కాళేశ్వరం బ్యారేజీలకు క్లియరెన్సులు..డీపీఆర్ లకు ఆమోదం తెలిపింది కేేసీఆరే: వెంకటేశ్వర్లు

కాళేశ్వరం బ్యారేజీలకు క్లియరెన్సులు..డీపీఆర్ లకు ఆమోదం తెలిపింది కేేసీఆరే: వెంకటేశ్వర్లు

 

  • కాళేశ్వరం బ్యారేజీలకు క్లియరెన్సులు ఇచ్చింది, 
  • డీపీఆర్​లకు ఆమోదం తెలిపిందీ ఆయనే
  • కమిషన్​కు కీలక డాక్యుమెంట్లు అందజేసిన రిటైర్డ్​ ఈఎన్​సీ వెంకటేశ్వర్లు 

హైదరాబాద్​, వెలుగు: కాళేశ్వరం బ్యారేజీలకు క్లియరెన్సులు ఇచ్చింది.. డీపీఆర్​లకు ఆమోదం తెలిపింది.. వాటి నిర్మాణానికి ఆర్డర్స్ ​జారీ చేసింది.. బ్యారేజీల్లో  నీళ్లు నింపాలని చెప్పింది.. అన్నీ కేసీఆరేనని కాళేశ్వరం జ్యుడీషియల్  కమిషన్​ ముందు రిటైర్డ్​ ఈఎన్​సీ నల్లా వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు క్లియరెన్సులు, డీపీఆర్​లకు ఆమోదం వంటి కీలకమైన డాక్యుమెంట్లను కమిషన్​కు ఆయన అందజేశారు. వ్యాప్కోస్​ తయారు చేసిన డీపీఆర్​లను రెండు భాగాలుగా సమర్పించారు. ఆ డీపీఆర్​లకు అప్పటి సీఎం కేసీఆర్​ ఆమోదం తెలిపారని ఆయన పేర్కొన్నారు. సోమవారం కమిషన్​ ముందు విచారణకు రిటైర్డ్​ ఈఎన్​సీ నల్లా వెంకటేశ్వర్లు హాజరయ్యారు. సెంట్రల్​ డిజైన్స్​ ఆర్గనైజేషన్​ (సీడీవో) సీఈ సీకెంట్​ పైల్స్​ను సూచిస్తూ కాళేశ్వరం ప్రాజెక్ట్​ సీఈకి రాసిన ఉత్తరప్రత్యుత్తరాల డాక్యుమెంట్లను ఇచ్చారు. వాటితో పాటు డీపీఆర్​లో మార్పులను సూచిస్తూ 2016 సెప్టెంబర్​ 14, 2016 అక్టోబర్​ 22న జరిగిన హైపవర్​ కమిటీ మీటింగ్​ మినిట్స్​ను అందించారు. బ్యారేజీల నిర్మాణానికి కావాల్సిన అన్ని క్లియరెన్సులకు నాటి ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటి డాక్యుమెంట్లను కమిషన్​ ముందు దాఖలు చేశారు. బ్యారేజీల నిర్మాణం, డిజైన్లకు సంబంధించి ఫార్మల్​ ఆర్డర్స్​ ఎవరిచ్చారన్న కమిషన్​ ప్రశ్నకు.. అప్పటి సీఎం ఆమోదం తెలిపారన్న వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. నాడు సీఎం హోదాలో కేసీఆర్​ నిర్వహించిన మీటింగ్​ మినిట్స్​ను, ఫార్మల్​ ఆర్డర్స్​ కాపీలను ఆయన కమిషన్​కు అందజేశారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల లే అవుట్​ మార్పులకు సంబంధించిన వివరాలతో కూడిన డాక్యుమెంట్లను కూడా సమర్పించారు. మూడు బ్యారేజీల వద్ద చేసిన జియో టెక్నికల్​ పరీక్షలు, ఆ పరీక్షల్లో వెల్లడైన ఫలితాల రిపోర్టులను సబ్​మిట్​చేశారు. 14 వాల్యూమ్​ల జియోటెక్నికల్​ ఇన్వెస్టిగేషన్​ రిపోర్టులను అందజేశారు. 

నీళ్లు నింపాలని నాటి ప్రభుత్వాధినేతే చెప్పారు..

మేడిగడ్డ బ్యారేజీలో నీటిని నింపాలంటూ అప్పటి ప్రభుత్వాధినేతే (హెడ్​ ఆఫ్​ ద గవర్నమెంట్​) చెప్పారని రిటైర్డ్​ ఈఎన్​సీ నల్లా వెంకటేశ్వర్లు మరోసారి స్పష్టం చేశారు. బ్యారేజీలో నీటిని నిల్వ చేయడంతో సమస్య ఏర్పడిందన్నారు. అంతేగాకుండా బ్యారేజీకి దిగువన సరైన స్థాయిలో టెయిల్​ వాటర్​ లేకపోవడం వల్ల బ్లాక్​ 7లోని పిల్లర్లు కుంగాయని పేర్కొన్నారు. గేట్లు తెరిచినప్పుడు వచ్చే వరద వేగాన్ని నియంత్రించేందుకు సరైన ఏర్పాట్లు చేయకపోవడమూ బ్యారేజీ కుంగుబాటుకు కారణమన్నారు. తెలంగాణ ఇంజనీరింగ్​ రీసెర్చ్​ లేబొరేటరీ చేసిన 2డీ, 3డీ మోడల్​ స్టడీస్​ రిపోర్టులను కమిషన్​కు సమర్పించారు. మూడు బ్యారేజీలను సీఈ స్థాయిలో తాను సందర్శించానని.. అయితే, బ్యారేజీల్లో లోపాలను సరి చేయాలంటూ ఫీల్డ్​ ఇంజనీర్లు (ఎగ్జిక్యూటివ్​ ఇంజనీర్లు) ఏజెన్సీలకు చెప్పారని, అందుకు సంబంధించి లేఖలు కూడా రాశారని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బ్యారేజీ డీవాటరింగ్​కు సంబంధించి కాంట్రాక్ట్​ సంస్థలకు చెల్లించిన బిల్లుల డాక్యుమెంట్లను కూడా సమర్పించారు. కుంగిన పిల్లర్ల దగ్గర తవ్వడం ద్వారా వాటికి ఏ సమస్య ఏర్పడిందో తెలుసుకోవచ్చని, సరైన కారణమూ తెలుస్తుందని కమిషన్​కు ఆయన వివరించారు.