
న్యూఢిల్లీ: ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) ట్రేడింగ్‌కు రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో ఆకర్షితులవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. తక్కువ టైమ్‌లో భారీ లాభాలు పొందే అవకాశం ఉండడంతో ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ చేసేవారు పెరుగుతున్నారని వెల్లడించారు. ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్‌లో రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ పెరగడంపై తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వీ అనంత నాగేశ్వరన్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ సెగ్మెంట్‌లో ట్రేడింగ్ చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టొద్దని కిందటేడాది నవంబర్‌లో సెబీ చైర్‌పర్సన్ మాధవి పురి బుచ్ రిటైల్ ఇన్వెస్టర్ల సలహా ఇచ్చారు. అయినప్పటికీ ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ పాపులారిటీ పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది మార్చిలో ఏకంగా రూ.8,740 లక్షల కోట్ల విలువైన టర్నోవర్ జరగడం ఇందుకు నిదర్శనం.
ఐదేళ్ల కిందట అంటే మార్చి, 2019 లో కేవలం రూ.217 లక్షల కోట్ల విలువైన టర్నోవర్ రికార్డయ్యింది. ఈక్విటీ సెగ్మెంట్‌లో సగటున రోజుకి రూ. లక్ష కోట్ల టర్నోవర్ జరుగుతుండగా, ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్‌లో సగటున రోజుకి రూ.330 లక్షల కోట్ల టర్నోవర్ అవుతోంది. కాగా, సెబీ సర్వే ప్రకారం, ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ చేస్తున్నవారిలో 89 శాతం మందికి నష్టాలే వస్తున్నాయి. 2021–22 లో ఎఫ్ అండ్ ఓ ట్రేడర్లు సగటున రూ.1.1 లక్షలు నష్టపోయారు.