ముషారఫ్ పనులే పట్టించాయి

జనరల్​ ముషారఫ్​కి ఇండియా అతిథి మర్యాదలు చేస్తే… ఆయన మనపై కార్గిల్​లో సైన్యాన్ని ఉసిగొల్పారు. పాకిస్థాన్​ని ఏడేళ్లపాటు మిలటరీ సాయంతో నడిపించారు. తనను అడ్డగోలుగా ప్రమోట్​ చేసిన నవాజ్​ షరీఫ్​ను నానా తిప్పలు పెట్టారు. చివరకు దేశ ద్రోహం కింద మరణ శిక్షకు గురయ్యారు. చాలా ఏళ్లుగా దుబాయ్​లో తలదాచుకుంటున్న ముషారఫ్​… పాక్​ చరిత్రలో ఈ క్యాపిటల్​ పనిష్మెంట్​కి గురైన రెండో లీడర్​గా మిగిలారు.

పాకిస్థాన్​ చరిత్రలో మరో స్ట్రాంగ్​ లీడర్​కి మరణ శిక్ష పడింది. గతంలో జుల్ఫికర్​ అలీ భుట్టోకి మిలటరీ పాలనలో ఉరి శిక్ష పడితే, ఈసారి పర్వేజ్​ ముషారఫ్​కి పార్లమెంటరీ సిస్టమ్​లో క్యాపిటల్​ పనిష్మెంట్​ పడింది. ఈ ఇద్దరూ కూడా పాకిస్థాన్​కి ప్రెసిడెంట్లుగా పనిచేసినవాళ్లే.  రిటైర్డ్​ జనరల్​ పర్వేజ్​ ముషారఫ్​పై దేశ ద్రోహ నేరం కింద ముగ్గురు జడ్జిల ధర్మాసనం మరణ దండన విధించింది.  పాకిస్థాన్​ను మిలటరీ రూల్​తో నడిపించిన మూడో కమాండర్​ ముషారఫ్​. 1999లో ప్రజాస్వామికంగా ఎన్నికైన నవాజ్​ షరీఫ్​ని కూలదోసి, మిలటరీ పాలన ఏర్పాటు చేశారు. అధికారం చేజారే పరిస్థితులు రాగానే దేశంలో ఎమర్జెన్సీ విధించి, రాజ్యాంగాన్ని సస్పెండ్​ చేశారు. గతంలో మిలటరీ తిరుగుబాటు చేసి ఎక్కువ కాలం పాలించిన జనరల్​ ఆయూబ్​ ఖాన్​గానీ, జియావుల్​ హక్​గానీ మరణ శిక్షలకు గురి కాలేదు. దేశ ద్రోహ నేరంపై ఉరి శిక్షకు గురైన మొట్టమొదటి సైనిక పాలకుడు ముషార్రఫే. ఈ నిర్ణయం పాకిస్థాన్​ వ్యవహారాలు తెలిసినవాళ్లకు అంతగా ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. ఎందుకంటే… మన దేశంకంటే ఒక రోజు ముందే ఇండిపెండెన్స్​ తెచ్చుకున్న పాకిస్థాన్​…. ఇప్పటికీ స్థిరమైన ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడలేక పోయింది. ఏ ప్రభుత్వమూ అయిదేళ్ల పూర్తి కాలం నడవలేదు. దాదాపు 73 ఏళ్ల స్వతంత్ర పాకిస్థాన్​ హిస్టరీలో సుదీర్ఘకాలం నడిచింది జనరల్​ జియావుల్​ హక్​ మిలటరీ ప్రభుత్వమే. ఆయన 1978 నుంచి 1988 వరకు 10 ఏళ్లపాటు సైనిక పాలన సాగించారు. ఆ తర్వాత రికార్డు జనరల్​ పర్వేజ్​ ముషారఫ్ (2001–08), ఆయూబ్​ ఖాన్​ (1958–63) సాధించారు. వీరిలో ఆయూబ్​సెకండ్​ టర్మ్​ని (1965–69) ఎన్నికల్లో గెలిచి దక్కించుకున్నారు.

జియా‌, ముషారఫ్​ల మధ్య చాలా పోలికలు

జియావుల్​ హక్​, పర్వేజ్​ ముషారఫ్​ ఇద్దరికీ పోలికలున్నాయి. వీళ్లిద్దరూ ఇండియాలో పుట్టినవాళ్లే. జియావుల్​ పంజాబ్​లోని జలంధర్​లో పుట్టగా, ముషారఫ్​ ఢిల్లీలో పుట్టారు. అలాగే, తమకు ప్రమోషన్​ ఇచ్చినవాళ్లను మిలటరీ తిరుగుబాటుతో దింపేసి జైలు పాలుచేశారు. లెఫ్టినెంట్​ జనరల్​గా ఉన్న జియావుల్​కి 1976లో అప్పటి ప్రధానమంత్రి జుల్ఫికర్​ అలీ భుట్టో చీఫ్​ ఆఫ్​ ఆర్మీ స్ఠాఫ్​గా ప్రమోషన్​ ఇచ్చారు. జియా కంటే ముందు వరుసలో ఆర్మీ చీఫ్​ కాగలిన లెఫ్టినెంట్​ జనరల్స్​ ఆరుగురు ఉన్నప్పటికీ, వాళ్లను కాదని ఏడోవాడైన జియావుల్​ని ప్రమోట్​ చేశారు భుట్టో.  అయితే, జనరల్​ అయిన మర్నాటి నుంచే తన రంగు బయటపెట్టుకున్నారు జియా. ఆయన ఏనాడూ భుట్టోని ‘మిస్టర్​ ప్రైమ్​ మినిస్టర్​’ అని గౌరవించలేదట! భుట్టోని ‘సార్’ అనే పిలిచేవాడంటారు. కేవలం రెండేళ్లకే భుట్టోని సైనిక తిరుగుబాటుద్వారా దింపేసి, చివరకు ఉరి శిక్ష పడేలా చేశారు. జనరల్​ జియాకి రాజకీయాలపై ఆసక్తి లేదని, మత ఆచారాలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్​ చూపిస్తారని భుట్టో భావించి దెబ్బ తిన్నట్లు చెబుతారు.

ఇదే రకంగా 1998లో అప్పటి పాక్ ప్రధానమంత్రి నవాజ్​ షరీఫ్​కూడా జనరల్​ ముషారఫ్​ విషయంలో పప్పులో కాలేశారు. ముషారఫ్​ కంటే ఇద్దరు లెఫ్టినెంట్​ జనరల్స్​ ఉన్నాగానీ, వాళ్లను కాదని ప్రమోషన్​ ఇచ్చారు షరీఫ్​. మిగతా ఇద్దరిలో లెఫ్టినెంట్​ జనరల్​ అలీ కులీ ఖాన్​కి మహా సమర్థుడైన సైనికాధికారిగా పేరుండగా, మరొకరు ఖాలిద్​ నవాజ్​ ఖాన్​కి చాలా స్ట్రిక్ట్​ మిలటరీ ఆఫీసర్​గా పేరుంది. వీళ్లిద్దరిలో ఎవరిని ప్రమోట్​ చేసినా తనపై తిరుగుబాటు చేసే ప్రమాదముందని షరీఫ్​ భావించారు. కేవలం రెండున్నరేళ్లకే సైనిక తిరుగుబాటుతో షరీఫ్​ని దింపేశారు ముషారఫ్​.

అసలు వీళ్ల మధ్య తగాదా రావడానికి కారణం… కార్గిల్​ యుద్ధం. ప్రధానమంత్రిని అయిన తనకు చెప్పా పెట్టకుండా జనరల్​ ముషారఫ్​ సొంత నిర్ణయాలు తీసుకున్నాడని నవాజ్​ షరీఫ్​ బుకాయించినట్లు చెబుతారు.  అయితే, ఎప్పటికప్పుడు సరిహద్దుల్లో జరుగుతున్న విషయాలను షరీఫ్​ దృష్టికి తెచ్చానని జనరల్​ ముషారఫ్​ గట్టిగా వాదించారు. అందుకు సాక్ష్యంగా తనకు ఆయనకు మధ్య జరిగిన ఏడు సమావేశాల వివరాల్ని నోట్​బుక్​లో రాసుకున్నానని జనరల్​ ముషారఫ్​ బయటపెట్టారు. అయితే, కార్గిల్​ యుద్ధంతో పాటుగా సైన్యంలో ప్రమోషన్లకు సంబంధించికూడా షరీఫ్, ముషారఫ్​ల మధ్య విభేదాలు తలెత్తాయని పాకిస్థానీ పాలిటిక్స్​పై ఎనలిస్టులు చెబుతున్నారు.

పాకిస్థాన్​పై చెరగని ముద్రలు వేసిన ఇద్దరు జనరల్స్​కిగల మరో పోలిక చెప్పాలంటే… వీళ్లిద్దరికీ సహజ మరణాలు లేవనే చెప్పాలి. జనరల్​ జియావుల్​ హక్​ 1988లో విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. తాజాగా, ముషారఫ్​కి పాక్​ సుప్రీం కోర్టు ముగ్గురు హైకోర్టు జడ్జీలతో నియమించిన బెంచ్​ మరణ శిక్ష వేసింది. జనరల్​ ముషారఫ్​ 2001లో అధికారానికొచ్చాక ఎలక్షన్ల జోలికి వెళ్లలేదు. ఎప్పటికప్పుడు సాకులతో వాయిదా వేస్తూ వచ్చారు. దేశంలో పొలిటికల్​ పార్టీల వత్తిడి పెరగడంతో 2007లో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాశాడన్నది ప్రధాన ఆరోపణ.

ఆయన పరోక్షంలోనే కోర్టు మరణ శిక్ష విధించింది. అలాగే, ముషారఫ్​ చేతిలో నానా ఇబ్బందులు పడి, ప్రస్తుతం అవినీతి కేసులో పదేళ్ల జైలు శిక్షకు గురైన నవాజ్​ షరీఫ్​ కూడా లండన్​లో గడుపుతున్నారు. దుబాయ్​ నుంచి ముషారఫ్​ని, లండన్​ నుంచి షరీఫ్​ని రప్పించడానికి ఆయా దేశాలు అంగీకరించక పోవచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు.

అరెస్టులు, మరణ శిక్షలు

జుల్ఫీకర్​ అలీ భుట్టో 1971 నుంచి 73 వరకు ప్రెసిడెంట్​గా పనిచేసి, ఆ తర్వాత పార్లమెంటరీ సిస్టమ్​ ద్వారా ఎన్నికలు జరిపించి ప్రధాని అయ్యారు. 1977లో ఆయన నియమించిన ఆర్మీ చీఫ్​ జనరల్​ జియావుల్​ హక్​ తిరుగుబాటుతో పదవి కోల్పోయారు. ప్రతిపక్షానికి చెందిన ఒక యువ నాయకుడిని హత్య చేయించడానికి కుట్ర పన్నారన్న ఆరోపణపై జనరల్​ జియా ఆయనను అరెస్టు చేశారు. ఆ తర్వాత భుట్టోకి కోర్టు మరణ శిక్ష విధించగా, అయిదు నెలల తర్వాత రావల్పిండిలో ఉరి తీసేశారు.

నవాజ్​ షరీఫ్ ప్రభుత్వాన్ని కూలదోయగానే ఆయనను హౌస్​ అరెస్టు చేయించారు ముషారఫ్​. ఆయనపై హైజాకింగ్​, కిడ్నాపింగ్, హత్యాయత్నం, ముషారఫ్​ విమానం కరాచీలో దిగకుండా కుట్ర చేశారన్న ఆరోపణలు మోపారు.  యాంటీ కరప్షన్​ కోర్టు ఆయనకు పదేళ్ల జైలు శిక్ష విధించింది.