- వ్యాప్కోస్ డిజైన్లను పక్కనపెట్టి.. కొత్త డిజైన్లు చేసిన్రు
- కాళేశ్వరం కమిషన్ ముందు రామగుండం రిటైర్డ్ ఈఎన్సీ వెంకటేశ్వర్లు వెల్లడి
- మూడు బ్యారేజీలు, పంప్‌హౌస్‌లకు వ్యాప్కోస్ అంచనాలు రూ.13,996 కోట్లే
- గేట్ల సంఖ్య పెంచి.. సైజు తగ్గించారు.. సీకెంట్ పైల్స్‌ను సూచించింది సీడీవోనేనని వ్యాఖ్య
- ఆ సమాధానంపై జస్టిస్ ఘోష్ ఫైర్.. సీడీవో డిజైన్లు మాత్రమే చేస్తుందంటూ మండిపాటు
- ఏ పైల్స్ వాడాలో చెప్పాల్సింది ప్రాజెక్ట్ సీఈ, ఫీల్డ్ ఇంజనీర్లన్న జస్టిస్ ఘోష్
- కమిషన్‌కు తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు:మేడిగడ్డ బ్యారేజీపై వ్యాప్కోస్ ఇచ్చిన డిజైన్లు, డీపీఆర్‌ను పరిగణనలోకి తీసుకోలేదని కాళేశ్వరం కమిషన్‌కు మాజీ ఈఎన్సీ (రామగుండం) నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. ఆ డిజైన్ల ప్రకారం కాకుండా కొత్త డిజైన్లతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని, వ్యాప్కోస్ సూచించిన లొకేషన్లో కాకుండా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల స్థలాలను మార్చారని పేర్కొన్నారు. నాటి ప్రభుత్వాధినేత నిర్ణయం, ఆదేశాల మేరకే తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన బ్యారేజీని మేడిగడ్డకు మార్చారన్నారు.
కేబినెట్లో చర్చించాకే దానిపై నిర్ణయం జరిగిందన్నారు. ఆ తర్వాత 2015 ఏప్రిల్ 13న బ్యారేజీ లొకేషన్‌ను మార్చారని వివరించారు. వ్యాప్కోస్ ఇచ్చిన డిజైన్లలో మార్పులు చేశారని పేర్కొన్నారు. గేట్లను పెంచారని, వాటి ఎత్తు తగ్గించారని చెప్పారు. మూడు బ్యారేజీలు, పంప్‌హౌస్‌లకు వ్యాప్కోస్ రూ.13,996 కోట్ల అంచనాలను ఇస్తే.. దానిని రెండు సార్లు సవరించారని వెల్లడించారు. శనివారం కాళేశ్వరం జుడీషియల్ కమిషన్.. ఆయన్ను ఓపెన్ కోర్టులో భాగంగా విచారించింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లుపై కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు డిజైన్లకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చారంటూ మండిపడ్డారు.
బ్యారేజీలు, డిజైన్లలో మార్పులు
మేడిగడ్డ బ్యారేజీకి 85 గేట్లు, 1632 మీటర్ల పొడవుతో వ్యాప్కోస్ డిజైన్ ఇచ్చిందని, బ్యారేజీలో స్లూయిస్ గేట్ల సైజును 15/15 మీటర్లు, ప్రధాన గేట్లను 15/14 మీటర్ల సైజుతో ప్రతిపాదించిందని వెంకటేశ్వర్లు చెప్పారు. అయితే, బ్యారేజీ గేట్ల సంఖ్యను పెంచనప్పటికీ గేట్ల ఎత్తును మార్చారని చెప్పారు. స్లూయిస్ గేట్ల ఎత్తును 15/13.30 మీటర్లు, ప్రధాన గేట్లను 15/12.3 మీటర్లకు తగ్గించారని చెప్పారు. గరిష్ట వరద ప్రవాహం మేరకు సీడీవో వాటిని ప్రతిపాదించిందని గుర్తు చేశారు. ఎఫ్‌ఆర్‌ఎల్‌ను 100 మీటర్లుగా నిర్ధారించారని చెప్పారు.
కాగా, ప్రాజెక్టుకు అన్ని అనుమతులను తీసుకున్నారా? అని కమిషన్ ప్రశ్నించగా.. 2017 నుంచి 2018 మధ్యే అన్ని అనుమతులను తీసుకున్నామని, అవసరమైన 11 విభాగాల అనుమతులన్నీ 2018 జూన్ నాటికే ప్రాజెక్టుకు వచ్చాయని తెలిపారు. 2016 జనవరి 17న అప్పటి సీఎం సమావేశం నిర్వహించారని, ఆ సమావేశంలోనే మేడిగడ్డ డీపీఆర్‌ను వ్యాప్కోస్ సమర్పించిందని వెంకటేశ్వర్లు తెలిపారు. ఆ తర్వాత ఫిబ్రవరి 2017లో డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్)కు పంపించగా.. 2018 జూన్‌లో ఆమోదం లభించిందని చెప్పారు.
లొకేషన్లను వ్యాప్కోస్ సూచించిందా అని కమిషన్ ప్రశ్నించగా.. కరీంనగర్ సీఈ ప్రతిపాదనలకు అనుగుణంగా వ్యాప్కోస్ డీపీఆర్ లో లొకేషన్లను మార్చిందన్నారు. కేబినెట్‌కు మాత్రమే లొకేషన్లను మార్చే అధికారం ఉంటుంది కదా.. వ్యాప్కోస్ ఎలా లొకేషన్లను మారుస్తుంది? అని కమిషన్ నిలదీసింది. 2016 అక్టోబర్ 22న నిర్వహించిన హైపవర్ కమిటీ సమావేశంలో నాటి ప్రభుత్వ ఆదేశాలతో వ్యాప్కోస్ లొకేషన్ల మార్పు ప్రతిపాదనలు చేసిందని ఈఎన్సీ చెప్పారు. అయితే, హైపవర్ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారని కమిషన్ ప్రశ్నించింది.
Also Read:-యాదగిరిగుట్ట గోపురానికి బంగారు తాపడం..80కిలోల దాకా వినియోగించే చాన్స్
2014 జులై 22న జీవో 10 ద్వారా హైపవర్ కమిటీని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఈఎన్సీ బదులిచ్చారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించకముందే ఈ హైపవర్ కమిటీని ఏర్పాటు చేసి బ్యారేజీల లొకేషన్లను మార్చేశారా? అని కమిషన్ ప్రశ్నించగా.. దానిని రాష్ట్రంలోని అన్ని బ్యారేజీల కోసం ఏర్పాటు చేశారని ఈఎన్సీ వివరించారు.
లొకేషన్లను ఎందుకు మార్చారు?
బ్యారేజీల లొకేషన్లను ఎందుకు మార్చాల్సి వచ్చిందంటూ మాజీ జస్టిస్ ఘోష్ ప్రశ్నించారు. రైతుల విలువైన, సారవంతమైన భూములు ముంపుకు గురికాకుండా ఉండేందుకు లొకేషన్లను మార్చారని వెంకటేశ్వర్లు తెలి పారు. అన్నారం బ్యారేజీ నుంచి సుందిళ్ల లిఫ్ట్‌కు మధ్య గ్రావిటీ కెనాల్ పొడవును తగ్గించేందుకు సుందిళ్ల బ్యారేజీ లొకేషన్‌ను మార్చాల్సి వచ్చిందన్నారు. సుందిళ్ల హెడ్‌రెగ్యులేటర్ సిస్టమ్‌ను తగ్గించి విద్యుత్ వాడకాన్ని తగ్గించేందుకు, సుందిళ్ల దిగువన ఉన్న అన్నారం కెపాసిటీని 5.11 నుంచి 8.83 టీఎంసీలకు పెంచేందుకు సుందిళ్ల లొకేషన్‌ను మార్చారన్నారు.
మేడిగడ్డ నుంచి అన్నారం దూరాన్ని తగ్గించేందుకు, అటవీ భూముల ముంపును తగ్గించేందుకు అన్నారం లొకేషన్‌ను తగ్గించారని, అందుకు హైపవర్ కమిటీ ఆమోదం తెలిపి పనులకు ఓకే చెప్పిందని గుర్తు చేశారు. ఈ మార్పులను వ్యాప్కోస్ తిరస్కరించలేదా? అని కమిషన్ ప్రశ్నించగా.. హైపవర్ కమిటీ మీటింగ్‌లో వ్యాప్కోస్ తరఫున ప్రతినిధి కూడా ఉన్నారని, ఆమోదం తెలిపారని చెప్పారు. మరి, మీటింగ్ మినిట్స్‌పై వ్యాప్కోస్ ప్రతినిధి సంతకం తీసుకున్నారా అని కమిషన్ ప్రశ్నించగా.. తీసుకోలేదని, అది చైర్మన్ పరిధిలోనే ఉంటుందన్నారు.
2016 జనవరి 17న డీపీఆర్‌తో పాటే ఇచ్చిన ఎస్టిమేట్స్‌లో వ్యాప్కోస్ రూ.13,996 కోట్లుగా పేర్కొందని వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. కాగా ఆ అంచనాలను రెండు సార్లు సవరించారని తెలిపారు. అంచనాలను ఎవరు సవరించారని కమిషన్ ప్రశ్నించింది. 2018 మే 19న తొలిసారిగా అంచనాలను సవరిస్తూ నాటి ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జీవో 707ను జారీ చేశారని చెప్పారు.
కమిషన్‌కు తప్పుడు సమాచారమిస్తరా..
షీట్ పైల్స్‌కు వెళ్లాలని డీపీఆర్‌లో వ్యాప్కోస్ పేర్కొందా అని కమిషన్ అడిగిన ప్రశ్నకు వెంకటేశ్వర్లు బదులిచ్చారు. అయితే, ఎన్ఐటీ వరంగల్, చెన్నై ఐఐటీ రిటైర్డ్ ప్రొఫెసర్లు జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్, ఇతర స్టడీస్ ద్వారా సీకెంట్ పైల్స్ లేదా సూటబుల్ పైల్స్‌ను వినియోగించుకోవచ్చని సూచించారన్నారు. వాటి ఆధారంగా సీఈసీడీవో సీకెంట్ పైల్స్‌తో పాటు డయాఫ్రం వాల్లను సూచించిందన్నారు.
మేడిగడ్డ బ్యారేజీలో ఏ పైల్స్‌ను ఆమోదించారని కమిషన్ ప్రశ్నించగా.. బ్లాక్1, బ్లాక్2 కటాఫ్స్లలో ఆర్సీసీ డయాఫ్రంవాల్ను వినియోగించగా.. బ్లాక్ 3 నుంచి బ్లాక్ 8 వరకు సీకెంట్ పైల్స్‌ను సీఈసీడీవో సూచించారని పేర్కొన్నారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్.. నిజంగా సీడీవో సీకెంట్ పైల్స్‌ను సూచించిందా అని ప్రశ్నించారు. దానికి అవునని వెంకటేశ్వర్లు చెప్పడంతో.. జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజైన్ల బాధ్యత చూసే సీడీవో వింగ్.. ఫలానా పైల్సే వాడాలని ఎలా సూచిస్తుందని మండిపడ్డారు. విచారణకు మళ్లీ రావాలని ఆదేశించారు.
మేడిగడ్డ బ్యారేజీ ఎందుకు కుంగింది?
మేడిగడ్డ బ్యారేజీ ఎందుకు కుంగిందని కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించింది. వరదలు వచ్చినప్పుడు గేట్లు ఎత్తాక నీళ్లు స్టిల్లింగ్ బేసిన్లో పడకుండా అమితమైన వేగంతో ఒకేసారి దూసుకొచ్చాయని, దాని ప్రభావం వల్లే సీసీ బ్లాకులు, లాంచింగ్ ఆప్రాన్లు కొట్టుకుపోయి ఉంటాయని వెంకటేశ్వర్లు తెలిపారు. బ్లాక్ 7పై తీవ్ర ప్రభావం అందుకే పడి ఉంటుందని చెప్పారు. సీకెంట్ పైల్స్‌లో పైపింగ్ కూడా అందుకు కారణమై ఉంటుందని చెప్పారు.
మోడల్ స్టడీస్ పూర్తయ్యాక 2018 మే 16న ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీ ప్రతినిధులతో కలిసి సీడీవో అధికారులు బ్యారేజీని ఎందుకు సందర్శించాల్సి వచ్చింది? అని కమిషన్ ప్రశ్నించింది. ప్రాజెక్ట్ సైట్ కండిషన్‌ను తెలుసుకునేందుకు సీడీవో అధికారులు తీసుకెళ్లి ఉండొచ్చునని చెప్పారు.