న్యూఢిల్లీ : దేశంలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ కిందటి నెలలో 5.08 శాతానికి పెరిగింది. వంట సామాన్ల రేట్లు పెరగడంతో ఈ ఏడాది మే నెలతో పోలిస్తే జూన్‌లో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ పెరిగింది. ఇన్‌ఫ్లేషన్‌ను కొలిచే కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) ఈ ఏడాది మేలో 4.8 శాతంగా, కిందటేడాది జూన్‌లో 4.87 శాతంగా రికార్డయ్యింది. ఆహార పదార్ధాల ధరలను కొలిచే ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ మే నెలలో 8.69 శాతంగా ఉంటే జూన్‌లో 9.36 శాతానికి పెరిగింది.
రిటైల్ ఇన్‌ఫ్లేషన్ 2 శాతం నుంచి 4 శాతంలోపు ఉండేలా చూసుకోవాలని ఆర్‌బీఐకి ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీపీఐ 4.5 శాతంగా, మొదటి క్వార్టర్‌లో 4.9 శాతంగా, రెండో క్వార్టర్‌లో 3.8 శాతంగా, మూడో క్వార్టర్‌లో 4.6 శాతంగా, నాల్గో క్వార్టర్‌లో 4.5 శాతంగా రికార్డవుతుందని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది.
పెరిగిన పరిశ్రమల ఉత్పాదకత
ఈ ఏడాది మే నెలలో పరిశ్రమల ఉత్పాదకత ఊపందుకుంది. మైనింగ్, పవర్ సెక్టార్లలో ప్రొడక్షన్ పెరగడంతో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపీ) మే నెలలో 5.9 శాతం వృద్ధి చెందింది. కిందటేడాది మే లో ఐఐపీ 5.7 శాతం గ్రోత్ నమోదు చేసింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ విడుదల చేసిన డేటా ప్రకారం, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌లో ప్రొడక్షన్ గ్రోత్ 4.6 శాతంగా రికార్డయ్యింది.
కిందటేడాది మే నెలలో ఈ నెంబర్ 6.3 శాతంగా నమోదయ్యింది. మైనింగ్ సెక్టార్‌లో ప్రొడక్షన్ 6.6 శాతం పెరగగా, పవర్ సెక్టార్‌లో ప్రొడక్షన్ 13.7 శాతం పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్–మే నెలల్లో ఐఐపీ 5.4 శాతం వృద్ధి చెందింది. కిందటేడాది ఇదే టైమ్‌లో 5.1 శాతం గ్రోత్ నమోదు చేసింది.