
- వేధింపులు భరించలేక బాధితుడు ఫిర్యాదు
- ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన మిర్యాలగూడ పోలీసులు
మిర్యాలగూడ, వెలుగు : రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ కు మహిళను ఎరగా వేసి .. వీడియోలు, ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి రూ. లక్షల్లో వసూలు చేసిన ఇద్దరి నిందితులను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం మీడియా సమావేశంలో కేసు వివరాలను డీఎస్పీ రాజశేఖర్ రాజు వెల్లడించారు.
మిర్యాలగూడ టౌన్ శాంతినగర్ కు చెందిన రిటైర్డ్ ఎంప్లాయ్ రాగడప బీట్ సెక్షన్ ఆఫీసర్ గా పనిచేసే సమయంలో తిరుమలగిరి (సాగర్) మండలం గట్టుమీద తండాకు చెందిన ఆంగోతు గణేశ్ ను తన వద్ద అసిస్టెంట్ గా నియమించుకున్నారు. కాగా అధికారిని గణేశ్ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయాలని ప్లాన్ చేశాడు. ఇద్దరూ కలిసి 2022లో సూర్యాపేటలో మద్యం తాగారు.
ఇదే అదునుగా భావించిన గణేశ్ సదరు ఫారెస్ట్ ఆఫీసర్ వద్దకు మహిళను పంపించి సన్నిహితంగా మెలగాలని సూచించి.. వీడియోలు, ఫొటోలు తీశాడు. అనంతరం వాటిని అధికారికి చూపించి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. 2022 నుంచి 2024 వరకు19 ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు తీసుకుని ఆఫీసర్ కుమార్తె, అల్లుడికి చూపించి వడ్డీతో పాటు హోమ్ లోన్ కింద రూ. 46 లక్షలు వసూలు చేశాడు. గణేశ్ భార్య ప్రమీల కూడా ఇదే తరహాలో బ్లాక్ మెయిల్ చేసి కొంత డబ్బు వసూలు చేసి బంగారం, కారు కొనుగోలు చేసింది.
తిరుమలగిరి మండలం ఎల్లాపురం తండాకు చెందిన గణేశ్బావమరిది శంకర్ తన వద్ద వీడియోలు, ఫొటోలు ఉన్నాయని ఆఫీసర్ ను బెదిరించి మరో రూ. 2.55 లక్షలను ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు. గత ఫిబ్రవరిలో ఇంకో రూ. 3 లక్షలు ఇవ్వకపోతే చంపుతానని బెదిరించడంతో విసిగిపోయిన బాధితుడు కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పగా.. టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
నిందితులైన గణేశ్, కుర్ర శంకర్ ను అరెస్ట్ చేసి.. రూ. 14 లక్షల నగదు, స్మార్ట్ ఫోన్, 4.05 తులాల గోల్డ్, 10 ఒరిజినల్, 9 జిరాక్స్ ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే విజయపురి టౌన్, తిరుమలగిరి, వాడపల్లి పీఎస్ ల్లో గణేశ్‌పై ట్రాన్స్ ఫార్మర్ల నుంచి కాపర్ వైరు చోరీ కేసులు నమోదై ఉన్నాయి. కేసును ఛేదించిన టు టౌన్ సీఐ పి. నాగార్జున, ఎస్ ఐలు డి. హరీశ్‌రెడ్డి, బి. రాంబాబు, కానిస్టేబుళ్లను ఎస్సీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.