- సైబర్ క్రైమ్ పోలీసుల పేరుతో ఫోన్, వీడియో కాల్స్
- డ్రగ్స్ కొరియర్, మనీ లాండరింగ్ పేరుతో చీటింగ్
- ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్స్ వివరాల సేకరణ
- తాము అడిగినంత ఇస్తే కేసు క్లోజ్ చేస్తామంటూ బేరాలు
- లేకుంటే అకౌంట్లు ఫ్రీజ్ చేసి, అరెస్ట్ చేస్తామంటూ బెదిరింపులు
- వలలో పడిన వారి అకౌంట్ల నుంచి రూ.లక్షలు చోరీ
- డబ్బు పోయాక లబోదిబోమంటూ సీసీఎస్ పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితులు
బషీర్ బాగ్, వెలుగు: గ్రేటర్‌సిటీలో సైబర్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎప్పటికప్పుడు రూటు మారుస్తూ సైబర్‌నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, ఐటీ, బ్యాంక్ ఉద్యోగులు, యువకులు, మహిళలు, వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులు ఇలా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. వారి వలలో పడిన వాళ్ల నుంచి దొరికినంత దోచుకుంటున్నారు. బాధితుల బ్యాంక్అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. ‘మీ పేరు మీద విదేశాల నుంచి డ్రగ్స్ పార్సిల్ వచ్చింది.
‘మీ అకౌంట్నుంచి మనీ లాండరింగ్జరిగింది’, ‘మీ ఆధార్‌కార్డును ఉపయోగించి సంఘ విద్రోహ శక్తులు సిమ్‌కార్డు వాడుతున్నారు’ అంటూ డెయిలీ వేల మందికి సైబర్‌నేరగాళ్లు ఫోన్‌కాల్స్ చేస్తున్నారు. తాము సైబర్ క్రైమ్ పోలీసులమని పరిచయం చేసుకుంటున్నారు. అడిగినంత ఇస్తే కేసు క్లోజ్చేస్తామని, లేకుంటే బ్యాంక్అకౌంట్లు ఫ్రీజ్ చేసి, కేసులు బుక్‌చేస్తామని బెదిరిస్తున్నారు. స్పందించిన వారిని అందినకాడికి స్వాహా చేస్తున్నారు. ఇటీవల సైబర్‌నేరగాళ్లు ఎక్కువగా రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్చేస్తున్నట్లు తెలుస్తోంది. సీసీఎస్పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితుల్లో 90 శాతం వారే ఉంటున్నారు.
కాల్స్ కు స్పందిస్తే అంతే..
కాల్స్ కు స్పందించిన వారి నుంచి సైబర్‌నేరగాళ్లు ముందుగా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. సైబర్పోలీసులమని నమ్మించేందుకు ఫేక్పోలీస్యూనిఫాం, ఫేక్ఐడీ కార్ట్స్వేసుకుని వీడియో కాల్స్చేస్తున్నారు. ఫోన్కట్చేస్తే లోకల్పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకుంటారని బెదిరిస్తున్నారు. లైన్లో ఉంచే ఫేక్నోటీసులు పంపిస్తున్నారు. ఆ వెంటనే వెరిఫికేషన్పేరుతో బ్యాంక్అకౌంట్లు, నగదు నిల్వలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వివరాలు తెలుసుకుంటున్నారు. తర్వాత కేసులు బుక్ చేయకుండా ఉండాలంటే అడిగినంత ఇవ్వాలని, లేకుంటే అరెస్ట్‌చేస్తామని భయపెడుతున్నారు. మనీ ట్రాన్స్ఫర్చేయించుకుని, కాల్ కట్ చేస్తున్నారు. ఆ వెంటనే ఫేక్నోటీసులను డిలీట్ చేసి, ఫోన్లను స్విచ్ ఆఫ్ చేస్తున్నారు.
ఈ నెలలోనే ఐదు కేసులు
ఈ నెలలో ఇప్పటివరకు ఐదుగురు రిటైర్డ్ఉద్యోగులు సైబర్ నేరగాళ్ల వలలో పడ్డారు. సిటీకి చెందిన 80 ఏండ్ల రిటైర్డ్ఉద్యోగికి ఈ నెల 4న సైబర్‌నేరగాళ్లు ఫోన్‌చేశారు. ట్రాయ్అధికారులమంటూ పరిచయం చేసుకున్నారు. మీ పేరు మీద రెండు సిమ్ కార్డులు ఉన్నాయని, వాటితో మనీ లాండరింగ్ పాల్పడుతున్నారని చెప్పారు. అడిగినంత ఇవ్వకపోతే కేసులు బుక్చేస్తామంటూ బెదిరించి, వృద్ధుడి అకౌంట్లోని రూ.15లక్షల86వేలు దోచేశారు. జూన్11న సిటీకి చెందిన 63 ఏండ్ల రిటైర్డ్ ఉద్యోగికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు.. మీకు అండర్ వరల్డ్ డాన్దావూద్ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోందని, మీ ఆధార్‌కార్డు మిస్యూజ్అవుతోందని బెదిరించి రూ.20 లక్షలు కొట్టేశారు.
జూన్ 15న సిటీకి చెందిన 65 ఏండ్ల రిటైర్డ్ ఉద్యోగికి కాల్చేసి, మనీ లాండరింగ్ పేరుతో భయపెట్టి రూ.1,23,500 ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. జూన్ 19న ఒక్కరోజే సిటీలోని ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగులను సైబర్ నేరగాళ్లు మోసగించారు. 62 ఏండ్ల రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లోని ఏసీ రిపేర్ చేయించేందుకు గూగుల్‌లో టెక్నీషియన్కోసం వెతుకుతూ సైబర్‌నేరగాళ్లకు చిక్కాడు. వారు చెప్పినట్లు ఓ యాప్ ను డౌన్ లోడ్ చేసి, డీటెయిల్స్ఎంటర్చేయడంతో వృద్ధుడి అకౌంట్లోని రూ.2,11,664 సైబర్‌నేరగాళ్ల అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. మరో కేసులో 78 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు అతని పేరు మీద ముంబై ఎయిర్ పోర్టు నుంచి తైవాన్ కు ఫెడెక్స్ కొరియర్ లో డ్రగ్స్ స్మగ్లింగ్ అవుతున్నాయని బెదిరించారు. రూ.10 లక్షలు దోచేశారు.
ఒక కేసులో మనీ రికవరీ
గతంలో ఫెడెక్స్ కొరియర్ స్కాంలో మోసపోయిన 74 ఏండ్ల రిటైర్డ్ ఉద్యోగి రూ.50లక్షల22వేలు పోగొట్టుకున్నాడు. తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో రికవరీ చేశారు. జూన్ 12న పోగొట్టుకున్న డబ్బును తిరిగి బాధితుడికి అందజేశారు. ఇన్నేండ్లు గౌరవంగా బతికి, కేసుల్లో ఇరుక్కుంటే పరువు పోతుందనే భయంతో ఎక్కువ మంది రిటైర్డ్ఉద్యోగులు సైబర్‌నేరగాళ్లు చెప్పినట్లు చేస్తున్నారు. ఫేక్కాల్స్నిజం అనుకుని అడిగినంత డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. రిటైర్డ్ఉద్యోగులు పిల్లలకు దూరంగా ఉండడం, ఎవరి సలహా తీసుకోవాలో తెలియకపోవడం సైబర్కేటుగాళ్లకు కలిసివస్తోంది. వారి బలహీనతలను క్యాష్ చేసుకుంటున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్ని ప్రకటనలు చేస్తున్నా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
పోలీసులు వీడియో కాల్స్చేయరు
గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరిస్తే వెంటనే కట్ చేయండి. నేర ఆరోపణలు చేస్తే భయపడొద్దు. దగ్గర్లోని పోలీస్‌స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయండి. ముఖ్యంగా ఫెడెక్స్ కొరియర్, ట్రాయ్, బ్యాంక్ అధికారులం అంటూ కాల్స్ వస్తే జాగ్రత్తగా వ్యవహరించండి. స్కామర్ల ఉచ్చులో పడొద్దు. భయపడిపోయి డబ్బు ట్రాన్స్ఫర్చేయొద్దు. పోలీసులతోపాటు ఏ అధికారులూ ఎంక్వైరీ పేరిట వీడియో కాల్స్చేయరు. నోటీసులను ఆన్లైన్లో పంపరు. సైబర్‌నేరగాళ్ల బాధితులు ఉంటే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి లేదా cybercrime.gov.inకు ఫిర్యాదు చేయాలి.
శివ మారుతి, సైబర్ క్రైమ్ ఏసీపీ