లాటరీ టికెట్ల యాడ్తో రూ.3.18 లక్షల ఫ్రాడ్.. సైబర్​నేరగాళ్లకు చిక్కిన రిటైర్డ్​ ఉద్యోగి

లాటరీ టికెట్ల యాడ్తో రూ.3.18 లక్షల ఫ్రాడ్.. సైబర్​నేరగాళ్లకు చిక్కిన రిటైర్డ్​ ఉద్యోగి

హైదరాబాద్ సిటీ/బషీర్​బాగ్: కేరళ సర్కార్​ఇచ్చే లాటరీ టికెట్లు అంటూ ఫేస్​బుక్​లో వచ్చిన యాడ్ కు స్పందించిన ఓ రిటైర్డ్ ఉద్యోగి సైబర్​నేరగాళ్ల వలలో చిక్కాడు. రూ. 3.18 లక్షలు నష్టపోయాడు. సైబర్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన ఓ రిటైర్డ్​ఉద్యోగి(76) ఇటీవల ఫేస్​బుక్​చూస్తుండగా ‘కేరళ ప్రభుత్వ లాటరీ టిక్కెట్లు’ అనే యాడ్​కనిపింది. 

నిజమేనని నమ్మిన వృద్ధుడు ఆ లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై క్లిక్ చేశాడు. అది ఓ వాట్సాప్ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రీడైరెక్ట్ అయింది. తర్వాత, కొందరు వాట్సాప్ ద్వారా వృద్ధుడిని సంప్రదించారు.  కేరళ ప్రభుత్వం సంవత్సరానికి లాటరీ డ్రా నిర్వహిస్తోందని, టిక్కెట్లు కొనాలని నమ్మబలికారు. నమ్మిన వృద్ధుడు మూడు టిక్కెట్లు కొన్నాడు. కొన్ని రోజుల తర్వాత.. అతను రెండు లాటరీలు గెలిచాడని రూ.5 లక్షలు, రూ.12 లక్షలు బహుమతులుగా వచ్చాయని మెసేజ్​వచ్చింది. 

అయితే, గెలిచిన మొత్తం వృద్ధుడి బ్యాంక్​అకౌంట్లలో జమ చేయడానికి ముందు రిఫండబుల్ ట్యాక్స్, ఇతర ఫీజులు చెల్లించాలని పలు నంబర్ల నుంచి కాల్స్​వచ్చాయి. ఆ మొత్తాన్ని లాటరీ డబ్బుతో కలిపి తిరిగి చెల్లిస్తామని అవతలి వ్యక్తులు నమ్మించారు. దీంతో వృద్ధుడు విడతల వారిగా రూ.3.18లక్షలు పంపాడు. తర్వాత మరికొంత పంపాలని డిమాండ్​చేయడంతో తాను సైబర్​నేరగాళ్లకు చిక్కినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.