- తీర్పు చెప్పిన కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టు
- 2013లో వాంకిడి పీఎస్ సీఐగా ఉండగా పట్టివేత
కరీంనగర్ క్రైం, వెలుగు: సీఐగా ఉన్నప్పుడు లంచం తీసుకుని ఏసీబీకి చిక్కిన ప్రస్తుత రిటైర్డ్ డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌కు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన చింతపట్ల లచ్చన్న 2013లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి సీఐగా పనిచేశారు. ఓ కేసుకు సంబంధించి నిందితుడు ఉప్పల కృష్ణను కోర్టులో హాజరుపరిచేందుకు లచ్చన్న రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో నిందితుడి తల్లి శశికళ ఏసీబీని ఆశ్రయించగా అప్పటి కరీంనగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ టి సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో సీఐని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఇన్స్పెక్టర్ రమణ మూర్తి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయగా ఏసీబీ స్పెషల్ కోర్ట్ పీపీ పి కిషోర్ కుమార్ ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు. ప్రస్తుతం ఈ కేసు ఐఓగా ఇన్స్ పెక్టర్ వై కృష్ణ కుమార్ వ్యవహరిస్తుండగా, ఆధారాలన్నీ పరిశీలించిన స్పెషల్ కోర్టు న్యాయమూర్తి కుమార్ వివేక్ బుధవారం చింతపట్ల లచ్చన్నకు ఐదేండ్ల కఠిన కారాగార శిక్ష, రూ.20వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.