి నిర్ణయాలు వీగిపోతున్నాయి. అందుకే, ఆయా సదస్సుల్లో జరిపిన ప్రతిపాదనలు, చర్చలు, అంగీకారాల ‘అమలు – ఆచరణ’ అనే అంశాన్నే ఈసారి సదస్సు ప్రధాన థీమ్‌‌గా నిర్ణయించారు.

ఫలితాలిచ్చేది నిజాయితీయే

కాప్‌‌ సదస్సులు ఎంత గొప్పగా జరిగినా, ఉమ్మడి అంగీకారాలు, నిర్ణయాల అమలులో బాధ్యులు చూపే నిజాయితీయే ముఖ్యం. కాప్‌‌ నిర్వహణ సౌజన్యం(స్పాన్సర్‌‌షిప్‌‌)లో పర్యావరణ విధ్వంసకులే ఉండటం తరచూ వివాదాస్పదమవుతున్నది. ప్రస్తుత సదస్సు నిర్వహణలో రూ. 3500 కోట్ల మేర ఆర్థిక సాయం అందించిన కోకకోలా సంస్థ ఓ పెద్ద విధ్వంసకురాలు కావడంతో విమర్శనే ఎదుర్కోవాల్సి వచ్చింది. అత్యధిక భూగర్భజలాల వాడకం, ప్లాస్టిక్‌‌ వినియోగం, ఇతరత్రా కాలుష్యాలకు కారణమవుతున్న ఈ సంస్థ సౌజన్యమేమిటనేది అభ్యంతరం. ఇలాంటి నైతిక అంశాలు, లాబీయింగ్‌‌ను అనుమతించడం, నిర్వహణల్లో నిజాయితీ, అమల్లో చిత్తశుద్ధి వంటివి కీలకాంశాలవుతున్నాయి. బాధితులకు పరిహారం, వాతావరణ మార్పు విపరిణామాలకు తట్టుకునే (అడాప్టేషన్‌‌) సామర్థ్యాల పెంపు, ముప్పు రాకుండా ముందే నివారించడం(మిటిగేషన్‌‌) అనే మూడంశాలకు తాజా సదస్సులో అధిక ప్రాధాన్యత లభిస్తున్నది. కర్భన ఉద్గారాల శీర్ష స్థానంలో ఉన్న సుమారు1500 కంపెనీలు, ఉద్గారాలు తగ్గించుకుంటామని ఈ వేదిక నుంచి ప్రతిజ్ఞ చేశాయి. కానీ, దాన్ని నిఘా వేసే వ్యవస్థే లేదు. ప్రతిపాదనలు, చర్చలు, అంగీకారాలు అన్నీ ఒక ఎత్తు, వాటి అమలులో నిజాయితీ మరో ఎత్తు. అదే పర్యావరణానికి ప్రాణం!

ఎవరి పాపం? మరెవరికి భారం!

సమాజంలో సమన్యాయం అందించలేకపోతున్న సంక్లిష్ట, సందేహాత్మక పదం ‘అభివృద్ధి’. పర్యావరణాన్ని, సహజ ప్రకృతి వనరుల్ని పణంగా పెట్టి సాధించేది ఎవరి అభివృద్ధి? అన్న ప్రశ్న తరచూ తలెత్తుతున్నది. అందుకే, మానవాళి ప్రయోజనాల కోసం సుస్థిరాభివృద్ధిని యూఎన్‌‌ నిర్వచించింది. ‘రాబోయే తరాలు తమ ప్రగతి కోసం ప్రకృతివనరుల్ని వాడుకునే అవకాశాల్ని రక్షిస్తూ, ఒక తరం తమకోసం ఆయా వనరుల్ని హేతుబద్ధంగా వాడుకుంటూ సాధించేదే సుస్థిరాభివృద్ధి’ అని చెప్పింది. వివిధ రంగాల్లో సాధించాల్సిన ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ని (ఎస్డీజీస్‌‌) నిర్దేశిస్తూ 2030 వరకు ఒక కార్యక్రమాన్ని ఇచ్చింది. దాని ప్రగతిపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుగుతూనే ఉన్నాయి. కాప్‌‌-27లో అదీ ఒక అంశమే! మనిషి సృష్టిస్తున్న కాలుష్యాల వల్ల కర్బన ఉద్గారాలు పెరిగి పుడమి వేడెక్కుతున్నది. దాంతో ముంచుకు వచ్చిన ‘వాతావరణ మార్పు’ తీవ్ర విపత్తులకు కారణమవుతున్నది. అడవులు కాలిపోతున్నాయి. అతివృష్టి – అనావృష్టి వల్ల వరదలు, కరువులు వంటివి ప్రపంచమంతటా ప్రజల్ని మునుపెన్నడూ లేనంతగా వేధిస్తున్నాయి. వాతావరణ మార్పుపై యూఎన్‌‌ ఏర్పరచిన అంతర్‌‌ ప్రభుత్వాల బృంద నివేదిక (ఐపీసీసీ)తో పాటు పలు రిపోర్టుల్లో.. అంచనా కన్నా తీవ్రంగా, వేగంగా ప్రమాదం ముంచుకువస్తున్నదని తేలింది. కట్టడి కాని భూతాపోన్నతి వల్ల ధ్రువాల మంచు కరుగుతున్నది. ప్రకృతి విపత్తులు సరికొత్త రూపాల్లో భారీ నష్టం కలిగిస్తున్నాయి. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థల్నే ఈ ఉపద్రవాలు చిన్నాభిన్నం చేస్తున్నాయి. 

- దిలీప్ రెడ్డి

dileepreddy.ic@gmail.com