వరంగల్లో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ హత్య.. కారు టైర్లకు బురద.. డోర్ మధ్యలో పచ్చ గడ్డి

వరంగల్లో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ హత్య.. కారు టైర్లకు బురద.. డోర్ మధ్యలో పచ్చ గడ్డి

వరంగల్‍/వరంగల్‍ సిటీ, వెలుగు: కాకతీయ గ్రామీణ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ రాజామోహన్ దారుణ హత్యకు గురయ్యాడు. గొలుసులు, నైలాన్ తాళ్లతో దుండగులు ఆయన కాళ్లు, చేతులు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. మెడ, తలపై కత్తులతో పొడిచి చంపేశారు. డెడ్​బాడీని ఆయన కారులోనే వెనుక సీటులో కుక్కేశారు. తర్వాత ఆ కారును వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్న రంగంపేట ఏరియాలో వదిలేసి పారిపోయారు. మంగళవారం ఉదయం కొందరు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న మట్వాడా పోలీసులు.. క్లూస్‌ టీమ్‌తో వివరాలు సేకరించారు. కారును పార్క్‌ చేసి ఓ వ్యక్తి పారిపోతున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డ్‌ అవడంతో అతను ఎవరనే దానిపై పోలీసులు ఫోకస్‌ పెట్టారు.

వరంగల్ కాశీబుగ్గకు చెందిన వెలిగేటి రాజామోహన్.. కాకతీయ గ్రామీణ బ్యాంక్​లో మేనేజర్​గా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం హనుమకొండలోని శ్రీనగర్ కాలనీలో ఉంటున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు. చిన్న కూతురు చిన్నప్పుడే అనారోగ్యంతో చనిపోయింది. మూడేండ్ల కింద భార్య గుండెపోటుతో చనిపోయింది. పెద్ద కూతురు అమెరికాలో, మరో కూతురు హైదరాబాద్​లో ఉంటున్నారు. దీంతో రాజామోహన్ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ప్రతి రోజూ సాయంత్రం తన ఫ్రెండ్స్, అమెరికాలో ఉండే కూతురితో ఫోన్​లో మాట్లాడేవాడు. సోమవారం ఎవరికీ ఫోన్ చేయలేదు. వాళ్లు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. 

దీంతో ఆందోళనకు గురైన పెద్ద కూతురు సోమవారం రాత్రి 10.30 గంటలకు తన ఫ్రెండ్స్​కు చెప్పగా వాళ్లు ఇంటికెళ్లి చూశారు. ఇంట్లో రాజామోహన్, అతని కారు లేకపోవడంతో మంగళవారం ఉదయం మిస్సింగ్ కేసు పెట్టేందుకు సుబేదారి పోలీస్ స్టేషన్​కు వెళ్లారు. అదే టైమ్​లో రంగంపేటలో ఏపీ 36 క్యూ 1546 నంబర్ కారులో రాజామోహన్ డెడ్​బాడీని గుర్తించారు. కారు నంబర్, జేబులోని ఐడీ కార్డు ఆధారంగా రాజామోహన్ బంధువులకు సమాచారం ఇచ్చారు. తర్వాత డెడ్​బాడీని ఎంజీఎంలోని మార్చురీకి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు సుబేదారితో పాటు మట్వాడా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఒంటిపై ఉన్న బంగారం కోసమేనా..? 
ఘటనా స్థలాన్ని డీసీపీ సలీమా, ఏసీపీ నందిరాం నాయక్ పరిశీలించారు. సోమవారం రాత్రి 7.30 గంటలకు రాజామోహన్ తన కారులో ఇంటి నుంచి బయటికెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. గొలుసులు, తాళ్లతో కట్టేసి దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని ఒంటిపై రూ.3 లక్షలకు పైగా విలువ చేసే నగలు ఉంటాయి. వాటి కోసమే ఎవరైనా హత్య చేశారా? అన్న అనుమానం కూడా ఉన్నది. సోమవారం రాత్రి రాజామోహన్ ఎవరెవరితో మాట్లాడాడన్న దానిపై కాల్ డేటా సేకరిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

తెల్లవారుజామున 3.49 గంటలకు మంకీ క్యాప్ పెట్టుకున్న ఓ వ్యక్తి.. డెడ్​బాడీ ఉన్న కారును వదిలేసి నడుచుకుంటూ వెళ్లిపోయినట్లు గుర్తించారు. సోమవారం రాత్రి 11.23 గంటలకు రాజామోహన్​కు ఓ ఫ్రెండ్ వీడియో కాల్ చేశాడు. నాలుగు సెకన్ల పాటు ఫోన్ ను ఎవరో లిఫ్ట్ చేశారని, రాజామోహన్​ను ఓ గదిలో కట్టేసినట్లు అనిపించిందని అతను మీడియాకు తెలిపాడు. కారు టైర్లకు మట్టి, డోర్ మధ్యలో గడ్డి ఉండటంతో.. రాజామోహన్​ను వరంగల్ బయటకు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి చంపేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.