Bangladesh Crisis: మన దగ్గరే నయమేమో.. బంగ్లాదేశ్లో నిత్యావసర ధరల పరిస్థితి ఇదనమాట..!

Bangladesh Crisis: మన దగ్గరే నయమేమో.. బంగ్లాదేశ్లో నిత్యావసర ధరల పరిస్థితి ఇదనమాట..!

ఢాకా: బంగ్లాదేశ్లో ఇటీవల ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలియంది కాదు. విద్యార్థుల నిరసనలతో దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి పారిపోయి భారత్ వచ్చి తలదాచుకోవడంతో ఆ దేశ ప్రతిష్ట మసకబారింది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. బంగ్లాదేశ్లో ఆహార ద్రవ్యోల్పణం జులై నెలలో 14 శాతం దాటిపోయింది. గడచిన 13 ఏళ్లలో ఆహార ద్రవ్యోల్పణం ఈ స్థాయిలో ఉండటం ఇదే తొలిసారి. 

బంగ్లాదేశ్ కరెన్సీ టాకా విలువ ఘోరంగా పడిపోయింది. అల్లర్ల కారణంగా రిటైల్ వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. బంగ్లాదేశ్లో నిరసనల ప్రభావం సప్లై చైన్పై ఎక్కువ పడింది. పరిస్థితులను సాధారణ స్థితిలోకి తీసుకురావడానికి బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసుకునే డబ్బుపై కూడా బంగ్లాదేశ్లో ఆంక్షలు విధించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బంగ్లాదేశ్ పౌరులు బ్యాంకుల నుంచి ఒక్కొ్క్కరూ ఒకేసారి 2 లక్షల బంగ్లాదేశీ టాకాలకు మించి విత్ డ్రా చేసుకోలేరు.

ఇక.. ఢాకాలోని అతిపెద్ద హోల్సేల్ మార్కెట్ కవ్రాన్ బజార్లో వ్యాపారుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. సరుకుల ధరలు పెంచితే వినియోగదారుల నుంచి వ్యతిరేకత. పెంచకపోతే లాభాలు రాని దుస్థితి. ఇదీ.. ఆ మార్కెట్లో ఏ వ్యాపారిని కదిలించినా వస్తున్న స్పందన. ఏతావాతా తేలిందేంటంటే.. రిటైల్ వ్యాపారులు ధరలు పెంచక తప్పని పరిస్థితులు బంగ్లాదేశ్లో ఉన్నాయి. సప్లై చైన్ ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో త్వరలో బంగ్లాదేశ్లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశాలు లేకపోలేదు. 

బంగ్లాదేశ్ లో షేక్ హసీనా సర్కారు కూలిన తర్వాత పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఆమె పార్టీ అవామీ లీగ్ కు చెందిన నేతలను అల్లరిమూకలు ఊచకోత కోశాయి. హిందువుల ఇండ్లు, టెంపుల్స్ పైనా దాడులకు పాల్పడి లూటీ చేశాయి. అవామీ లీగ్ చెందిన కొందరు నేతలను దుండగులు సజీవ దహనం చేశారు. మరికొందరిని రాళ్లు, కట్టెలతో కొట్టి చంపేశారు. కొన్ని చోట్ల డెడ్​బాడీలను ఫుట్ ఓవర్ బ్రిడ్జిలకు వేలాడదీశారు. హిందువుల ఇండ్లు, దుకాణాలను దోచుకున్నారు. ఆలయాలను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దేశవ్యాప్తంగా సుమారు 29 మంది అవామీ లీగ్ నేతలు హత్యకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో వీరి డెడ్​బాడీలను ఆర్మీ గుర్తించింది. సాత్ఖిరా ప్రాంతంలో 10 మంది, కొమిల్లాలో 11 మంది అవామీ లీగ్ పార్టీ నేతలు ప్రాణాలు కోల్పోయారు.